e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, October 22, 2021
Home ఆరోగ్యం నోటి క్యాన్సర్‌లో మన దేశానిదే మొదటి స్థానం

నోటి క్యాన్సర్‌లో మన దేశానిదే మొదటి స్థానం

పది, ఇంటర్‌ తరగతులనుండే చదువులంటూ ఇంటికి దూరంగా ఉండే అబ్బాయిలు ఆ తర్వాత పై చదువులు, ఉద్యోగాలు, కాన్ఫరెన్సులు, మీటింగ్‌లు అని దూరపు ప్రయాణాలు ఎక్కువగా చేస్తుంటారు. ఇంటివంటకు, కుటుంబ సభ్యులకు దూరంగా ఉండక తప్పని పరిస్థితులు. అంతేకాకుండా అమ్మాయిలతో పోలిస్తే .. అబ్బాయిలకు స్నేహితులు, సరదాలు, చాలా ఎక్కువ అని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో సరదాగా, టైమ్‌పాస్‌గా మొదలయ్యే స్మోకింగ్‌, గుట్కా, ఆల్కహాల్‌ వంటి దురలవాట్లతో బయట తిండికూడా చాలా ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. బయట తీసుకునే ఆహారంలో రుచికరంగా నూనెలు, ఉప్పూ కారాలు ఎక్కువగా గుప్పించడమే కాకుండా కొన్ని ఆర్టిఫిషియల్‌ ఫుడ్‌ కలర్స్‌, కెమికల్స్‌, వాడిన నూనెలే మళ్లీ మళ్లీ వాడటమూ జరుగుతూ ఉంటుంది. ఇవీ క్యాన్సర్‌ కారకాలు కావచ్చు.

దురలవాట్లు, బయట తిండి ఎక్కువగా తీసుకోవటం, వృత్తి పరమైన కారణాలు, ఎక్కువగా మానసిక ఒత్తిడికి గురవటం, వాతావరణ కాలుష్యానికి గురవటం, నైట్‌ డ్యూటీలు, ఎ.సి. రూముల్లో నిద్ర లేకుండా పనిచేయటం, శారీరక శ్రమ చాలా తక్కువగా ఉండటం.. మరిన్ని కారణాలు. ఏమయితేనేం మొత్తంగా చూస్తే పురుషులు స్త్రీలకంటే ఎక్కువగా క్యాన్సర్‌కు గురవుతున్నారన్నది నిజం. పునరుత్పత్తి వ్యవస్థకు సంబంధించిన క్యాన్సర్స్‌ తప్పితే, ఇంక ఏవి తీసుకున్నా స్త్రీలకంటే పురుషులలోనే ఎక్కువ. ఈ మధ్య పురుషులు కూడా రొమ్ము క్యాన్సర్‌కు గురయ్యే ప్రమాదం ఎక్కువ కావటం మరింత బాధాకరం. ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్‌కు గురయ్యే వారి వివరాలు చూస్తే 2007 నుండి 2030 సంవత్సరానికి ఈ సంఖ్య 45% పెరిగే అవకాశం ఉంది. అవగాహన పెంచే కార్యక్రమాలు, జాగ్రత్తలు, ముందుగానే పసిగట్టే స్క్రీనింగ్‌ టెస్టులు ఎన్ని వచ్చినా క్యాన్సర్‌ రాకుండా నివారించగలగటం ఎవరి చేతుల్లోనూ లేదనేది సత్యం. WHO అధ్యయనం ప్రకారం 2030 నాటికి ఊపిరితిత్తుల క్యాన్సర్‌ మరణాల సంఖ్య అన్ని క్యాన్సర్స్‌ కంటే అధికంగా ఉండవచ్చు అని అంచనా. సిగరెట్‌, బీడీలు, పాన్‌, గుట్కా, ఆల్కహాల్‌, పొగాకు నమలటం మొదలైనవి నోటి, ఊపిరితిత్తుల క్యాన్సర్స్‌కు దారితీసే ప్రమాదం ఉంది. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే నోటి క్యాన్సర్స్‌ విషయంలో మన దేశమే మొదటి స్థానంలో ఉంది. ప్రతి సంవత్సరం దాదాపు 80,000 మంది దాకా ఈ క్యాన్సర్‌ బారిన పడుతున్నారు. వాతావరణ కాలుష్యం అధికంగా ఉన్న కోల్‌కతాలో ప్రతి లక్ష
మందిలో 20 మంది లంగ్‌ క్యాన్సర్‌కు గురవుతున్నారు. తర్వాత, కాలుష్యం అధికంగా ఉండే ఢిల్లీలో ఈ సంఖ్య 15 మందిగా ఉంది. ఉప్పు, కారాలు, పచ్చళ్లు, మసాలాలు ఎక్కువగా తీసుకోవటం, ఇంకా మరిన్ని దురలవాట్లు కూడా ఉండటం పొట్టకు సంబంధించిన క్యాన్సర్లకు కారణమవుతున్నాయి. అందుకే, భారతదేశంలోని పురుషులు ఈ క్యాన్సర్‌ బారిన పడటం ఎక్కువని గణాంకాలు చెబుతున్నాయి. మన దేశంలోని పురుషులు నోరు, అన్నవాహిక, ఊపిరితిత్తులు, పొట్ట, కోలన్‌ క్యాన్సర్‌కు గురవటం చాలా ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. అలవాట్లు, జీవనశైలి, ఆహారం ఆరోగ్యకరంగా లేకపోవటం క్యాన్సర్‌ కారకాలు అవటంతో పాటు.. పురుషులలో వృత్తిపరమైన కారణాలూ ఉంటాయి. ఆస్‌బెస్టాస్‌ కంపెనీలో పనిచేసేవారు, అల్యూమినియమ్‌ ప్రొడక్షన్‌ కంపెనీలో ఉద్యోగులు, ఆల్కహాలిక్‌ బేవరేజెస్‌, పొగాకు ఉత్పత్తుల కంపెనీలు, రేడియమ్‌ ఉత్పత్తులు, రేడియో న్యూక్లయిడ్స్‌, చెక్కపొడి, గామా రేడియేషన్‌ ఎక్కువగా ఉండే ప్రాంతాలలో కొలువుచేసేవారికి ఊపిరితిత్తులు, హెడ్‌, నెక్‌ క్యాన్సర్స్‌.. ఇతర వృత్తులవారికంటే ఎక్కువగా వచ్చే రిస్క్‌ ఉంటుంది. ఎండకు ఎక్కువగా తిరుగటం లేదా ఎండ అస్సలు తగలకుండా ఏసీ రూముల్లో అలా కూర్చొనే గంటల తరబడి పని చేయటం, నైట్‌ డ్యూటీలు, పెస్టిసైడ్స్‌, కెమికల్స్‌ ప్రభావానికి మగవారే ఎక్కువగా గురవుతారు. కాబట్టి, వారికి క్యాన్సర్స్‌ ముప్పు పొంచి ఉంటుంది. సాధారణంగా పురుషులు అమ్మ, భార్య ఏవి పెడితే అవి తింటూ ఉంటారు. అందుకే బయటకు వెళ్లినప్పుడు తేలికగా దొరికే జంక్‌ ఫుడ్‌ను ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఆ ఫలితమే ఊబకాయం. పురుషులలో వయస్సు పై బడ్డాక కన్పించే ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ను ముందుగానే తెలుసుకోవటానికి PSA (Prostate Specific Antigen) అనే రక్త పరీక్షను 50 ఏళ్లు పైబడ్డాక చేయించుకోవటం మంచిది. ఎందుకంటే, ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ లక్షణాలైన వీర్యంలో, మూత్రంలో రక్తం, నడుం, తుంటి, పక్క టెముకల నొప్పులు, మూత్ర సంబంధ సమస్యలు కన్పించేసరికే దశ ముదిరిపోయి ఎముకలకు కూడా పాకే ప్రమాదం ఉంటుంది. కాబట్టి, PSA పరీక్షలో యాంటిజెన్‌ పెరగటాన్ని గమనిస్తే ఇతర పరీక్షలు డిజిటల్‌ రెక్టల్‌ ఎగ్జామినేషన్‌ (డీఆర్‌ఈ) ప్రొస్టేట్‌ బయాప్సితో పాటు అవసరమయితే అల్ట్రాసౌండ్‌, బోన్‌స్కాన్‌, CT స్కాన్‌, MRI, బయాప్సి వంటి పరీక్షలు చేస్తారు. 50 ఏళ్లు పైబడిన పురుషులలో లక్షణాలు ఉన్నా లేకున్నా PSA టెస్ట్‌, DRE చేయించుకుని డాక్టర్‌ సలహా మేరకు ఎంత కాలంలో మళ్లీ చేయించుకుంటే మంచిది? PSA టెస్ట్‌లో మార్పులు ఎలా ఉంటున్నాయి? ఇంకా ఇతర పరీక్షలను ఎటువంటి లక్షణాలు ఉన్నప్పుడు తప్పనిసరిగా చేయించుకోవాలి? అనే విషయాలమీద అవగాహన పెంపొందించుకోవటం తప్పనిసరి. పురుషులు ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు.

  1. తగ్గని దగ్గు, దగ్గుతో పాటు రక్తం.
  2. ఆకలి, బరువు తగ్గటం.
  3. నొప్పితోపాటు జ్వరం.
  4. మూత్రం ఆగి ఆగి రావటం, రక్తం కన్పించటం.
  5. మలవిసర్జనలో రక్తస్రావం.
  6. తీవ్రమయిన అజీరి.్త
  7. గొంతు నొప్పి, ఘన పదార్థాలు తీసుకోలేక పోవటం.
  8. నోటిలో మానని పుండ్లు.
  9. ఎముకల నొప్పులు.
- Advertisement -

పై లక్షణాలను ఇన్‌ఫెక్షన్స్‌ అని, పైల్స్‌ అని, రోగ నిరోధక శక్తి తగ్గిందని, స్మోకింగ్‌ వల్ల కొద్దిగా దగ్గు వస్తూ ఉంది అని నిర్లక్ష్యం చేయటం జరుగుతూ ఉంటుంది. కానీ వయస్సు పైబడి, దురలవాట్లు ఉండి, ఈ లక్షణాలు కన్పిస్తే మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. పురుషులలో ఎక్కువగా కన్పించే నోరు, అన్నవాహిక, ఊపిరితిత్తులు, పొట్ట, కోలన్‌, ప్రొస్టేట్‌ క్యాన్సర్లకు అవి హెచ్చరికలూ కావచ్చు. కాబట్టి, ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన పెంపొందించుకోవటం
చాలా ముఖ్యం.

డాక్టర్‌ మోహనవంశీ
చీఫ్‌ సర్జికల్‌ ఆంకాలజిస్ట్‌, ఒమేగా హాస్పిటల్స్‌
హైదరాబాద్‌: 9848011421
కర్నూల్‌: 08518-273001
గుంటూర్‌: 0863-2223300

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement