మనకు సంవత్సరం పొడవునా సీజన్‌తో సంబంధం లేకుండా దొరికే పండ్లు అనేకం ఉంటాయి. ఇక కేవలం సీజన్లో మాత్రమే లభించే పండ్లు కొన్ని ఉంటాయి. అయితే ఏ పండును తిన్నా, ఎప్పుడు తిన్నా వాటితో మనకు లాభాలే కలుగుతాయి తప్ప నష్టాలు మాత్రం ఉండవు. కానీ ఈ మధ్య కాలంలో పండ్లను తినడానికి నిర్దిష్టమైన సమయం ఉంటుందని, వాటిని ఎప్పుడు పడితే అప్పుడు తినరాదని, ముఖ్యంగా ఉదయం పరగడుపున పండ్లను అస్సలు తినరాదని, తింటే జీర్ణ సమస్యలు వస్తాయనే వాదన ఎక్కువైంది. అయితే మరి ఇందులో నిజమెంత ? అంటే.. సాధారణంగా ఏ పండులో అయినా కొంత ఫైబర్ (పీచు పదార్థం) ఉంటుంది. ఈ క్రమంలో ఉదయాన్నే పరగడుపున లేదా భోజనం చేశాక వెంటనే పండ్లను తింటే దీంతో వాటిల్లో ఉండే ఫైబర్ జీర్ణాశయంలో ఒక పట్టాన జీర్ణం కాదు. చాలా సేపు అక్కడే ఉంటుంది. దీంతో జీర్ణ సమస్యలైన గ్యాస్, అసిడిటీ వస్తాయని అంటారు. అయితే ఇది నిజమే అయినప్పటికీ ఆ సమస్యలు లేని వారు నిర్భయంగా ఎప్పుడు పడితే అప్పుడు పండ్లను తినవచ్చని ఆయుర్వేదం చెబుతున్నది. ఇక గ్యాస్, అసిడిటీ, అజీర్ణం సమస్యలతో బాధపడే వారు మాత్రం ఉదయాన్నే పరగడుపున లేదా భోజనం చేసిన వెంటనే పండ్లను తినరాదని, ముఖ్యంగా నిమ్మజాతికి చెందిన పండ్లను ఆయా సమయాల్లో తినరాదని ఆయుర్వేదం తెలియజేస్తుంది. ఈ సమస్యలు ఉన్నవారు భోజనం చేశాక కనీసం 1 గంట పాటు వేచి ఉండి ఆ తరువాత పండ్లను తింటే మంచిదని, ఇక ఈ సమస్యలు లేని వారు పండ్లను ఎప్పుడైనా తినవచ్చని వైద్యులు చెబుతున్నారు.