e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 21, 2021
Home ఆరోగ్యం పొరబాటుతో క్యాన్సర్‌ ముప్పు

పొరబాటుతో క్యాన్సర్‌ ముప్పు


పొరబాటుతో క్యాన్సర్‌ ముప్పు

నిరక్షరాస్యత, గ్రామీణ నేపథ్యం, ఆర్థిక పరిస్థితులు, అమాయకత్వం ఆరోగ్య సమస్యలను తీవ్రమైన దశకు తీసుకెళ్ళడానికి ఒక కారణం అయితే బిజీలైఫ్‌, అందుబాటులో ఉండే మెడికల్‌ షాపులు, ఫోన్లలోనే డాక్టర్‌ సలహాలు, ఓవర్‌ది కౌంటర్‌ మెడిసిన్స్‌, యాంటిబయాటిక్స్‌, పెయిన్‌ కిల్లర్స్‌, ఇంటర్నెట్‌ నాలెడ్జ్‌ అనారోగ్య లక్షణాలకు తాత్కాలికంగా ఉపశమనం ఇచ్చి సమస్యను తీవ్రం చేసే మరొక కారణమని చెప్పుకోవచ్చు. వేడి చేసిందని, పడని ఆహార పదార్థాలు తీసుకున్నామని, ప్రయాణాలవల్ల అని, అలసట అని, ఎప్పుడో తగిలిన దెబ్బల తాలూకు చిహ్నాలని భ్రమ పడటం వల్ల, వయస్సు పైబడే కొద్ది కన్పించే లక్షణాలే అని సర్దుకు పోవటం.. కారణాలేమైతేనేం క్యాన్సర్‌కు ప్రమోషన్‌ ఇచ్చి లేటు దశలో గుర్తించే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.


అవగాహన పెంపొందించుకుని తొలిదశలోనే కనుగొంటే ఆధునిక వైద్యంలో ఏ సవాలుకైనా సమాధానం లభిస్తుంది. రోగ నిర్ధారణ పరీక్షలు, చికిత్సా విధానాలు రెండూ వైద్యరంగానికి కొత్తదనాన్ని సంతరిస్తూ ముందుకు తీసుకు వెళ్తున్నాయి. ప్రతీ దానికి బెంబేలెత్తి డాక్టర్‌ చెప్పిన వైద్యంతో తృప్తి పడక గంటల్లోనే లక్షణాలు తగ్గుముఖం పట్టాలనే స్పీడ్‌ యుగంలో అనేకమందిని సంప్రదిస్తూ ఏమీ లేని దానికి ఎన్నో రకాల పరీక్షలు చేయించుకుని, ‘ఇంత ఖర్చు పెట్టాం. ఏ సమస్యా లేదు’ అని జేబులు ఖాళీ చేసుకునేవారు కొందరైతే, ఎదుటివారికి నొప్పి కలిగితే విలవిలాడి పోతూ తమకు ఏమైనా ఐ డోంట్‌ కేర్‌ అనే ధీరులు మరికొందరు. రోగం, దాని తాలుకూ లక్షణాలు, ఆ వ్యాధికి ఎలాంటి ట్రీట్‌మెంట్‌ అందుతుందనే విషయాలలో రోగి మనస్తత్వం ప్రధాన పాత్ర పోషిస్తుంది. మరీ ముఖ్యంగా క్యాన్సర్‌ ట్రీట్‌మెంట్‌ విధానాలు అన్నీ ఏ దశలో కనుగొన్నామనే విషయాలమీదే ఎక్కువగా ఆధారపడి ఉంటాయి.

