గురువారం 02 ఏప్రిల్ 2020
Health - Mar 19, 2020 , 22:57:27

మినరల్ వాటరా..? ప్లాస్టిక్ నీళ్లా..?

మినరల్ వాటరా..? ప్లాస్టిక్ నీళ్లా..?

బయటికి వెళ్లామంటే మంచి నీళ్ల బాటిల్ కొనుక్కుని నీళ్లు తాగడం మనకు అలవాటే. బయటికి వెళ్లినప్పుడు మాత్రమే కాదు.. ఇంట్లోకి కూడా మినరల్ వాటర్ బాటిళ్లను తెప్పించుకుంటుంటాం. అయితే ఇటీవల జరిగిన అధ్యయనం మాత్రం ఇలా బాటిల్ వాటర్ మంచిది కాదంటోంది. అదేంటో చూద్దామా..

  • నీట్ గా లేని చోట ట్యాప్ వాటర్ కూడా తాగడానికి ఆలోచిస్తాం. బయట మంచి నీళ్లు తాగాల్సి వస్తే మినరల్ వాటర్ బాటిల్ కొనుక్కోవడమే బెటర్ అనుకుంటాం. అందుకే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మంచి నీటి బాటిళ్లు మనకు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి. అయితే తాజాగా జరిగిన కొన్ని పరిశోధనలలో ఊహించని నిజాలు బయటపడ్డాయి...అవి... మినరల్ వాటర్ బాటిళ్లలో ప్లాస్టిక్ రేణువులు. ఇటీవల జరిగిన ఈ కొత్త అధ్యయనంలో 259 వాటర్ బాటిళ్లలో 90 శాతం కంటే ఎక్కువ చిన్న చిన్న ప్లాస్టిక్ రేణువులు మనిషి వెంట్రుక కంటే కొంచెం లావైనవి ఉన్నట్టు కనిపెట్టారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.
  • అమెరికాలోని లాభాపేక్ష లేని ఒక జర్నలిజం సంస్థ అయిన ఓర్బ్ మీడియా తరపున న్యూయార్క్ స్టేట్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. మన దేశంతో పాటు అమెరికా, చైనా, బ్రెజిల్, ఇండోనేషియా, మెక్సికో, లెబనాన్, కెన్యా, థాయిలాండ్ల నుంచి నీటి సీసాలను విశ్లేషించారు. వీటిలో మైక్రోప్లాస్టిక్స్ లేదా 5 మిల్లీ మీటర్ల కంటే తక్కువ పొడవున్న ప్లాస్టిక్ పదార్థాలతో 93 శాతం నీళ్లు కలుషితం అయ్యాయని తేలింది.
  • మైక్రోప్లాస్టిక్స్ గుర్తించడానికి, శాస్త్రవేత్తలు నైల్ రెడ్ అనే ఒక రంగును ఉపయోగించారు. ఈ డై నీటిలో తేలియాడే ప్లాస్టిక్ రేణువులను బంధించి, అవి ఫ్లోరసెన్స్ తో కనిపించేలా చేస్తుంది. లీటర్ నీటిలో 10 ప్లాస్టిక్ రేణువులను, మరో 314 ఇతర రేణువులను గుర్తించారు. ఈ 314 రేణువులు మరీ చిన్న సైజులో ఉండడం వల్ల ప్లాస్టిక్ అని నిర్ధారణ చేయలేకపోయారు.
  • పరీక్షించిన బాటిళ్లలో కేవలం 17 బాటిళ్లలో మాత్రమే మైక్రోప్లాస్టిక్స్ లేవు. కొన్నింటిలో వేల సంఖ్యలో మైక్రోప్లాస్టిక్స్ ఉన్నాయి. బ్రాండులను బట్టి వీటి సంఖ్యలో తేడా ఉంది. అయితే ఈ నీటిలోకి ప్లాస్టిక్ రేణువులు ఏ విధంగా వస్తున్నాయన్నది ఇంకా తేలలేదు. నీరు తెచ్చిన దగ్గరి నుంచా, బాటిలింగ్ చేసే ప్రక్రియలో, బాటిల్ మానుఫాక్చరింగ్, లేదా బాటిల్ మూతల నుంచా అనేది తెలుసుకోవాల్సి ఉంది.
  • ఈ ప్లాస్టిక్ రేణువులు మన ఆరోగ్యాన్ని దెబ్బతీసే రసాయనాలను విడుదల చేస్తాయంటున్నారు అధ్యయనకారులు ప్రొఫెసర్ షెర్రీ మాసన్. కొన్ని చిన్న చిన్న పార్టికిల్స్ మన జీర్ణ మార్గాల్లో ప్రయాణించి, మిగిలిన శరీరాన్ని చేరుతాయంటున్నారు. ఈ మైక్రోప్లాస్టిక్ రేణువులు జీర్ణ వ్యవస్థ లైనింగ్ లోని వ్యాధి నిరోధక కణంలో ఉండిపోవచ్చు. లేదా లింఫాటిక్ సిస్టమ్ ద్వారా లింఫ్ గ్రంథులను చేరవచ్చు. లేదా రక్తంలో కలిసి లివర్ లో పేరుకుపోవచ్చు. ఇవి మానవ కణజాలంపై ఎలా ప్రభావం చూపిస్తాయనేది ఇంకా పరిశోధనల్లో తేలాల్సి ఉంది. 


logo
>>>>>>