e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, July 30, 2021
Home Top Slides ‘కొందరి’ శత్రువు..ప్రొస్టేట్‌ క్యాన్సర్‌!

‘కొందరి’ శత్రువు..ప్రొస్టేట్‌ క్యాన్సర్‌!

‘ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ ప్రాణాలు తీసేంత ప్రమాదకారి కాదు’ – ఈ మాట వినడానికి బాగుంది. అయితే, కొందరి విషయంలో మాత్రం తన విశ్వరూపం చూపిస్తుంది. ఆ ‘కొందరి’లో ఎవరైనా ఉండవచ్చు. కాబట్టి, ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ను తక్కువ అంచనా వేయలేం. ఉసిరికాయంత పరిమాణంలోని ప్రొస్టేట్‌ గ్రంథిని జాగ్రత్తగా కాపాడుకోవాలి.

‘కొందరి’ శత్రువు..ప్రొస్టేట్‌ క్యాన్సర్‌!

దేశంలో ఏటా సుమారు పాతికవేల ప్రొస్టేట్‌ క్యాన్సర్లు నమోదవుతున్నాయి. భవిష్యత్తులో ఈ సంఖ్య మరింత పెరిగే ఆస్కారం ఉంది. క్రమం తప్పని వ్యాయామం, బరువును అదుపులో పెట్టుకోవడం, కొవ్వు పదార్థాలకు దూరంగా ఉండటం.. ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ను దూరం పెట్టడానికి దగ్గరి మార్గాలు.

- Advertisement -

జన్యు పరీక్ష
అధిక రిస్కు గ్రూపులో ఉన్నవారు, ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ నాలుగో స్టేజ్‌లో ఉన్నవారు వెంటనే జన్యు పరీక్షలు చేయించుకోవడం మంచిది. కుటుంబంలోని దగ్గరి బంధువులకు గతంలో ప్రొస్టేట్‌ లేదా ఇతర క్యాన్సర్లు సోకి ఉంటే, అసలు నిర్లక్ష్యం చేయకూడదు.

కీలకం.. నాలుగో దశ!
మూడు దశల వరకూ ఫర్వాలేదు. నాలుగో దశలో మాత్రం, పూర్తిగా నయం చేయలేకపోయినా కచ్చితంగా అదుపు చేయవచ్చు. ఆ ప్రయత్నంలో టెస్టోస్టెరోన్‌ హార్మోన్‌ను నియంత్రణలో ఉంచాల్సి ఉంటుంది. మధ్యలో ఈ టెస్టోస్టెరాన్‌ పాత్ర ఏమిటన్నది ఇప్పుడు చర్చిద్దాం. చైనాకు చెందిన యుద్ధ వ్యూహకర్త సన్‌ఝూ శత్రువు గురించి చక్కగా విశ్లేషించారు.. ‘నీ గురించే కాదు, నీ శత్రువు గురించీ సరిగ్గా అంచనా వేయగలిగినప్పుడే యుద్ధంలో నువ్వు వందసార్లయినా గెలుస్తావు. నీ గురించి మాత్రమే తెలుసుకుని, నీ శత్రువు బలాలూ బలహీనతలూ తెలుసుకోలేకపోతే.. ఒకసారి గెలుస్తావు, ఒకసారి ఓడతావు. నీ గురించీ నీకు తెలియక, నీ శత్రువు గురించీ నువ్వు అర్థంచేసుకోకుండా యుద్ధం చేస్తే, ప్రతిసారీ ఓడుతూనే ఉంటావు’. క్యాన్సర్‌ వైద్యానికీ ఈ పోలిక వర్తిస్తుంది. ఫలానా క్యాన్సర్‌కు చికిత్స చేయాలంటే, ఆ క్యాన్సర్‌ ఎలా ప్రవర్తిస్తుంది, దేనిమీద ఆధారపడి ఉంటుంది, దేనికి లొంగుతుంది? అనే విషయాలపై అవగాహన అవసరం. క్యాన్సర్‌ కణం స్వభావమే అంత. శరీరం నియంత్రించడానికి

ప్రయత్నిస్తున్నా లెక్కచేయకుండా, ఓ పద్ధతీపాడూ లేకుండా విభజన చెందుతూనే ఉంటుంది. మిగతా క్యాన్సర్లతో పోలిస్తే.. ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ కాస్త భిన్నంగా ప్రవర్తిస్తుంది. శరీరంలోని టెస్టోస్టిరాన్‌ హార్మోన్‌ మీదే ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ ఎదుగుదల ఆధారపడి ఉంటుంది. ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ గురించి లోతుగా తెలుసుకోగలిగాం కాబట్టే, ఈ క్యాన్సర్‌ చికిత్స కోసం శక్తిమంతమైన మందులను అందుబాటులోకి తీసుకురాగలిగాం.

ప్రొస్టేట్‌ క్యాన్సర్‌కు టెస్టొస్టిరాన్‌ హార్మోన్‌తో ఉన్న అనుబంధం.. అచ్చంగా భార్యాభర్తల బంధం లాంటిది. వృద్ధాప్యంలో భార్య చనిపోయిన కొద్దికాలానికే భర్త కూడా కాలం చేస్తాడని అమెరికాలో జరిగిన ఒక అధ్యయనంలో తేలింది. కారణం.. భర్త ప్రతి చిన్న విషయానికీ భార్య మీదే ఆధారపడతాడు. తనను కంటికి రెప్పలా కాపాడుకుంటూ, తన జీవితంలోని ప్రతి మలుపులో తోడుగా ఉన్న అర్ధాంగి ఇక లేదన్న కఠోర సత్యాన్ని జీర్ణించుకోలేకపోతాడు. లోలోపల కుమిలిపోతూ ఉంటాడు. జీవితంలో అంతులేని శూన్యం ఏర్పడుతుంది. శారీరకంగా, మానసికంగా క్షీణించిపోతూ.. ఏదో ఒక రోజున మరణిస్తాడు. సరైన జీవిత భాగస్వామి లభిస్తే మగవారికి తిరుగుండదు. ఆమె సహకారంతో ఎక్కడైనా రాణించగలరు. సరిగ్గా ఇలానే, ప్రొస్టేట్‌ కాన్సర్‌ కూడా టెస్టోస్టిరాన్‌ సహకారంతో వీరవిహారం చేస్తుంది. దీన్ని నిలువరించడానికి మార్గం ఒకటే – రోగి శరీరంలోని టెస్టోస్టిరాన్‌ హార్మోన్‌ శాతాన్ని కనీస స్థాయికి తగ్గించడం. టెస్టోస్టిరాన్‌ అదుపులో ఉంటే, ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ కూడా అదుపులో ఉన్నట్టే. టెస్టోస్టిరాన్‌ తోడు లేకపోతే, ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ ముసలి మొగుడిలా క్రమంగా క్షీణిస్తుంది.

సర్జికల్‌-మెడికల్‌
‘క్యాస్ట్రేషన్‌’ ప్రక్రియ ద్వారా శరీరంలోని టెస్టోస్టిరాన్‌ హార్మోన్‌ స్థాయులను భారీగా తగ్గించవచ్చు. ఈ ప్రక్రియ రెండు విధాలుగా ఉంటుంది. ఒకటేమో, సర్జికల్‌గా – అంటే, వృషణాలను తొలగిస్తారు. రెండోది, మెడికల్‌గా – హార్మోన్లను ఇంజక్షన్‌ రూపంలో ఎక్కించి టెస్టోస్టిరాన్‌ను అదుపులో ఉంచుతారు. ఈ రెండు పద్ధతుల్లో దేన్ని ఎంచుకోవాలన్నది క్యాన్సర్‌ రోగే నిర్ణయించుకోవాలి. రెండూ ఉత్తమమైనవే. సర్జికల్‌ పద్ధతిలో ఖర్చు తక్కువ. కాకపోతే, పురుషత్వానికి ప్రతీకగా భావించే వృషణాలను వదులుకోవడానికి కొందరు ఇష్టపడరు. అలాంటి పరిస్థితుల్లో కాస్త ఖరీదైన మెడికల్‌ పద్ధతిని ఎంచుకోవచ్చు. అయితే, ఈ విధానంలో తరచూ ఇంజెక్షన్లు చేయించుకోవాల్సి ఉంటుంది. మళ్లీ కొంతకాలానికి ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ క్యాస్ట్రేషన్‌కు కూడా లొంగకుండా ఇబ్బంది పెట్టవచ్చు. అలాంటి సందర్భంలో కీమోధెరపీ, హార్మోన్‌ థెరపీ, స్టిరాయిడ్స్‌, ఇమ్యునోథెరపీ తదితర మార్గాల్లో ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ను అదుపులో ఉంచుతూ రోగి ఆయువును పెంచుతారు వైద్యులు. ఎముకల్లో నొప్పి తీవ్రంగా ఉంటే, రేడియేషన్‌ ద్వారా ఉపశమనం ప్రసాదించే అవకాశమూ ఉంది.

‘కొందరి’ శత్రువు..ప్రొస్టేట్‌ క్యాన్సర్‌!

కరోనా సమయంలో..
సాధారణంగానే, క్యాన్సర్‌ పీడితుల్లో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. దీంతో కరోనా సోకే అవకాశాలు పుష్కలం. ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ బారినపడినవారిలో ఈ ప్రమాదం ఇంకాస్త ఎక్కువని తాజా అధ్యయనం చెబుతున్నది. ఎందుకంటే, ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ రోగులలో ఇబ్బడిముబ్బడిగా దర్శనమిచ్చే ఒకరకమైన ప్రొటీన్‌ ద్వారా కరోనా వైరస్‌ శరీరంలోకి ప్రవేశిస్తుంది. ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ చికిత్సలో అంతరాయం ఏర్పడినా, వ్యాక్సిన్‌ తీసుకోవడంలో అజాగ్రత్త వహించినా వైరస్‌ చుట్టుముడుతుంది. అందువల్ల, వ్యాక్సిన్‌ తీసుకోవడమే మంచిది. కీమోథెరపీ తీసుకుంటున్న వారు కూడా, కీమో ఇచ్చిన రెండు వారాల తర్వాత నిరభ్యంతరంగా వ్యాక్సిన్‌ తీసుకోవచ్చు. హార్మోన్‌ థెరపీ మీద ఉన్న వారు కూడా వెనకడుగు వేయాల్సిన పన్లేదు. కాకపోతే, కరోనా నుంచి కోలుకున్నవారు వెంటనే భారీ వ్యాయామాలు చేయకూడదు. సాధారణ ప్రాణాయామంతో మొదలు పెట్టి వారానికి ఐదు శాతం చొప్పున వ్యాయామ తీవ్రతను పెంచుకుంటూ సాధారణ స్థితికి చేరుకోవాలి. ముక్తాయింపుగా, మళ్లీ చెప్తున్నాను, చాదస్తం అనుకున్నా పర్లేదు.. ‘ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ ప్రాణాంతకం కాదు – ధైర్యంగా ఉండండి. ఎరుకతో వ్యవహరించండి’

లక్షణాలు ఇవీ..
తరచూ మూత్రానికి వెళ్లాల్సి రావడం, మూత్రం సరిగా రాకపోవడం, విసర్జనపై నియంత్రణ కోల్పోవడం, పూర్తిగా మూత్ర విసర్జన చేయలేకపోవడం.. ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ ప్రాథమిక లక్షణాలు. కొంతమందికి ఎముకల్లో నొప్పి కూడా రావచ్చు.

నాలుగు దశలు

‘కొందరి’ శత్రువు..ప్రొస్టేట్‌ క్యాన్సర్‌!
  • ప్రొస్టేట్‌ క్యాన్సర్‌లో నాలుగు దశలు ఉంటాయి . ‘రిస్క్‌ గ్రూప్‌’ కూడా ఉంటుంది. మొదటి మూడు స్టేజీలకూ ఈ రిస్క్‌ గ్రూప్‌ వర్తిస్తుంది.
  • తక్కువ రిస్క్‌ గ్రూప్‌లో ఉన్నవారికి ఎలాంటి చికిత్సా అవసరం లేదు. వైద్యుల సలహా ప్రకారం పరీక్షలు చేయించుకొంటే చాలు.
  • ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ వేగంగా పెరుగుతున్నా, శారీరక ఇబ్బందులు ఎదురవుతున్నా చికిత్స తప్పనిసరి. దీన్నే ‘యాక్టివ్‌ సర్వైలెన్స్‌’ అంటారు.
  • మధ్యస్తం లేదా అంతకన్నా ఎక్కువ రిస్క్‌ ఉన్నవారికి రేడియేషన్‌ లేదా సర్జరీ అవసరం కావచ్చు.
  • వీటిలో ఏ మార్గాన్ని ఎంచుకోవాలన్నది రోగి ఆయుర్దాయాన్ని బట్టి; మధుమేహం, రక్తపోటు.. ఇతరత్రా సమస్యల తీవ్రతను బట్టి నిర్ణయిస్తారు. ఒక్కో విధానంలోని ప్రయోజనాలను, ఇబ్బందులను క్యాన్సర్‌ నిపుణులు బేరీజు వేస్తారు.

డాక్టర్‌ ఉదయ్‌ కుమార్‌ పుణుకొల్లు
సీనియర్‌ మెడికల్‌ ఆంకాలజిస్ట్‌ & హెమాటొ-ఆంకాలజిస్ట్‌, యశోద హాస్పిటల్స్‌
మలక్‌ పేట్‌ హైదరాబాద్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
‘కొందరి’ శత్రువు..ప్రొస్టేట్‌ క్యాన్సర్‌!
‘కొందరి’ శత్రువు..ప్రొస్టేట్‌ క్యాన్సర్‌!
‘కొందరి’ శత్రువు..ప్రొస్టేట్‌ క్యాన్సర్‌!

ట్రెండింగ్‌

Advertisement