శనివారం 28 మార్చి 2020
Health - Mar 15, 2020 , 11:40:19

పండ్లతో మొలకెత్తిన గింజలు కలిపి తింటే...?

పండ్లతో మొలకెత్తిన గింజలు కలిపి తింటే...?

గింజల్లో అనేక పోషకాలు ఉంటాయి. ఆ గింజలను మొలకెత్తి తీసుకుంటే మరీ మంచిది. వాటిలో యాంటి ఆక్సిడెంట్లు, ప్రొటీన్లు, ఫైబర్లు పుష్కలంగా లభిస్తాయి. సాధారణ గింజలను మొలకెత్తించినప్పుడు వాటి పోషక విలువలు పెరుగుతాయి. వీటిలో 30 శాతం విటమిన్‌ బి, 60 శాతం విటమిన్‌ సి ఉంటాయి. మొలకెత్తిన గింజల్లో ఏదో ఒక రకమైనవి అంటే శనగలో, పెసర్లో ఏదో ఒకటి తీసుకునేబదులు నాలుగు రకాల గింజలను మొలకెత్తించి తీసుకుంటే మంచిది. మొలకెత్తిన గింజల్లో క్యారెట్‌, కీరా లాంటి కాయగూరలను సన్నగా కోసి వేసుకుంటే వాటి పోషకస్థాయి మరింత పెరుగుతుంది. వీటికి రకరకాల పండ్ల ముక్కలను కూడా కలిపి తరచుగా తింటే ఆరోగ్యం దివ్యంగా ఉంటుంది.

ఇలా తినండి..

మొలకెత్తిన విత్తనాలు ఆరోగ్యానికి మంచిది కదా అని బ్రేక్‌ఫాస్ట్‌ మానేసి వీటిని తీసుకోవడం సరికాదు. స్నాక్స్‌ సమయంలో తీసుకుంటే మంచిది. సాయంత్రం కడుపు ఖాళీగా ఉన్నప్పుడు తినాలి. అయితే సాధారణంగా స్నాక్స్‌ సమయంలో కరకరలాడే చిరుతిళ్లు తినాలనిపిస్తుంది. అంతేగాక మొలకెత్తిన విత్తనాలను పచ్చివిగా తీసుకుంటే చప్పగా ఉంటాయి కాబట్టి, వాటిపైన కరకరలాడే బూందీ లాంటివి చల్లుకుని తినాలి. తద్వారా అవి రుచిగా ఉండడమే కాక ఆరోగ్యం చెడిపోకుండా ఉంటుంది. మొలకెత్తిన విత్తనాలను వేయించి, లేదా ఉడకబెట్టి తినడం కొంతమందికి అలవాటు. కాని వీటిని పచ్చివిగా తినడమే మేలు. ఎందుకంటే వేడి వల్ల వీటిలోని విటమిన్లు దెబ్బతింటాయి. మొలకెత్తిన విత్తనాలకు పల్లీలు, క్యారెట్‌ ముక్కలు కలుపుకొని తినవచ్చు.


logo