e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 17, 2021
Home ఆరోగ్యం అమ్మ కడుపు చల్లగా..

అమ్మ కడుపు చల్లగా..

కరోనా సమయం గర్భిణులకు అగ్ని పరీక్షే. ఓవైపు కడుపులోని బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకోవాలి. మరోవైపు జిత్తులమారి వైరస్‌ను నిలువరించాలి. ఎప్పుడు, ఏ వైపు నుంచి క్రిమి దాడి చేస్తుందో అన్న భయం వెంటాడుతూ ఉంటుంది. పొరపాటున కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయితే? కాబోయే తల్లికి ఎలాంటి ఇబ్బంది ఉంటుంది? పిండానికి ఏమైనా సమస్యా? పుట్టిన బిడ్డకూ కరోనా వస్తుందా? ఆ సమయంలో బిడ్డకు పాలు ఇవ్వొచ్చా? ఇలా అనేకానేక సందేహాలు. సీనియర్‌ వైద్యులు, ప్రముఖ గైనకాలజిస్ట్‌ డా. బాలాంబ ఆ అనుమానాలను నివృత్తి చేస్తున్నారు.

అమ్మ కడుపు చల్లగా..

కరోనా సమయంలో… మిగిలిన వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో, గర్భిణులూ అవే జాగ్రత్తలు తీసుకోవాలి. మాస్క్‌ పెట్టుకోవాలి. ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోవాలి. చెకప్‌ల కోసం ఆసుపత్రులకు మినహా ఎక్కడికీ వెళ్లకూడదు. కుటుంబ సభ్యులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరివల్లే గర్భిణులకు వైరస్‌ సోకే ప్రమాదం ఎక్కువ. ఇంట్లో వాళ్లు ఎంత జాగ్రత్తగా ఉంటే, గర్భిణులు అంత సురక్షితంగా ఉంటారు. పెండ్లిళ్లకు, చావులకు, పుట్టిన రోజు వేడుకలకు, పార్టీలకు వెళ్లడం మానుకోవాలి. ఆఫీసులకు వెళ్లేవారు చాలా జాగ్రత్తలు పాటించాలి. ఇంటికి రాగానే చెప్పులు బయటే వదిలేసి, నేరుగా వెళ్లి స్నానం చేయాలి. ఇంట్లో వెంటిలేషన్‌ ఎక్కువగా ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. ప్రస్తుతం గాల్లో కూడా కరోనా వ్యాప్తి చెందే ఆస్కారం ఉంది. వెంటిలేషన్‌ ఎక్కువగా ఉంటే వైరస్‌ ప్రభావం తక్కువగా ఉంటుంది.

కరోనా పాజిటివ్‌ వస్తే?
గర్భిణులు కడుపులో బిడ్డను మోస్తుంటారు కాబట్టి, వీరిలో రోగ నిరోధక శక్తి కొంత తక్కువగానే ఉంటుంది. కాబట్టి, కరోనా వేగంగా సోకే ఆస్కారం ఉంది. కరోనా లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. కరోనా సోకిన సాధారణ ఆరోగ్యవంతులకూ, గర్భిణులకూ చికిత్స విషయంలో కొంత వ్యత్యాసం ఉంటుంది. ఎందుకంటే తల్లితో పాటు కడుపులోని బిడ్డ ఆరోగ్యాన్నీ దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. గర్భిణులు కూడా జలుబు, దగ్గు, జ్వరం వచ్చినప్పుడు సొంత వైద్యం చేసుకో కూడదు. వీలైతే డాక్టర్‌ వద్దకు వెళ్లాలి. లేదంటే, కనీసం ఫోన్‌లో అయినా సంప్రదించి మందులు వేసుకోవాలి. రెండుమూడు రోజులైనా లక్షణాలు వదలకపోతే కరోనా పరీక్ష చేయించుకోవాలి. డాక్టర్ల సూచన మేరకు మందులు వాడాలి. ఇతరుల మాదిరిగానే వీరు కూడా పూర్తి ఐసొలేషన్‌లోనే ఉండాలి. ఒకవేళ పరిస్థితి తీవ్రంగా ఉంటే ఆసుపత్రిలో చేరడం ఉత్తమం. అక్కడ, డాక్టర్లే జాగ్రత్తగా చూసుకుంటారు.

అమ్మ కడుపు చల్లగా..

ఏమైనా సమస్యలు ఎదురవుతాయా?
కరోనా ఫస్ట్‌వేవ్‌లో గర్భిణులపై ఎక్కువగా ప్రభావం పడలేదు. సెకండ్‌ వేవ్‌లో మాత్రం బాధితులుగా మారుతున్నారు. గర్భిణులకు కరోనా సోకడం వల్ల కొన్ని సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. అబార్షన్‌ కావచ్చు, లేదంటే నిర్ణీత సమయానికి ముందే డెలివరీ జరుగవచ్చు.

గర్భంలోని పిండానికి కూడా?
ఒకవేళ పరీక్షలో కరోనా పాజిటివ్‌ అని తేలినా ఆందోళన పడకూడదు. ఆందోళన వల్ల ఇతర సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. గర్భిణికి కరోనా పాజిటివ్‌ వచ్చినా, గర్భంలోని పిండానికి ఎలాంటి ప్రమాదమూ లేదు. పిండానికి కరోనా సోకే ఆస్కారమే లేదు. గర్భంలోని మాయ పిండానికి రక్షణ కవచంగా ఉంటుంది. డెలివరీ అయ్యాక తల్లి నుంచి పిల్లకు సోకితే చెప్పలేం కానీ, గర్భంలో ఉండగా మాత్రం పిండానికి కరోనా సోకదు.

రెగ్యులర్‌ చెకప్‌కు వెళ్లాల్సిందేనా?

అమ్మ కడుపు చల్లగా..


ప్రస్తుత విపత్కర సమయంలో గర్భిణులు పదేపదే ఆసుపత్రుల వెంట తిరగడం మంచిది కాదు. అయితే, కొన్ని సందర్భాల్లో తప్పనిసరిగా వెళ్లాల్సిందే. ఎలాంటి సమస్యా లేనివారు నెలకోసారి వెళ్లినా సరిపోతుంది. ఫోన్‌ ద్వారా సంప్రదించడమో, వీడియో కాల్‌ చేయడమో ఉత్తమం. తీవ్ర సమస్య ఉన్నవారు(క్రిటికల్‌ కేసులు) మాత్రం డాక్టర్‌ సూచన ప్రకారం దవాఖనకు రావాల్సిందే. గర్భిణులు 3,5,7 నెలల్లో తప్పనిసరిగా డాక్టర్‌ వద్దకు వెళ్లాల్సిందే. మరో ముఖ్య విషయం, నార్మల్‌ చెకప్‌ కోసం కానీ డెలివరీ సమయంలో కానీ పేషెంట్‌తో ఒకరిద్దరు మినహా ఎక్కువ మంది రావొద్దు. దీని వల్ల డాక్టర్లకు ఇబ్బంది కలగడంతో పాటు, అక్కడికి వచ్చిన వారికి కరోనా సోకే ఆస్కారం ఉంటుంది. మరీ ముఖ్యంగా తల్లి, పిల్లకు సేవ చేసే వారికి కరోనా సోకే ప్రమాదం మరీ ఎక్కువ.

తల్లిపాలతో పిల్లలకు?

అమ్మ కడుపు చల్లగా..


కరోనా వచ్చిన తల్లులు తమ బిడ్డలకు నిర్భయంగా పాలు ఇవ్వొచ్చు. తల్లిపాల ద్వారా బిడ్డకు కరోనా సోకే అవకాశమే లేదు. ఒక విధంగా చెప్పాలంటే, తల్లిపాలే శిశువుకు శ్రీరామ రక్ష. తల్లి పాలు తాగితేనే శిశువులు ఆరోగ్యంగా ఉంటారు. కానీ పాలిచ్చే సమయంలో బాలింతలు తగు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. తల్లి కచ్చితంగా మాస్క్‌ పెట్టుకోవాలి. చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. దగ్గు లేదా తుమ్ము వస్తే పక్కకు తిరగాలి. వెలుతురు, గాలి సోకేచోట పాలిస్తే మరీ మంచిది. కరోనా వచ్చిన తల్లులు పిల్లల్ని పక్కన పడుకోబెట్టుకోవద్దు. కనీసం ఆరు గజాల దూరం ఉండేలా చూసుకోవాలి. జాగ్రత్తలు పాటించకపోతే మాత్రం తల్లి ద్వారా బిడ్డకు సోకే ప్రమాదం ఉంటుంది.

ఈ సమయంలో ప్రెగ్నెన్సీ క్షేమమేనా?

అమ్మ కడుపు చల్లగా..

ప్రస్తుత పరిస్థితుల్లో ప్రెగ్నెన్సీని వాయిదా వేసుకోవడమే ఉత్తమం. ఆసుపత్రుల చుట్టూ తిరగడం అంత శ్రేయస్కరం కాదు. అయితే, ఈ మధ్యే పెండ్లయిన వారు మరో సంవత్సరం ఆగితే ఎలాంటి నష్టం లేదు. తక్కువ వయసు వారు, ఇప్పటికే ఒక బిడ్డ ఉన్నవారు ప్రెగ్నెన్సీ వాయిదా వేసుకుంటేనే మంచిది. అయితే ఎక్కువ వయసు వారు, పిల్లల కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వారు మాత్రం ప్రయత్నం చేయొచ్చు.

గర్భిణులు వ్యాక్సిన్‌ వేసుకోవచ్చా?

అమ్మ కడుపు చల్లగా..

గర్భిణులకు మన వద్ద వ్యాక్సిన్‌ వేయడం లేదు. కానీ అమెరికా, యూకేలలో వేస్తున్నారు. అయితే అక్కడ ఇచ్చే ఫైజర్‌, మోడర్నా టీకాలు గర్భిణులపై కూడా ప్రయోగం చేశారు. మన వద్ద ఇచ్చే కోవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ టీకాలపై ఆ ప్రయోగం జరగలేదు. కాబట్టి, వైద్యులు సూచించే వరకు గర్భిణులు వ్యాక్సిన్‌ వేసుకోవద్దు.

డెలివరీకి ఎలాంటి ప్రణాళిక ఉండాలి?
గర్భిణులు, మరీ ముఖ్యంగా నెలలు నిండిన వారు డెలివరీకి రెండు రకాల ప్లానింగ్స్‌ సిద్ధం చేసుకోవాలి. కరోనా సోకిన వారికి అందరు డాక్టర్లూ డెలివరీ చేయడం లేదు. ఈ నేపథ్యంలో, నొప్పులు వస్తున్నప్పుడు ఆసుపత్రుల చుట్టూ తిరగడం మంచిది కాదు. కాబట్టి, ముందుగానే కరోనా సోకినవారికి కూడా డెలివరీ చేస్తున్న ఆసుపత్రుల జాబితా సిద్ధం చేసుకోవాలి. దగ్గర్లోని ప్రభుత్వ ఆసుపత్రికైనా వెళ్లొచ్చు.

డా. బాలాంబ
సీనియర్‌ వైద్యులు, ప్రముఖ గైనకాలజిస్ట్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
అమ్మ కడుపు చల్లగా..

ట్రెండింగ్‌

Advertisement