శనివారం 29 ఫిబ్రవరి 2020
ఇక బైపాస్‌ సర్జరీ అవసరం లేదు!

ఇక బైపాస్‌ సర్జరీ అవసరం లేదు!

Feb 10, 2020 , 23:14:38
PRINT
ఇక బైపాస్‌ సర్జరీ అవసరం లేదు!

గుండెపోటు గురించి విననివాళ్లు ఎవరూ ఉండరు. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల్లో రక్తసరఫరాకు అంతరాయం కలిగితే గుండెపోటు వస్తుందని మనకు తెలిసిందే. అయితే రక్తనాళాలు పూర్తిగా వందశాతం పూడుకుపోతే చికిత్స చేయడం కొంచెం కష్టమైన విషయమే. ఈ చికిత్సలో 

జపాన్‌ దేశ వైద్యులు ముందంజలో ఉన్నారు. ఇటీవలే జపాన్‌ నుంచి వచ్చిన ఇంటర్వెన్షనల్‌ కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ మసాహిసా యమనే అపోలో హాస్పిటల్‌లో వర్క్‌షాప్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ చికిత్స గురించి వివరించారు అపోలో వైద్యులు.


జీవనశైలి వ్యాధులు విరుచుకుపడుతున్న ఆధునిక కాలమిది. మారిన జీవనశైలి తన పంజావిప్పుతున్నది. ఒకవైపు అధిక రక్తపోటు.. మరోవైపు మధుమేహం.. ఇంకోవైపు గుండెజబ్బులు.. మూకుమ్మడిగా దాడిచేస్తున్నాయి. బీపీ, డయాబెటిస్‌ వంటి జబ్బులున్నవాళ్లకు గుండెపోట్లు వచ్చే అవకాశం ఎక్కువ. అయితే వీళ్లలో నెమ్మది నెమ్మదిగా రక్తనాళాలు బ్లాక్‌ అయ్యేందుకు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఇలా అవి పూర్తిగా పూడుకుపోతాయి. సాధారణంగా 70 శాతం బ్లాక్‌ ఉన్నా హార్ట్‌ అటాక్‌ వస్తుంటుంది. కాని కొంతమందిలో చాలా నెమ్మదిగా బ్లాక్‌ అవుతూ వందశాతం బ్లాక్‌ అయ్యేదాకా గుండెపోటు రాదు. వీళ్లకు నడిస్తే ఆయాసం, ఛాతిలో నొప్పి వస్తుంది. కాని చాలామంది దీన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తుంటారు. అది క్రమంగా క్రానిక్‌ టోటల్‌ అక్లూజన్‌గా మారుతుంది. అలా మొత్తం ధమని బ్లాక్‌ అయి, రక్తప్రసరణకు పూర్తి ఆటంకం కలుగుతుంది. 5 శాతం వాళ్లలో ఇలా ధమనులు పూర్తిగా బ్లాక్‌ అయి ఉంటాయి. ఇలాంటప్పుడు చాలా సందర్భాల్లో బైపాస్‌ సర్జరీ చేస్తుంటారు. కాని దీనికి కూడా ఆంజియోప్లాస్టీ ద్వారా స్టెంట్‌ అమర్చడం సాధ్యమే. కాని ఇందుకోసం చాలా అనుభవం, చాకచక్యం కావాలి. కొన్ని కొత్త మెడికల్‌ డివైస్‌లు కావాలి. దీనిలో ముందున్నారు జపాన్‌వాళ్లు. సర్జరీ కోసం ఛాతి ఓపెన్‌ చేస్తే అక్కడి నుంచి ఆత్మ బయటికి వెళ్లిపోతుందని జపాన్‌ వాళ్ల నమ్మకం. అందువల్ల సాధ్యమైనంతవరకు సర్జరీ జోలికి వెళ్లరు. అందుకే సర్జరీకి బదులుగా ఇంటర్వెన్షన్లను ప్రాక్టీస్‌ చేస్తారు. అందుకే వాళ్లకు మనకన్నా అనుభవం ఎక్కువ. వాళ్ల టెక్నాలజీ అడ్వాన్స్‌డ్‌గా ఉంటుంది. అందుకే జపాన్‌ డాక్టర్‌ మన డాక్టర్లకు తన అనుభవాన్ని నేర్పించడానికి వచ్చారు. 



సర్జరీ బదులు స్టెంటింగ్‌.. ఇలా సాధ్యం!


కరొనరీ ధమనులు పూర్తిగా బ్లాక్‌ అయినప్పుడు సర్జరీని అవాయిడ్‌ చేయడానికి చేసే ఈ చికిత్సను ఆంజియోప్లాస్టీ ఫర్‌ టోటల్లీ బ్లాక్‌డ్‌ ఆర్టరీ అంటారు. సాధారణంగా పూర్తిగా రక్తనాళాలు పేరుకుపోయినప్పుడు మనదగ్గర 60 నుంచి 70 శాతం కేసులు ఓపెన్‌ సర్జరీనే చేస్తున్నాం. మిగిలిన కొన్ని కేసులకు మాత్రం ఈ ప్రక్రియ ద్వారా స్టెంట్‌ వేస్తున్నాం. జపాన్‌ వాళ్లు 90 నుంచి 100 శాతం సర్జరీ లేకుండానే ఆంజియోప్లాస్టీ ద్వారానే చికిత్స చేస్తున్నారు. అయితే మనకు 70 శాతం సక్సెస్‌ రేటు ఉంటే, వాళ్లకు 90 నుంచి 100 శాతం సక్సెస్‌ రేటు ఉంటుంది. 

ఇలా రక్తనాళాలు పూర్తిగా పూడుకుపోయినప్పుడు రక్తనాళంలోకి బెలూన్‌, వైర్‌ పంపించడం కూడా కష్టం కావొచ్చు. అందుకే రెండుమూడేళ్ల క్రితం ఆధునిక వైర్లను తీసుకొచ్చారు జపాన్‌ వాళ్లు. వీటి సాయంతో స్టెంట్‌ను పంపించడం సులువైంది. మైక్రో కెథటర్‌, స్టెంటింగ్‌ కోసం వాడే పరికరాలను పంపించే వైర్లు వేరుగా ఉంటాయి. స్టెంట్స్‌ మాత్రం అవే అయినప్పటికీ వాటిని పంపించడానికి వాడే మెడికల్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ ఆధునికమైనవి కావడం వల్ల 90 నుంచి వంద శాతం మంచి ఫలితాలను సర్జరీ లేకుండానే పొందవచ్చు. 



logo