శనివారం 19 సెప్టెంబర్ 2020
Health - Mar 12, 2020 , 20:45:01

మానసిక సమస్యల్లో మన దేశమే టాప్‌!...

మానసిక సమస్యల్లో మన దేశమే టాప్‌!...

శరీరానికి ఏ చిన్న దెబ్బ తగిలినా డాక్టర్‌ దగ్గరికి పరుగులు తీస్తాం. అదే.. మనసుకు గాయమైతే ఏడుస్తూ కూచుంటాం. అందుకే మనదేశంలో మానసిక సమస్యలు, డిప్రెషన్లు, ఆత్మహత్యలు, సైకోపతిక్‌ సమస్యలు ఎక్కువౌతున్నాయి. ప్రపంచంలోనే చైనాతో పాటుగా ఈ అంశంలో మనమే ముందున్నామని, ఇప్పటికైనా మేల్కోవాలని సూచిస్తున్నాయి ఇటీవలి అధ్యయనాలు.

 ప్రపంచవ్యాప్తంగా మానసిక సమస్యలున్నవాళ్లు చికిత్స తీసుకోకుండా ఉన్నవాళ్లలో మూడొంతుల మంది ఇండియా, చైనా దేశాల్లోనే ఉన్నారని ఇటీవలి అధ్యయనంలో తేలింది. లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ హైజిన్‌ అండ్‌ ట్రాపికల్‌ మెడిసిన్‌కి చెందిన ప్రొఫెసర్‌ విక్రమ్‌ పటేల్‌ బృందం నిర్వహించిన అధ్యయనంలో ఆలోచించాల్సిన అంశం వెలుగుచూసింది. ఈ అధ్యయన ఫలితాలను ప్రముఖ అంతర్జాతీయ పత్రిక లాన్సెట్‌ ప్రచురించింది. 

ఇండియా, చైనా దేశాల్లో కలిపి 2.5 బిలియన్లకు పైగా జనాభా ఉంది. అంటే ప్రపంచ జనాభాలో ఇది 38 శాతం. మానసిక, న్యూరలాజికల్‌ సమస్యలతో ఉన్నవాళ్లలో మూడొంతుల మంది ఈ రెండు దేశాల్లోనే ఉన్నారు. అంటే అభివృద్ధి చెందిన దేశాల్లో కన్నా ఈ సంఖ్య ఎక్కువ. వీళ్లు చికిత్స తీసుకోకుండా ఇలాగే ఉంటే 2025 నాటికి 39.6 మిలియన్ల సంవత్సరాల ఆరోగ్యకరమైన జీవితాన్ని చైనీయులు, 38.1 మిలియన్‌ సంవత్సరాల ఆరోగ్యకరమైన జీవితాన్ని భారతీయులు కోల్పోతారని అధ్యయనకారులు హెచ్చరిస్తున్నారు.

 మానసిక వైద్యం కోసం తగినంత బడ్జెట్‌ లేకపోవడం, మానసిక వైద్య నిపుణులు చాలా తక్కువ సంఖ్యలో ఉండడం, గ్రామాల్లో మానసిక సేవలు లభించకపోవడం లాంటి కారణాలు ఒక ఎత్తయితే, మానసిక వైద్యం  పట్ల ఉన్న అనేక రకాల అపోహలు ఈ పరిస్థితికి మరో కారణం.  చైనాలో సైకోటిక్‌ వ్యాధులతో బాధపడుతున్నవాళ్లలో 40 శాతం మందికి చికిత్స అందడం లేదు. కాగా, మనదేశంలో ప్రతి 10 మందిలో ఒకరికి మాత్రమే సరైన మానసిక వైద్యం అందుతోంది. శరీరానికి వైద్యం ఎంత అవసరమో, మానసికమైన సమస్యలకు కూడా వైద్యసహాయం అంతే ముఖ్యమని ఇప్పటికైనా అర్థం చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. logo