శుక్రవారం 30 అక్టోబర్ 2020
Health - Oct 15, 2020 , 19:26:14

ఐవీఎఫ్‌లో పుట్టింది.. అన్నను బతికించింది..

ఐవీఎఫ్‌లో పుట్టింది.. అన్నను బతికించింది..

న్యూఢిల్లీ : ఐవీఎఫ్‌ ద్వారా పుట్టిన ఓ చిన్నారి.. థలసేమియాతో బాధపడుతున్న అన్నకు ప్రాణం పోసింది. పుడుతూనే తన ఎముక మజ్జను తోబుట్టువుకు దానం చేసి అన్న పాలిట అపర కుబేరురాలిగా నిలిచింది. హ్యూమన్‌ ల్యూకోసైట్‌ యాంటిజెన్‌గా ఓ వ్యక్తి ప్రాణం నిలుపడం భారత వైద్య చరిత్రలో ఇదే తొలిసారి అని  వైద్యనిపుణులు చెప్తున్నారు.

సహదేవ్ సింగ్ సోలంకి, ఆల్పా సోలంకి దంపతుల రెండవ సంతతిగా అభిజీత్ పుట్టాడు. అయితే అభిజీత్‌ పుట్టుకతోనే థలసేమియా మేజర్‌తో జన్మించడంతో జీవితాంతం రక్తాన్ని ఎక్కించాల్సి ఉంటుంది. ఇలాంటి వారి రక్తం ఎముక మూలుగలో హిమగ్లోబిన్‌ ఉండే ఎర్ర రక్తకణాలు ఉత్పత్తి నిలిచిపోతుంది. దాంతో పిల్లాడికి చికిత్స చేయించేందుకు సోలంకి దంపతులు ఎన్నో దవాఖానలు తిరిగి, ఎందరో వైద్యులను కలిసి.. ఎంతో ఖర్చు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. ఎముక మూలుగ మార్పిడి చేయించడం ద్వారా పిల్లాడిని బతికించుకోవచ్చునని వైద్యులు ఇచ్చిన సలహా మేరకు ఎన్నో దవాఖానల్లో ఆరా తీశారు. తన కుటుంబసభ్యుల ఎముక మూలుగ కూడా సరిపోకపోవడంతో.. హ్యూమన్‌ ల్యూకోసైట్‌ యాంటిజెన్‌ (హెచ్‌ఎల్‌ఏ) మ్యాచ్‌ దొరకడం కష్టంగా మారింది. చివరకు వైద్యుల సలహామేరకు ఎముక మజ్జ మార్పిడికి హెచ్‌ఎల్‌ఏ దాతను పొందేందుకు ఐవీఎఫ్‌ విధానంలో బిడ్డను కనేందుకు సోలంకి దంపతులు సిద్ధమయ్యారు. అహ్మదాబాద్‌లోని నోవా ఐవీఎప్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ మనీష్‌ బ్యాంకర్‌ను కలిసి ఐవీఎఫ్‌ ద్వారా గర్భం ధరించేందుకు నిర్ణయించారు. థలసేమియా వ్యాధితో బాధపడుతున్న అన్నను కాపాడేందుకు బిడ్డను కనాలనుకుంటున్న సోలంకి దంపతులకు అన్ని విధాలుగా అండగా నిలిచి.. పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండేలా డాక్టర్‌ మనీష్‌ బ్యాంకర్‌ బృందం చర్యలు తీసుకున్నది.

2019 చివరిలో సోలంకి భార్య పండంటి ఆడశిశువు కావ్యకు జన్మనిచ్చింది. అభిజీత్‌ అదృష్టం బాగుండటం వల్ల పుట్టిన చిన్నారి హెచ్‌ఎల్‌గా గుర్తించబడింది. గత మార్చి నెలలలో చిన్నారి మరింత ఆరోగ్యకరంగా మారడంతో ఎముక మజ్జ మార్పిడి ఆపరేషన్‌కు వైద్యులు శ్రీకారం చుట్టి విజయవంతంగా పూర్తిచేశారు. ఎముక మూలుగ మార్పిడి విజయవంతం కావడంతో దాత చిన్నారితోపాటు అన్న అభిజీత్‌ కూడా ఆరోగ్యంగా ఉండి కోలుకున్నారు. ప్రస్తుతం అభిజీత్‌కు రక్తం మార్పిడి చేయాల్సిన అవసరం లేదని డాక్టర్‌ బ్యాంకర్‌ తెలిపారు. ఐవీఎఫ్‌ విధానంలో పుట్టి హెచ్‌ఎల్‌ఏగా మారి అన్నను బతికించుకోవడం భారతదేశ వైద్య చరిత్రలో ఇదే తొలిసారి అని డాక్టర్‌ బ్యాంకర్‌ పేర్కొన్నారు. ఐవీఎఫ్‌ విధానంలో బిడ్డను పొందేందుకు నిర్ణయించుకోవడం వల్ల తన కుమారుడిని థలసేమిగా వ్యాధి బారి నుంచి బయటపడగలిగాడని సహదేవ్‌సింగ్‌ సోలంకి సంతోషం వ్యక్తం చేశారు. పుడుతూనే అన్నను బతికించుకున్న తన బిడ్డ కావ్యకు జీవితాంతం రుణపడి ఉంటామని, ఇదే మా జీవితాల్లో ఎంతో ఆనందాన్ని ఇచ్చిన విషయమని సోలంకి చెప్పారు. మాకు జీవించాలనే ఆశను ఇచ్చినందుకు వైద్యులకు రుణపడి ఉంటామన్నారాయన.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.