ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Health - Sep 14, 2020 , 19:04:29

రోజ్-ములేటి టీ తాగండి.. వ్యాధి నిరోధక శక్తి పెంచుకోండి

రోజ్-ములేటి టీ తాగండి.. వ్యాధి నిరోధక శక్తి పెంచుకోండి

కరోనా వైరస్ నేపథ్యం వ్యాధి నిరోధక శక్తి గురించి ప్రతి ఒక్కరూ అంతో ఇంతో జాగ్రత్త వహిస్తున్నారు. ఆహారపుటలవాట్లలో మార్పులు చేసుకుంటూ కొవిడ్-19 బారిన పడకుండా చూసుకుంటున్నారు. వ్యాధి నిరోధకశక్తి పెంపొందించుకోవడం వలన శరీరంలోకి ప్రవేశించిన రోగనిరోధకతపై ప్రభావం చూపే సూక్ష్మక్రిములను నాశనం చేయవచ్చు. రోజ్-ములేటి టీ వ్యాధి నిరోధకశక్తిని పెంచుకోవడానికి ఎంతో ఉపయుక్తకరంగా ఉంటుందని ఆహార నిపుణులు సూచిస్తున్నారు.

ములేటిని ఆయుర్వేద పరిభాషలో యష్ఠి మధు అని ఇంగ్లిష్ లో లైకోరైస్ అని.. వాడుకభాషలో అతి మధురం చెట్టు అని పిలుస్తారు. కిరాణా దుకాణాల్లో లభిస్తుంది. ఎండబెట్టిన వేరును మూలికగా వాడుతారు. నిత్యం పరిగడుపుననే రోజ్-ములేతి టీ తాగడం అలవాటు చేసుకోవాలి. గులాబీ రేకులు, లైకోరైస్ అనే రెండు స్వచ్ఛమైన వనమూలికతో టీ తయారుచేసుకుని నిత్యం ఉదయాన్నే సేవించడం ద్వారా రోగనిరోధకత పెంచుకోవడమే కాకుండా మరెన్నో ప్రయోజనలు పొందవచ్చు. ఈ చాయ్ ను నిత్యం తీసుకోవడం ద్వారా దగ్గు, జలుబు నుంచి ఉపశమనం పొందవచ్చు. దంతాల ఆరోగ్యానికి, వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి, రక్తంలో చక్కెరల శాతాన్ని సరైన మోతాదులో ఉండేట్లుగా చూడటం, తీసుకునే ఆహారం సక్రమంగా జీర్ణమవడానికి, మలబద్ధకం నివారణకు, వివిధ గట్ సంబంధ సమస్యల పరిష్కారానికి కూడా రోజ్-ములేటి టీ ఎంతో ఉపయోకపడుతుందని నిపుణులు సెలవిస్తున్నారు. రోజ్-ములేటి టీలో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి. ఈ టీ తీసుకోవడం వల్ల శరీరంలోని విషపదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. శరీరం బరువు తగ్గింపునకు చక్కగా సహాయపడుతుంది.

ఉదయాన్నే కొన్ని తాజా గులాబీ రేకులను నీటిలో వేసి కొద్దిగా మరిగించుకోవాలి. అనంతరం వాటిలో అతి మధురం (ములేటి) బెరడులను వేసి మరికాస్సేపు ఉడికించాలి. బాగా మరిగిన తర్వాత దింపి చల్లారనివ్వాలి. వాటిని వడకట్టి బెల్లంకానీ, తేనెకానీ వేసి సేవించాలి.


logo