వెంట్రుకలు రాలడం తగ్గాలంటే..?


Sun,April 10, 2016 11:24 AM

మానసిక ఒత్తిడి, పౌష్టికాహార లోపం, దీర్ఘకాలిక వ్యాధులు... ఇలా కారణాలు ఏమున్నా నేడు అధిక శాతం మంది బాధపడుతున్న సమస్యల్లో హెయిర్‌లాస్ కూడా ఒకటి. ఈ క్రమంలో హెయిర్‌లాస్ సమస్యతో ఇబ్బందులు పడుతున్న వారు దాన్ని ఆపడం కోసం అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే కింద ఇచ్చిన పలు సహజ సిద్ధమైన చిట్కాలను పాటిస్తే హెయిర్‌లాస్‌ను అధిక శాతం వరకు అడ్డుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.

1. కొబ్బరి నూనె, ఆవ నూనె, బాదం నూనె వంటి వాటిని ఉపయోగించి వారంలో కనీసం 3 నుంచి 4 సార్ల వరకు వెంట్రుకలకు సున్నితంగా మసాజ్ చేయాలి. అనంతరం దాదాపు 6 గంటల పాటు జుట్టును అలాగే వదిలేయాలి. తరువాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి. దీని వల్ల చుండ్రు, ఫంగస్ ఇన్‌ఫెక్షన్లు చాలా వరకు తగ్గుముఖం పడతాయి. వెంట్రుకలకు ఆరోగ్యం చేకూరుతుంది.

2. కొబ్బరిపాలు, కొబ్బరి నూనె, ఆమ్లా ఆయిల్, నిమ్మరసం తదితరాలను కొద్ది కొద్దిగా తీసుకుని అన్నింటినీ బాగా కలిపి కుదుళ్లకు తగిలేలా జుట్టుకు పట్టించాలి. కొంత సేపటి తరువాత తలస్నానం చేయాలి. ఇది చుండ్రు సమస్యను తగ్గించడంతోపాటు జుట్టుకు సంరక్షణనిస్తుంది. హెయిర్‌లాస్‌ను అడ్డుకుంటుంది.

3. అలోవెరా (కలబంద), గోధుమ గడ్డి జ్యూస్‌లను తరచూ సేవించినా హెయిర్ ఫాల్‌ను అడ్డుకోవచ్చు. అలోవెరా జెల్‌ను జుట్టు కుదుళ్లకు పట్టించి తలస్నానం చేసినా వెంట్రుకలకు ఆరోగ్యం కలుగుతుంది. వారంలో ఇలా కనీసం రెండు సార్లు చేస్తే చక్కని ఫలితం ఉంటుంది.

4. కొబ్బరినూనెలో మెంతులను వేసి వేయించిన అనంతరం వచ్చే మిశ్రమాన్ని వడకట్టి ఆ ద్రవాన్ని జుట్టు కుదుళ్లకు పట్టించాలి. లేదా ఆవ నూనెలో కొన్ని గోరింటాకులను వేసి మరిగించి, అనంతరం వచ్చిన ద్రవాన్ని చల్లబరిచి వడకట్టాలి. దీంట్లో నుంచి రోజూ కొన్ని చుక్కల ద్రవాన్ని కొబ్బరినూనెతో కలిపి జుట్టుకు మసాజ్ చేయాలి. ఈ రెండు పద్ధతుల్లో దేన్నయినా తరచూ పాటిస్తే జుట్టు రాలిపోవడం తగ్గుతుంది.

5. కొద్దిగా వేపాకులను తీసుకుని ముద్దగా నూరి జుట్టుకు బాగా పట్టించాలి. దీని వల్ల వెంట్రుకలు రాలడం తగ్గుతుంది. అంతేకాదు కుదుళ్ల గట్టిపడి వెంట్రుకలు ఒత్తుగా పెరుగుతాయి. అయితే ఈ వేపాకుల మిశ్రమానికి యాపిల్ సైడర్ వెనిగర్‌ను కలిపి వాడితే మరింత ఫలితం కనిపిస్తుంది. అదేవిధంగా కొద్దిగా దాల్చిన చెక్క పొడికి ఆలివ్ నూనె, తేనెలను కలిపి పేస్ట్‌లా తయారు చేసి జుట్టుకు పట్టించినా మంచి ఫలితం కనిపిస్తుంది.

6. ధనియాల పొడితో చేసిన జ్యూస్ లేదా పెరుగు, శనగపిండిల మిశ్రమాన్ని తలస్నానం చేసేందుకు ఒక గంట ముందు జుట్టుకు బాగా పట్టించి అనంతరం స్నానం చేయాలి. దీంతో కూడా వెంట్రుకలు రాలడాన్ని తగ్గించుకోవచ్చు.

7. చివరిగా మరో సూచన. వెంట్రుకలు రాలడం తగ్గడంతోపాటు జుట్టు కుదుళ్లు దృఢంగా ఉండాలన్నా, వెంట్రుకలు సంరక్షింపబడాలన్నా మంచి పౌష్టికాహారం కూడా తీసుకోవాల్సిందే. బాదం పప్పు, వేరుశెనగ పప్పు, ఆకుపచ్చని కూరగాయలు, పప్పు ధాన్యాలు, చేపలు, గుడ్లు తదితర ఆహార పదార్థాలను నిత్యం తీసుకుంటే వెంట్రుకల ఆరోగ్యం బాగు పడుతుంది.

11344
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles