ఆదివారం 07 జూన్ 2020
Health - Apr 04, 2020 , 11:39:39

నా రక్తంలోనే కరోనాకు చికిత్స దాగుందేమో..

నా రక్తంలోనే కరోనాకు చికిత్స దాగుందేమో..

హైదరాబాద్: టిఫానీ పింక్నీ తనకు కరోనా సోకినట్టు తెలుసుకున్నప్పుడు ఒక క్షణం అవాక్కయ్యారు. తనపని అయిపోయిందనుకున్నారు. కానీ ఇప్పుడు ఆమె కరోనా ఉక్కు పిడికిళ్ల నుంచి విముక్తమయ్యారు. న్యూయార్క్ కు చెందిన పింక్నీ ఓ గృహిణి, పిల్లల తల్లి. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ప్రమాదకరమైన వ్యాధి బారిన పడి బయటపడ్డారు. తనకు పూర్తిగా నయమైంది. ఇప్పుడామె తన రక్తంతో కరోనా బాధితులను కాపాడుతానంటున్నారు. రక్తదానంతో కాదు. రక్తంలోని ప్లాజ్మా దానంతో. శతాబ్దకాలం క్రితం వరకు కొన్ని రకాల రోగాలకు చికిత్స చేసేందుకు వైద్యులు నయమైన రోగుల రక్తంలోని ప్లాజ్మాను తీసి రోగులకు ఎక్కించేవారు. అందులోని యాంటీబాడీస్ రోగాన్ని తరిమికొడతాయని అలా చేసేవారు. చైనాలో కరోనా కల్లోలం బద్దలైన తర్వాత మరోసారి వైద్యప్రపంచంలో ఈ చికిత్సావిధానం గురించి ఆసక్తి మొదలైంది. చైనాలో కొంతవరకు ఈ విధానం ఉపయోగించారని కూడా చెప్పుకుంటారు. అయితే ఈ విధానం ఇంకా శాస్త్ర్రీయంగా రుజువు కాలేదు. అందుకే ఇప్పుడు అమెరికా ఈ విధానంపై మేయో క్లినిక్ ఆధ్వర్యంలో జాతీయ అధ్యయనం మొదలుపెట్టింది. అమెరికన్ రెడ్‌క్రాస్ ప్లాజ్మా సేకరణ బాధ్యత నిర్వహిస్తుంది. నయమైన రోగుల రక్తంలోని సీరం లేదా ప్లాజ్మాలో యాంటీబాడీస్ ఉంటాయి. ఇవి రోగకారక సూక్ష్మజీవులను లేక వైరస్‌ను అంతం చేస్తాయనేది దీని వెనుకనున్న ఆలోచన. ఈ ఆలోచనపై అటోఇటో తేల్చే పనిలో పడింది అమెరికా. టీకా వచ్చేంతవరకు ఏదో ఒక ఉపాయం ఆలోచించాలి మరి.


logo