ఫేస్‌బుక్ లో మునిగి తేలుతున్నారా..? డిప్రెష‌న్ గ్యారంటీ..!


Thu,July 19, 2018 12:07 PM

ఫేస్‌బుక్‌.. నేటి త‌రుణంలో దీని గురించి తెలియ‌ని వారుండ‌రు అంటే అతిశ‌యోక్తి కాదేమో. ఎందుకంటే స్మార్ట్‌ఫోన్లు వాడేవారు, వాడ‌ని వారు అంద‌రికీ ఫేస్‌బుక్ గురించి తెలుస్తున్న‌ది. ఈ క్ర‌మంలోనే ఎప్పుడు ఎక్క‌డ ఏ సంద‌ర్భంలో ఏ స‌మ‌యంలోనైనా ఫోన్‌లో ఫొటో తీయ‌డం లేదంటే ఆస‌క్తిక‌రంగా అనిపించిన విష‌యాల‌ను షేర్ చేయ‌డం.. ఆ త‌రువాత కామెంట్లు, లైక్‌ల కోసం ఆస‌క్తిగా ఎదురు చూడ‌డం.. స‌ర్వ సాధార‌ణ‌మే అయిపోయింది. అయితే ఇలా ప‌రిమితికి మించి ఫేస్‌బుక్‌ను వాడితే డిప్రెష‌న్ బారిన ప‌డ‌తార‌ని సైంటిస్టులు హెచ్చ‌రిస్తున్నారు.

కోపెన్‌హాగ‌న్ విశ్వ‌విద్యాల‌యానికి చెందిన ప‌రిశోధ‌కులు కొంద‌రు ఫేస్‌బుక్‌ను బాగా వాడే వేయి మందిపై ప‌రిశోధ‌న చేశారు. వారిలో ఆడ‌, మ‌గ వారు ఉన్నారు. ఈ క్ర‌మంలో సైంటిస్టులు స‌ద‌రు వ్య‌క్తులు ఫేస్‌బుక్‌ను ఎంత సేపు వాడ‌తారు, ఏం చేస్తారు, ఏం చూస్తారు తదిత‌ర వివ‌రాల‌ను వారి నుంచి సేక‌రించారు. అనంత‌రం వారికి ఉన్న అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను ప‌రిశీలించారు. చివ‌ర‌కు తెలిసిందేమిటంటే.. ఫేస్‌బుక్‌లో పోస్టుల‌ను ఎక్కువ‌గా పెడుతూ వాటికి కామెంట్లు, లైక్‌లను ఆశించే వారు డిప్రెష‌న్ బారిన ప‌డే అవ‌కాశం ఉంద‌ని తేల్చారు. అలాగే పిట్స్‌బ‌ర్గ్‌కు చెందిన ప‌రిశోధ‌కులు కూడా దాదాపుగా ఇలాంటి అధ్య‌య‌న‌మే ఒక‌టి చేశారు. వారు 19 నుంచి 32 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు లోపు ఉన్న 1787 మందిని ప‌రిశీలించారు. వీరంతా సోష‌ల్ మీడియా యాప్స్‌ను బాగా వాడేవారే. ఇలాంటి వారిలో 7 లేదా అంత‌కు మించి సోష‌ల్ యాప్స్‌ను వాడేవారికి మాన‌సిక స‌మ‌స్య‌ల‌కు చెందిన ల‌క్ష‌ణాలు ఉన్న‌ట్లు గుర్తించారు. క‌నుక సోష‌ల్ యాప్స్‌ను వాడే వారు వీలైనంత వ‌ర‌కు వాటి నుంచి దూరంగా ఉండేందుకు య‌త్నించాల‌ని లేదంటే మానసిక అనారోగ్యాల బారిన ప‌డాల్సి వ‌స్తుంద‌ని సైంటిస్టులు హెచ్చ‌రిస్తున్నారు.

2190

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles