గురువారం 24 సెప్టెంబర్ 2020
Health - Aug 03, 2020 , 18:34:11

శ్వాసకోశ వ్యాధుల నుంచి ఇలా తప్పించుకోండి..!

శ్వాసకోశ వ్యాధుల నుంచి ఇలా తప్పించుకోండి..!

న్యూ ఢిల్లీ: వర్షాకాలం.. ఎండ వేడిమి నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. చాలామంది ఈ కాలాన్ని ఎంజాయ్‌ చేద్దాం అనుకుంటారు. కానీ, ఇది శ్వాసకోశ, అంటు వ్యాధులను మోసుకొస్తుంది. ఈ ఏడాది కొవిడ్‌ -19 దీనికి తోడైంది. దీంతో చాలా అప్రమత్తంగా ఉండాల్సి వస్తోంది. ఈ కాలం ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే శ్వాసకోశ సమస్యలున్నవారిలో కరోనా వైరస్‌ ప్రభావం తీవ్రంగా ఉంటుందని ఇటీవల పలు అధ్యయనాల్లో కూడా తేలింది. వర్షాకాలం, శీతాకాలంలో నావె‌ల్‌ కరోనా వైరస్‌ ఉధృతి తీవ్రంగా ఉంటుందని కూడా నిపుణులు హెచ్చరించారు.  ఐఐటీ భువనేశ్వర్,  ఎయిమ్స్ భువనేశ్వర్ పరిశోధకులు సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనంలో ఉష్ణోగ్రత, సాపేక్ష ఆర్థ్రత వ్యాధుల పెరుగుదల రేటును రెట్టింపు చేస్తాయని గుర్తించారు. అయితే, వాతావరణానికి, కొవిడ్‌-19 కి కారణమయ్యే సార్స్‌ సీఓవీ- 2 మధ్య ఎలాంటి సంబంధం లేదని కూడా ఓ అధ్యయనంలో తేలింది. ఏదేమైనప్పటికి కూడా ఈ కాలంలో శ్వాసకోశ వ్యాధులబారిన పడకుండా చూసుకోవాలి. 

వర్షాకాలంలో కనిపించే సాధారణ శ్వాసకోశ సమస్యలు..

ముంబైలోని చెంబూర్ జెన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పల్మోనాలజిస్ట్ డాక్టర్ అరవింద్ కేట్ ప్రకారం.. వర్షాకాలంలో శ్వాసకోశ సమస్యల వల్ల తీవ్రంగా అనారోగ్యానికి గురవుతాం. ముఖ్యంగా కొన్ని శ్వాసకోశ సమస్యలున్నవారికి ఈ కాలం చాలా ప్రమాదకరం.

ఉబ్బసం(ఆస్తమా)

ఉబ్బసం అనేది ఊపరితిత్తుల వాయుమార్గాల తాపజనక వ్యాధి. ఇది శ్వాస తీసుకోవడం కష్టతరం చేస్తుంది. శ్వాసలోపం, ఛాతీలో బిగుతు, దగ్గు (ముఖ్యంగా రాత్రి), ఊపిరి తీసుకోవడంలో సమస్య, అలసట దీని సాధారణ లక్షణాలు.

అప్పర్‌ అండ్‌ లోయర్‌ రెస్పిరేటరీ ఇన్‌ఫెక్షన్స్‌..

అప్పర్‌ రెస్పిరేటరీ సాధారణ లక్షణం దగ్గు. ముక్కు కారడం, గొంతు నొప్పి, తుమ్ములు, పల్మనరీ ఫైబ్రోసిస్‌. అలాగే, లోయర్‌ రెస్పిరేటరీ ఇన్‌ఫెక్షన్స్‌ ఊపిరితిత్తులు లేదా శ్వాస వాయుమార్గాల్లో ప్రభావం చూపుతుంది. ఇవి న్యుమోనియా, బ్రాంకైటిస్‌, క్షయ లేదా టీబీ. తీవ్రమైన దగ్గు ఉంటుంది. చాతీ బిగుతుగా అనిపిస్తుంది. శ్వాస ఆడదు. ఈ కొవిడ్‌-19 వేళ ఈ ఇన్‌ఫెక్షన్స్‌ ఉన్నవాళ్లు అజాగ్రత్తగా ఉంటే ప్రాణానికే ముప్పని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటినుంచి రక్షణ పొందాలంటే కింద పేర్కొన్న వాటిని తప్పకుండా పాటించాలని సూచిస్తున్నారు.  

 • యాపిల్స్.. ఇవి ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.  
 • ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలతో నిండిన ఆహారాలు, వాల్‌నట్‌, బ్రకోలీ లాంటివి తీసుకోవాలి. ఇందులో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. 
 • బీన్స్‌ను క్రమంతప్పకుండా తినాలి. ఇవి ఊపిరితిత్తులకు హానిచేసే ఫ్రీరాడికల్స్‌తో పోరాడతాయి. 
 • బెర్రీలు యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. వీటిని విరివిగా తీసుకోవాలి.
 • బొప్పాయి, పైనాపిల్‌, కివీ, క్యాబేజీ, క్యారెట్లు, పసుపు, అల్లంలాంటి పదార్థాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
 • స్వచ్ఛమైన తేనె దగ్గును తగ్గిస్తుంది. 
 • మంచి నీటిని బాగా తాగాలి.
 • అదనపు కెలరీలు తగ్గించుకునేందుకు ప్రతిరోజూ కొంత సమయం వ్యాయామం చేయాలి. లేదా యోగా, ధాన్యం తప్పకుండా చేయాలి.
 • ప్రతిరోజూ రెండుసార్లు ఆవిరిపట్టుకోవాలి. దీంతో శ్లేష్మం విచ్ఛిన్నం అవుతుంది. 
 • ఉప్పునీటితో రెండుసార్లు గార్గిల్‌ చేయాలి.
 • సిగరెట్లు, గుట్కా, తంబాకు వాడకం మానేయాలి.
 • వర్షంలో తడవకుండా చూసుకోవాలి. ఇందుకోసం ఎప్పుడూ వెంట గొడుగు లేదా రెయిన్‌ కోట్‌ ఉంచుకోవాలి.
 • ఆస్తమా ఉంటే ఇన్‌హేలర్‌ లేదా సంబంధిత మందులు తప్పకుండా వాడాలి.
 • బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయవద్దు. ఎవరైనా ఉమ్మివేసినా వారించండి.
 • బయటికి వెళ్లినప్పుడు మాస్కు తప్పనిసరిగా ధరించాలి. 
 • సామాజిక దూరం పాటించాలి.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo