సోమవారం 21 సెప్టెంబర్ 2020
Health - Jun 15, 2020 , 15:09:08

బ్లడ్‌ గ్రూపుతో కరోనాకు సంబంధముందా?

బ్లడ్‌ గ్రూపుతో కరోనాకు సంబంధముందా?

చైనాలోని వూహన్ పట్టణంలో పుట్టిన కరోనా వైరస్.. ఇప్పుడు చైనా వారితోపాటు ప్రపంచ ప్రజలను వణికిస్తోంది. గత ఐదారు నెలలుగా ప్రపంచ దేశాల ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న ఈ వైరస్ కు వ్యాక్సిన్ వస్తే గానీ అదుపులోకి రాదని వైద్యనిపుణులు సెలవిస్తున్నారు. అంతవరకు దానితో సహవాసం చేస్తూనే దాని కట్టడికి కొన్ని చర్యలు తీసుకోవాలని అన్ని దేశాల ప్రభుత్వాలు చెప్తున్నాయి. అందులో ముఖ్యమైనది వైరస్ వ్యాప్తిచెందకుండా ఉండేందుకు భౌతిక దూరం పాటించాలని, ముక్కుకు తప్పనిసరిగా మాస్కుల ధరించాలని, వ్యాధినిరోధకశక్తి పెంపొందించుకొనేందుకు పోషకాహారం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కరోనా వైరస్ కు వ్యాక్సిన్ కనిపెట్టేందుకు చాలా సంస్థలు విశేషంగా పాటుపడుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనాకు సంబంధించి విశేష పరిశోధనలు కూడా జరుగుతున్నాయి.

కరోనా వైరస్ సోకడం వల్ల నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం ఉంటుందని కొన్ని పరిశోధనలు తేల్చగా.. మధుమేహ వ్యాధిగ్రస్థులపై కూడా ఎక్కువగా ప్రభావం ఉంటుందిని లండన్ కింగ్స్ కాలేజీ పరిశోధకులు తేల్చిచెప్పారు. ఇదే సమయంలో కరోనావ్యాప్తికి మన శరీరంలోని రక్తానికి సంబంధముంటుందని అమెరికాకు చెందిన ఒక బయోటెక్నాలజీ కంపెనీ నిర్వహించిన అధ్యయనంలో తేలింది.

కరోనా ముప్పు తేల్చనున్న రక్తం గ్రూపు

మన శరీరంలోని రక్తం గ్రూపులకు కరోనా వైరస్కు సంబంధం ఉంటుందని అమెరికా బయోటెక్నాలజీ కంపెనీ అధ్యయనం తేల్చింది. వీరి అధ్యయనం ప్రకారం.. ఓ బ్లడ్ గ్రూపు రక్తం ఉన్నవారిలో కొవిడ్-19 చాలా తక్కువగా ప్రభావితం చేస్తుంది. ఏబీ బ్లడ్ గ్రూపు రక్తం ఉన్నవారికి ఎక్కువ ప్రమాదం ఉంటుంది. అనంతరం బీ, ఏ రక్తం గ్రూపు వాళ్లు ఉన్నారు. ఏ బ్లడ్ గ్రూపువారిలో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని చైనాతోపాటు ఇటాలియన్-స్పానిష్ అధ్యయనాలు పేర్కొంటున్నాయి. 

నాడీ వ్యవస్థపై ప్రభావం

కరోనా వైరస్ మానవుల నాడీ వ్యవస్థపై ప్రభావం చూపిస్తుందని, జ్వరం, దగ్గు మొదలవ్వకముందే నాడీ వ్యవస్థపై దీని ప్రభావం లక్షాణాలు కనిపిస్తాయని నార్త్ వెస్ట్రన్ మెడిసిన్ సంస్థ అధ్యయనంలో వెల్లడైంది. తలనొప్పి, బద్ధకం, రుచి, వాసన గుణాలను కోల్పోవడం వంటివి నాడీ వ్యవస్థపై ప్రభావం కారణంగానే జరుగుతాయని పరిశోధకులు చెప్తున్నారు. వీటిని తొలి దశలోనే గుర్తిస్తే ప్రాణాలను కాపాడవచ్చునని వారు సూచిస్తున్నారు.  కరోనా వైరస్ సంక్రమణ మెదడు, వెన్నుపాము, నరాలు, కండరాలతోపాటు మొత్తం నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుందని అన్నల్ ఆఫ్ న్యూరాలజీలో ప్రచురించిన ఒక అధ్యయనం సూచిస్తున్నది. ఆక్సిజన్ అందక మెదడు పనితీరు కూడా దెబ్బతింటుందంట.

మాస్కులతోనే ఎక్కువ ప్రయోజనాలు

కరోనా వైరస్ కట్టడికి భౌతిక దూరం పాటించాలంటూ వైద్యనిపుణులు గత కొంతకాలంగా ప్రజలకు సూచిస్తూ వస్తున్నారు. అదేవిధంగా ముక్కుకు మాస్కులు కూడా ధరించాలని చెప్తున్నారు. నిజానికి భౌతిక దూరం పాటించడం కన్నా ముక్కుకు మాస్కును ధరించడం వల్లనే ఎక్కువ ప్రయోజనం పొందవచ్చునని అమెరికన్ నేషనల్ అకాడమీ అధ్యయనంలో తేలింది. న్యూయార్క్ లో ప్రజలు మాస్కులు తప్పనిసరిగా ధరించడం వల్లనే అక్కడ త్వరగా కరోనా వైరస్ అదుపులోకి వచ్చిందని తమ పరిశోధనలో తేలినట్లు వారు చెప్తున్నారు. ఇలాంటి రక్షణ చర్య ఒక్కటే అంటువ్యాధుల సంఖ్యను గణనీయంగా తగ్గించగలుగుతుంది.  ముఖానికి కప్పి ఉంచే ఈ మాస్కులు వైరస్ బేరింగ్ ఏరోసోల్స్ తోపాటు వైరస్ అణువులను పీల్చడాన్ని నిరోధిస్తుందని అధ్యయనం కనుగొన్నది. అందువల్ల మరింతగా కరోనాను కట్టడి చేసేందుకు అందరికి మాస్కులు తప్పనిసరి చేయాలని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. 

వ్యాధినిరోధకశక్తి తగ్గడం

శరీరంలోకి ఇతర హానికారక బ్యాక్టీరియా, వైరస్ లు వచ్చినప్పుడు వాటిపై దాడిచేసి మనకు రక్షణగా నిలిచే రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా మారిన సమయాల్లో కరోనా వైరస్ మరింతగా ప్రభావం చూపుతుందని పరిశోధనల్లో తేల్చారు. అందుకని వ్యాధినిరోధకశక్తిని పెంపొందించుకొనేలా ఆహారాలను తీసుకోవడంతోపాటు డీ విటమిన్ అందేలా నూర్యరశ్మిలో కనీసం అరగంట సేపైనా నిలుచోవాలని నిపుణులు చెప్తున్నారు. రక్తంలో తెల్లరక్త కణాలతోపాటు యాంటీబాడీస్ ఎక్కువగా తయారయ్యేలా చూసుకోవాలి.  ఇటలీవాసుల్లోని శరీరంలో యాంటీబాడీస్ కరువైపోవడం వల్లనే కరోనా ఎక్కువగా ప్రభావం చూపిందని వారు అంటున్నారు. 

వ్యాక్సిన్ వచ్చే వరకు సొంత రక్షణే మేలు

కరోనా వైరస్ వ్యాప్తి మొదలైన తర్వాత దాని లక్షణాలు, వైచిత్రి తెలుసుకోవడానికే పరిశోధకులకు చాలా సమయం పట్టింది.  మ్యాపింగ్ చేసిన తర్వాత దానికి విరుగుడుగా వ్యాక్సిన్ కనిపెట్టే దశలో చాల దేశాలు పనిచేస్తున్నాయి. వ్యాక్సిన్ రావడానికి మరో ఆరేడు నెలల సమయం పట్టే అవకాశాలు ఉండటంతో సొంద రక్షణ చర్యలు తీసుకోవడమే శ్రీరామరక్ష అని నిపుణులు సెలవిస్తున్నారు. విధిగా ముఖానికి మాస్కులు ధరించడం, బయటివారితో తప్పనిసరిగా భౌతిక దూరం పాటించడం, బయటినుంచి ఇంట్లోకి రాగానే కాళ్లు, చేతులు శుభ్రంగా కడుక్కోవడం వంటి చర్యల ద్వారా ఈ మహమ్మారిని కట్టడి చేయవచ్చును. కరోనా వైరస్ నియంత్రణకు మందులు రావడానికి మరొ కొన్నేండ్లు పడుతున్నందున.. ఇప్పటివరకు ప్రభుత్వాలు, నిపుణులు సూచిస్తున్న మార్గదర్శకాలను విధగా పాటిద్దాం. మనతో మరొకరికి కరోనా వైరస్ సోకకుండా చూద్దాం.

మరిన్ని వార్తలు..

రోగనిరోధకశక్తిని బలహీనపరిచే ఆరు అలవాట్లు ఇవే!


logo