లనొప్పి: తరచూ అందరం ఎదుర్కొనేదే. చికాకు, పనుల ఒత్తిడి, ఎండ, కొన్ని రకాల వాసనలు, ఆకలి వంటి కారణాలతో మైగ్రెయిన్‌ లేదా అప్పుడప్పుడు తలనొప్పి రావడం సహజమే. తలనొప్పి మందులను పర్సులో, జేబులో వేసుకుని కొద్దిగా లక్షణాలు కన్పించగానే ముందు జాగ్రత్త చర్యగా వేసుకుంటూ పోతే లివర్‌, కిడ్నీలు, రక్తపోటుమీద తీవ్ర ప్రభావం పడుతుంది. తలనొప్పికి కారణం తెలుసుకోవడం, మైగ్రెయిన్‌ అయితే నిర్దిష్టకాలం పాటు సరైన మందులు వాడితే సమస్యను అధిగమించే అవకాశం ఉంది. ఉదయం లేవగానే తలభారం, తీవ్రమైన నొప్పి, వేగంగా వచ్చే వాంతులు, వికారం వంటి లక్షణాలు బ్రెయిన్‌ ట్యూమర్స్‌కు సంకేతాలు కావచ్చు.
గొంతు నొప్పి: ‘చల్లటి పదార్థాలు, వాతావరణం, కొత్త ప్రదేశం, త్రాగేనీరు మారాయి. అందుకే గొంతు బొంగరు, నొప్పి’ అని బాధపడేవారిని అనేకమందిని చూస్తూ ఉంటాం. రెండు మూడు రోజుల్లో తగ్గకపోతే మందులు కోర్సుగా వాడటం లాంటి ప్రయత్నాలు చేసినా బాధిస్తుంటే చెకప్స్‌ చేయించుకోవడం తప్పనిసరి. థైరాయిడ్‌ క్యాన్సర్‌, గొంతు సంబంధిత క్యాన్సర్‌, లంగ్‌ క్యాన్సర్‌, లక్షణాలు తొలిదశలో ఇలానే ఉంటాయి.
దగ్గు, ఆయాసం: ముఖ్యంగా సిగరెట్లు తాగేవారు ‘మాకు ఇలాంటి లక్షణాలు అలవాటేలే’ అనుకుంటారు. కానీ, వీరికి లంగ్‌ క్యాన్సర్‌తోపాటు అనేక రకాల ఇతర క్యాన్సర్స్‌ వచ్చే ముప్పు ఎక్కువ అని గ్రహించుకుంటే మంచిది. గొంతులో నస, ఆగని దగ్గు, కల్లెలో రక్తం, ఆయాసం టి.బి., లంగ్‌ క్యాన్సర్‌ లక్షణాలు కావచ్చు.

కడుపు ఉబ్బరం, మంట: గతి తప్పుతున్న ఆహార
వేళలు, కంటికి ఇంపుగా నోరూరించే అనారోగ్య ఆహార పదార్థాలు, నిద్రలేమి, ఒత్తిడి ప్రధాన
కారకాలుగా కడుపులో మంట, త్రేన్పులు,
ఉబ్బరంగా ఉండటం, ఆకలి తగ్గటం, వికారం వంటి లక్షణాలు పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా ఎదుర్కొంటూ యాంటాసిడ్స్‌, పీపీటీ మందులు ఇంట్లో పెట్టుకుని అయిపోక ముందే కొనుక్కుని సంవత్సరాల తరబడి వాడేవారిని అనేకమందిని చూస్తుంటాం. ముందు సరైన జీవనశైలిని అలవర్చుకుని నీరు, పీచు ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకుంటూ ఉన్నప్పటికీ, జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలు వేధిస్తూ ఉంటే ఎండోస్కొపి, స్కానింగ్‌ లాంటి పరీక్షలతో జీర్ణాశయానికి సంబంధించిన క్యాన్సర్స్‌, లివర్‌, ప్యాంక్రియాజ్‌, గాల్‌బ్లాడర్‌ క్యాన్సర్స్‌ను తొలిదశలోనే కనుగొనే అవకాశం ఉంది.
మూత్ర వ్యవస్థలో తేడాలు: మూత్రంలో రక్తం పడటం, ఆగిఆగి రావడం, మంటగా ఉండటం మొదలైన లక్షణాలను వేడి చేసిందని భ్రమిస్తూ ఉంటారు. సాధారణంగా నీళ్ళు తక్కువగా తాగడం, ఇన్‌ఫెక్షన్స్‌, కిడ్నిస్టోన్స్‌ వంటి కారణాల వల్ల ఈ లక్షణాలు కలుగవచ్చు. లక్షణాలు తీవ్రంగా ఉండి చికిత్సలకు లొంగకపోతే యూరినరీ బ్లాడర్‌కు సంబంధించిన క్యాన్సర్స్‌ కావచ్చు అని గమనించుకోవాలి. 50 ఏళ్ల పైబడిన పురుషులలో ప్రొస్టేట్‌ గ్రంథి సమస్యలు, క్యాన్సర్‌ లక్షణాలు ఈ విధంగానే ఉండవచ్చు. నెలసరి మధ్య రక్తస్రావం, పొట్ట భారంగా ఉండటం, ఆకలి మందగించడం స్త్రీలు నెలసరి ముందు ఉండే సమస్యలుగా పొరబడవచ్చు. కానీ, కొన్ని సందర్భాల్లో ఓవేరియన్‌, యుటిరైన్‌ క్యాన్సర్స్‌ కావచ్చు.

