ఆరోగ్యంగా ఉండాలంటే ఎంత ఆల్కహాల్ తీసుకోవాలో తెలుసా?


Fri,August 24, 2018 04:13 PM

గతంలో ఏవైనా అధ్యయనాలు చేశారో లేదో తెలియదుగానీ.. చాలా మంది ఓ విషయాన్ని బలంగా చెబుతుంటారు. ముఖ్యంగా ఆల్కహాల్ తాగే అలవాటు ఉన్న వాళ్లు పదేపదే చెప్పే మాట ఇది. అదేంటంటే.. రోజూ పరిమిత స్థాయిలో ఆల్కహాల్ తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదీ అని. అంటే ఓ పింట్ బీరో లేక ఒకటి లేదా రెండు పెగ్గులో గుండెకు మంచిది అని డాక్టర్లే చెప్పినట్లు చాలా మంది అంటుంటారు. ఇలాంటిదే తాజాగా మరో అధ్యయనం బయటకు వచ్చింది. ఆ అధ్యయనం ప్రకారం ఆరోగ్యానికి హాని కలగకుండా ఉండటానికి ఎంత ఆల్కహాల్ తీసుకోవాలో తెలుసా.. జీరో. అవును సింపుల్‌గా జీరో. అసలు ఆల్కహాల్ అంటేనే ఆరోగ్యానికి హాని చేసేది. పరిమిత స్థాయిలో తీసుకుంటే బాగుంటుంది అన్నది ఏమీ లేదు అని ఆ అధ్యయనం తేల్చేసింది.

ఇది ఓ భారీ అధ్యయనం. ప్రపంచవ్యాప్తంగా 243 సంస్థల నుంచి 512 మంది పరిశోధకులు ఈ అధ్యయనంలో పాల్గొన్నారు. ఈ అధ్యయనం ప్రతిష్టాత్మక జర్నల్ లాన్సెట్‌లో ప్రచురించారు. 195 దేశాలలో 1990 నుంచి 2016 మధ్య వెయ్యికిపైగా ఆల్కహాల్‌పై నిర్వహించిన అధ్యయనాల నుంచి సమాచారాన్ని సేకరించారు. 23 ఆరోగ్య సమస్యలపై ఆల్కహాల్ ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది తెలుసుకోవడమే లక్ష్యంగా ఈ అధ్యయనం సాగింది. చివరికి అసలు ఏమాత్రం ఆల్కహాల్ తీసుకోకపోవడమే మంచిదని అధ్యయనం తేల్చింది. ఎంత మొత్తంలో ఆల్కహాల్ తీసుకున్నా.. అనారోగ్య సమస్యలు తప్పవని స్పష్టంచేసింది.

ఈ అధ్యయనంలో పాలుపంచుకున్న సీనియర్ ఆథర్, యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ ప్రొఫెసర్ ఎమ్మాన్యులా గకిడో కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు. రోజుకు ఒకటి లేదా రెండు పెగ్గులు తాగితే మంచిదని అనుకోవడం మానేయాలి. అసలు ఆల్కహాల్ జోలికి వెళ్లకపోవడమే మంచిది అని ఆమె అన్నారు. ముఖ్యంగా 15 నుంచి 49 ఏళ్ల మధ్య వయసున్న వాళ్ల అనారోగ్య సమస్యలకు ఆల్కహాలే ప్రధాన కారణమని ఈ అధ్యయనంలో తేలింది. ప్రపంచవ్యాప్తంగా ఆల్కహాల్ అలవాటు ఉన్న 200 కోట్ల మందికి ఇది నిజంగా చేదు వార్తే అని చెప్పాలి.

12329

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles