ఉప్పు ఎక్కువగా తింటే.. కలిగే అనర్థాలివే..!


Sun,September 2, 2018 01:07 PM

నిత్యం మనం చేసుకునే ఏ వంటలో అయినా ఉప్పు కచ్చితంగా ఉండి తీరాల్సిందే. ఉప్పు లేకుండా కూరలను చేసుకుని తింటే అవి రుచించవు. అయితే ఉప్పుతో వంటలకు రుచి వచ్చే మాట వాస్తవమే అయినప్పటికీ ఉప్పును ఎక్కువగా తినరాదు. తింటే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. సాధారణంగా ఒక ఆరోగ్యవంతమైన వ్యక్తి నిత్యం 3.75 గ్రాముల వరకు ఉప్పు తినవచ్చు. అంతకు మించితే అనారోగ్య సమస్యలు వస్తాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. ఉప్పు ఎక్కువగా తినడం వల్ల అందులో ఉండే సోడియం శరీరంలో ఎక్కువగా చేరుతుంది. ఇది బీపీని పెంచుతుంది.

2. శరీరంలో సోడియం పరిమాణం ఎక్కువైతే ద్రవాలు పేరుకుపోతాయి. శరీరంలో ఆయా భాగాల్లో వాపులు వస్తాయి. కాళ్లు, చేతులు, ముఖం, పాదాల్లో వాపులు కనిపిస్తాయి. ఇలా కనిపిస్తే... నీరు ఎక్కువగా తాగాల్సి ఉంటుంది.

3. ఉప్పును మోతాదుకు మించి తీసుకుంటే గుండె సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి.

4. ఉప్పు ఎక్కువగా తినడం వల్ల శరీరం డీహైడ్రేషన్‌కు లోనవుతుంది. ఒంట్లో ద్రవాల పరిమాణం తగ్గుతుంది. ఫలితంగా దాహం అధికంగా అవుతుంది. దీంతో వికారం, వాంతులు, కళ్లు తిరగడం, డయేరియా వంటి సమస్యలు వస్తాయి.

5. ఆహారంలో ఎక్కువగా ఉప్పును తీసుకుంటే జీర్ణాశయంలో మ్యూకస్ పొరకు నష్టం వాటిల్లుతుంది. దీని వల్ల జీర్ణాశయంలో హెచ్.పైలోరి బాక్టీరియా ఇన్‌ఫెక్షన్ పెరిగి శరీరం వాపులకు గురవుతుంది.

6. మనం నిత్యం తీసుకునే ఆహారంలో ఉప్పు అధికంగా ఉంటే దాని ప్రభావం కిడ్నీలపై పడుతుంది. కిడ్నీలు బాగా పనిచేయాల్సి వస్తుంది. దీంతో వాటి పనితీరు మందగిస్తుంది.

7. శరీరంలో సోడియం పరిమాణం పెరిగితే క్యాల్షియం తగ్గుతుంది. దీని వల్ల ఎముకలు డొల్లగా మారుతాయి. కీళ్ల నొప్పులు వస్తాయి.

8. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల పక్షవాతం వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఉప్పు అధికంగా తింటే మెదడుకు ఆక్సిజన్ సరఫరా తగ్గుతుంది. దీంతో మెదడులోని కణాలు నాశనమవుతాయి. ఫలితంగా బీపీ పెరిగి పక్షవాతం వస్తుంది. కనుక ఉప్పును నిత్యం మోతాదుకు మించి తీసుకోకూడదు.

9826

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles