శనివారం 28 మార్చి 2020
Health - Mar 12, 2020 , 20:05:02

ట్రాఫిక్‌తో గుండెపోటు వచ్చే ప్రమాదం...

ట్రాఫిక్‌తో గుండెపోటు వచ్చే ప్రమాదం...

హైదరాబాద్:  ట్రాఫిక్‌తో చిరాకే కాదు గుండెపోటు అవకాశం కూడా పెరుగుతుందంటున్నారు పరిశోధకులు. నిరంతరం కాలుష్యాల్లో తిరిగేవారు గుండెపోటుకు గురయ్యే అవకాశాలు ఎక్కువని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. కాలుష్యాలతో గుండె రక్తనాళాలు గట్టిపడడమే ఇందుకు కారణమని పరిశోధకులు కనుగొన్నారు. డూయిస్‌బర్గ్‌-ఎస్సెన్‌ యూనివర్సిటీకిచెందిన పరిశోధకుడు హాఫ్‌మాన్‌ మహారద్దీగా ఉండే నగరాలపై చేసిన అధ్యయనాల్లో ఈ విషయం స్పష్టమైంది. పొగతాగడం ద్వారా వచ్చే గుండెపోట్లతో పోలిస్తే వాతావరణ కాలుష్యాలతో వచ్చే గుండె పోట్ల సంఖ్య రెట్టింపుగా ఉంటున్నదని అంటున్నారాయన. ప్రధానంగా వాహనాల పొగతో ఏర్పడే కాలుష్యాలే రక్తనాళాలకు ఎక్కువ హాని చేస్తాయని ఆయన పేర్కొన్నారు. 

మధుమేహం, పొగతాగే అలవాటు ఉన్నవారు ఈ కాలుష్యాల్లో తిరిగితే గుండెపోట్లు మరింత ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని, దీనికి తోడు వాహనాల రణగొణ ధ్వనులు అధిక రక్తపోటును కలిగిస్తున్నాయని అంటున్నారాయన. కాలుష్యాలతో గుండెపోట్లు రావడమనేది రోజూ వారు కాలుష్యాల్లో ప్రయాణించే దూరం మీద ఆధారపడి ఉంటుందని కూడా ఈ అధ్యయనాల్లో స్పష్టమైంది. కాలుష్యాల వల్ల రక్తనాళాల్లో కాల్షియం పేరుకుని గట్టిపడడంతో పాటు రక్తనాళాలు మూసుకుపోయే ప్రమాదం ఏర్పడుతున్నదని హాఫ్‌మాన్‌ అన్నారు. అయితే ఈ అధ్యయనాలన్నీ ఇంకా అసంపూర్ణంగానే ఉన్నాయని మరికొన్ని పరిశోధనలు జరగవలసి ఉందన్నారు. పర్యావరణ పరిరక్షణను తీవ్రమైన అంశంగా పరిగణించకపోతే నగరాలు నరకాలవుతాయని ఆయన హెచ్చరిస్తున్నారు. logo