సోమవారం 25 జనవరి 2021
Health - Nov 30, 2020 , 17:02:16

బాదం పాలతో బోలెడు ప్రయోజనాలు..!

బాదం పాలతో బోలెడు ప్రయోజనాలు..!

హైద‌రాబాద్ : బాదం పప్పు ఆరోగ్యానికి ఎంతో మంచిదని చాలా మంది వీటిని ఎక్కువగా తింటుంటారు. కొందరు రాత్రి నానబెట్టిన బాదంలను ఉదయాన్నే తింటారు. ఇంకొందరు స్నాక్స్ టైంలో వీటిని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. వీటిని పొడి, ఆవు పాలతో తయారు చేసి బాదం పాలు కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయట. బాదం పాలు రంగు, రుచితో పాటు మంచి సువాసన కలిగి ఉంటాయి. అందుకే వీటిని చాలా మంది ఇష్టంగా తాగుతుంటారు. రీసెర్చర్లు చెబుతున్న దాని ప్రకారం.. బాదం పాలు పెద్దలతో పాటు పిల్లలకు కూడా చాలా మంచిది. ముఖ్యంగా డైట్ లో ఉన్నవారికి బాదం పాలు బాగా ఉపయోగపడతాయట. వీటిలో విటమిన్-ఈ, రిబోప్లేవిన్, విటమిన్-డి, కాపర్, జింక్, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ లాంటి చాలా రకాల విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. కాబట్టి బాదం పాలను తాగడం వల్ల ఎలాంటి లాభాలున్నాయో తెలుసుకుందాం. 

బరువు తగ్గొచ్చు..

బాదం పాలలో క్యాలరీలు, చెక్కర తక్కువ ఉన్నందున ఇవి ఎంత తాగినా బరువు పెరిగే అవకాశాలు లేవు. అంతేకాదు వీటిలో ఎక్కువగా లభించే మోనోస్యాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ బరువు తగ్గడానికి ఉపయోగపడతాయి.

బ్లడ్ షుగర్ లెవెల్స్ స్థిరంగా ఉంటాయి..

బాదం పాలు బాగా తియ్యగా ఉండవు కనుక.. ఇవి తాగడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ మారవు. అందుకనే డయాబెటీస్ ఉన్నవారికి బాదం మిల్క్ మంచి డ్రింక్ అని చెప్పవచ్చు. 

ఎముకలకు కూడా బలమే..

బాదం పాలలో అధికంగా లభించే కాల్షియం, విటమిన్-డి లు ఎముకలను బలంగా తయారుచేసేందుకు సహకరిస్తాయి. కాల్షియం ఎముకలకు బలాన్ని ఇవ్వడంతో పాటు, ఫ్రాక్ట్చర్, ఓస్టియోపొరోసిస్ లాంటివి కాకుండా కాపాడుతుంది. ఇక విటమిన్-డి ఎముకలకు కాల్షియం అందించేందుకు బాగా సహాయపడతాయి. 

గుండె ఆరోగ్యంగా ఉంటుంది..

బాదం పాలలో మోనోసాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, పాలీ అన్ స్యాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ లాంటి హెల్తీ ఫ్యాట్ అధికంగా లభిస్తుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. బాదం పాలు తాగడం వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గి గుడ్ కొలెస్ట్రాల్ పెరిగి గుండె పాడవకుండా ఉంటుంది.

దీర్ఘకాలిక వ్యాధుల నివార‌ణ‌..   

వీటిలో ఉండే విటమిన్-ఈ శరీరంలోని కణాలు డ్యామేజ్ అవకుండా కాపాడుతుంది. దీంతో పాటు చర్మంపై మంట లాంటివి రాకుండా కాపాడుతుంది. శరీరంలోని ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గించి దీర్ఘకాలిక వ్యాధులను అరికడతాయి. 

అల్జీమర్స్ కు అడ్డుకట్ట..

బాదం పాలలో లభించే విటమిన్-ఈ న్యూరోడిజెనరేటివ్ డిసీజ్ లాంటి అల్జీమర్స్ వ్యాధిని తగ్గిస్తుంది. మానసికంగా చురుగ్గా ఉండేందుకు విటమిన్-ఈ బాగా పనిచేస్తుందని స్టడీలు చెబుతున్నాయి.

లాక్టోస్- ఫ్రీ, డైరీ-ఫ్రీ..

బాదం పాటు సహజంగానే లాక్టోస్-ఫ్రీ.. అందుకనే వీటిని ఎక్కువ మంది తాగడానికి ఇష్టపడుతుంటారు. పాలలోని లాక్టోస్ట్ అరుగుదలకు ఇబ్బంది పెడుతుంది కాబట్టి లాక్టోస్ లేని బాదం పాలు ఆరోగ్యానికి హాని చేయవని నమ్ముతుంటారు.


logo