మలవిసర్జనలో తేడాలు: అజీర్తి, విరోచనాలు, మలంలో రక్తం వంటి సింప్టమ్స్‌ ఆహారపు
అలవాట్లు మారినప్పుడు పైల్స్‌, ఫిషర్స్‌, ఫిస్టులా వంటి సమస్యలున్నప్పుడు కన్పించవచ్చు. కానీ, ఎప్పుడూ మల విసర్జన సమయంలో పడే రక్తాన్ని పైల్స్‌ అనుకున్నట్లయితే పొరబడుతున్నట్లే. దక్షిణ భారతదేశంలో పురుషులలో ఎక్కువగా కన్పించే కోలన్‌ క్యాన్సర్‌ లక్షణాలుకూడా కావచ్చు.
సిగ్మాయిడోస్కొపి, కొలనొస్కోపి వంటి పరీక్షలతో సమస్య ఏమిటో తేలిపోతుంది. అసలు
విషయాన్ని గమనించక రకరకాల ఆహార పదార్థాల వల్ల ఈ సమస్య తలెత్తుతుందని ఆపాదించుకుంటాం. ఆహార పదార్థాలు మార్చి మార్చి
తీసుకుంటూ ఇబ్బంది పడేకంటే సరైన పరీక్షలు చేయించుకోవడం ముఖ్యం. తీవ్రమైన అలసట, ఆకలి, బరువు తగ్గడం, వీడని జ్వరం ఇంకా ఆయా అవయవాలకు సంబంధించిన లక్షణాలు ఉన్నట్లయితే ‘గాలి సోకింది’, ‘దెయ్యం పట్టింది’,‘చేతబడి చేశారు’ అని పూజలు, మంత్రాలు, విభూది, తాయెత్తులు, దిష్టి తీయడాలు వంటి అనేక మూఢనమ్మకాల పాలవుతారు. ఏ విధమైన ప్రయత్నాలు ఫలించక పరీక్షలు చేయించేసరికి పరిస్థితి చేజారిపోతుంది. ఇలాంటి లక్షణాలు కనిపించే సమయానికి క్యాన్సర్‌ ఇతర భాగాలకు వ్యాపించి చికిత్సకు లొంగకుండా తయారవుతుంది. ప్రతినెలా
కనిపించే గడ్డలే అని, పాలగడ్డలు అని రొమ్ములో దీర్ఘకాలం పాటు కనిపించే కణితులను అశ్రద్ధ చేస్తే కణితి ఇతర భాగాలకు పాకే ప్రమాదం పొంచి ఉన్నట్లే. అలసట, రక్తహీనతతోపాటు చర్మం మీద ఊదారంగు మచ్చలు, తేలికగా కమిలిపోవడం, బ్లడ్‌ క్యాన్సర్‌ను హెచ్చరించవచ్చు. గోళ్లలో మార్పులు, ముందుకు వంగినట్లు ఉండటం, లివర్‌ మరియు లంగ్‌ క్యాన్సర్స్‌కు సూచనలు కావచ్చు. శరీరం మీద మచ్చలు, వాటిలో మార్పుల మీదకూడా ఒక కన్నేసి ఉంచితే మంచిది.

ఒత్తిడికి గురయినప్పుడు, వాతావరణం, ఆహారం మారినప్పుడు పైన పేర్కొన్న లక్షణాలు దాదాపు అందరూ ఎదుర్కొనేవే. అయితే, తీవ్రంగా ఉన్నప్పుడు అవే కారణాలు అని భ్రమపడి ముందు వాడిన మందులనే వాడుకుంటూ కాలం గడిపేస్తే సమస్యలను తీవ్రం చేసుకున్న వారమవుతాము. అందుకే, చాలావరకు క్యాన్సర్‌ ముదిరిన దశలోనే ట్రీట్‌మెంట్‌కు వస్తూ ఉంటారు. అదృష్టవశాత్తు గత కొంతకాలంగా హెల్త్‌ చెకప్స్‌, స్క్రీనింగ్‌ టెస్ట్‌లు, గైనిక్‌ చెకప్స్‌ చేయించుకోవడం, అవగాహన పెంపొందించుకోవడం వంటివి ఒక శుభ పరిణామంగా చెప్పుకోవచ్చు.

డాక్టర్‌ మోహనవంశీ
చీఫ్‌ సర్జికల్‌ ఆంకాలజిస్ట్‌, ఒమేగా హాస్పిటల్స్‌
హైదరాబాద్‌: 9848011421
కర్నూల్‌: 08518-273001
గుంటూర్‌: 0863-2223300

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పొరబాటుతో క్యాన్సర్‌ ముప్పు

ట్రెండింగ్‌

Advertisement