వడ దెబ్బ.. ముందు జాగ్రత్తలు


Tue,March 21, 2017 12:42 PM

ఎండలు దంచి కొడుతున్నాయి. గతేడాదికంటే ఈసారి ఎండలు మరింత మండిపోయే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరిస్తుంది. గతేడాది నమోదైన అత్యధిక ఉష్ణోగ్రతలు, బలమైన వడగాలులు వీయడం వల్ల దేశవ్యాప్తంగా 16 వందల మంది బలయ్యారు. అందులో 7 వందల మంది కేవలం వడ గాల్పుల ధాటికే మృతిచెందారని నివేదికలు చెబుతున్నాయి అందుకే భానుడి ప్రభావం నుంచి తప్పించుకోవడానికి ఎన్నో జాగ్రత్తలు అవసరం.

వడ దెబ్బతో జాగ్రత సుమా:
మానవ శరీరం 32 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతను తట్టుకుంటుంది. ఈ ఉష్ణోగ్రత తీవ్రత 35 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు చేరుకుంటే వడదెబ్బ సమస్య ఏర్పడుతుంది. 38 నుంచి 40 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు చేరుకుంటే ప్రాణాంతకంగా మారినట్టే. వడదెబ్బకు గురైన వ్యక్తి అధిక ఉష్ణోగ్రత కారణంగా ఐదు రోజుల్లో మృతిచెందే అవకాశం ఉంటుంది. ఐదేళ్లలోపు పిల్లలు, 60 ఏళ్లు పైబడిన వృద్ధులు త్వరగా వడదెబ్బకు గురవుతారు. గర్భిణి స్త్రీలు కూడా శరీరంలో తేమ శాతాన్ని కాపాడుకోవాలి. లేకుంటే వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉంది. వడదెబ్బ ముందుగా శరీరంపై ప్రభావం చూపుతుంది. రక్తకణాలు కుంచించుకు పోయి దాని ప్రభావం కిడ్నీలు, ఊపిరి తిత్తులు, కాలేయంపై పడుతుంది.

వడదెబ్బ లక్షణాలు :
- వడదెబ్బకు గురైనవారి శరీరంలో నీటిశాతం లోపించి బాడీ డీహైడ్రేట్ అవుతుంది.
- శరీర ఉష్ణోగ్రత విపరీతంగా పెరుగుతుంది. దీని వల్ల గుండె, రక్తనాళాలు, కాలేయం, మూత్ర పిండాలు దెబ్బతింటాయి.
- ఒంట్లోని లవణాలు చెమట రూపంలో బయటకు వెళ్లిపోవడంతో మనిషి నీరసించిపోతాడు.
- జ్వరం, వాంతులు, విరేచనాలు, తల తిరుగడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి.
- అధిక ఉష్ణోగ్రత వల్ల పల్స్ పడిపోతుంది. తల తిరుగడం, తలనొప్పి వస్తాయి.
- మతి కోల్పోవడం, కోమాలోకి వెళ్లడం, మూత్రం పచ్చగా రావడం లాంటి లక్షణాలుంటాయి.

చికిత్స:
- వడదెబ్బకు గురైన వ్యక్తిని వెంటనే నీడలోకి తీసుకురావాలి.
- బట్టలను వదులు చేసి 25 - 30 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉన్న నీటితో శరీరాన్ని తడుపాలి. దీని వల్ల శరీరంపై ఉండే రక్తనాళాలు కుచించుకుపోకుండా ఉంటాయి.
- శరీర ఉష్ణోగ్రత తగ్గేలా చూడాలి. గజ్జలు, చంకలు, మెడపై ఐస్‌ప్యాక్‌లు పెట్టాలి.
- వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి.. సకాలంలో చికిత్స అందించాలి.

పాటించాల్సిన జాగ్రత్తలు:
- ప్రధానంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఎండలో తిరుగక పోవడం ఉత్తమం.
- ఏదైనా పని మీద బయటకు వెళ్లాల్సి వస్తే తలకు, ముఖానికి ఎండ తగులకుండా జాగ్రత్త పడాలి. టోపీ, గొడుగు, తలపాగా ధరించాలి.
- ఇళ్లు, కార్యాలయాల్లో చల్లటి వాతావరణం ఉండేలా చూసుకోవాలి.
- ప్రతిరోజూ 5 లీటర్లకు తక్కువ కాకుండా నీరు తాగాలి.
- నీరసంగా అనిపిస్తే ఓఆర్‌ఎస్, గ్లూకోజ్ కలిపిన నీటిని తీసుకోవాలి.
- ఆహారంలో ఎక్కువగా ద్రవ పదార్థాలు ఉండేలా చూసుకోవాలి.
- కారం, మసాలాలకు వీలైనంత దూరంగా ఉండాలి.
- కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలను ఎక్కువగా తీసుకోవాలి.
- వేపుడు పదార్థాలు, కాఫీ, ఫాస్ట్‌ఫుడ్, ఆల్కహాల్ తాగడం మానేయాలి.
- తగ్గించాలి. యోగా, నడకకు ప్రాధాన్యం ఇవ్వాలి.
- వదులుగా ఉండే కాటన్ దుస్తులనే ధరించాలి.

5330
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles