మంగళవారం 07 ఏప్రిల్ 2020
Health - Jan 29, 2020 , 22:32:30

‘కుష్టువ్యాధిరహిత సమాజం’ కోసం..

‘కుష్టువ్యాధిరహిత సమాజం’ కోసం..

అంటరానితనాన్ని నిర్మూలించేందుకు నడుంకట్టిన మన జాతిపిత మహాత్మాగాంధీ మరో గొప్ప పని కూడా చేశారు. దాని ఫలితంగానే కుష్ణు వ్యాధిగ్రస్తులు సమాజంలో బతకగలుగుతున్నారు. ఏండ్ల తరబడి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్న అవగాహన, చైతన్యం కారణంగా కుష్టు వ్యాధి తగ్గుముఖం పట్టింది. పూర్తిస్థాయిలో ఈ వ్యాధిని నిర్మూలించాలంటే ప్రతి ఒక్కరూ అవగాహన పొందాలి. నేడు కుష్టువ్యాధి నిర్మూలన రోజు. ఈ సందర్భంగా.. ఈ వ్యాధి గురించి కొన్ని ముఖ్యవివరాలు.

మహాత్మాగాంధీ అంటరానితనాన్ని నిర్మూలించే ప్రయత్నమే కాకుండా.. సంఘంలో కుష్టువ్యాధిగ్రస్తులను దూరంగా ఉంచే ఆచారాన్ని కూడా నిర్మూలించడానికి విశేష కృషి చేసి సఫలీకృతుడయ్యారు. అందుకే జాతిపిత వర్ధంతి (జనవరి 30)న కుష్టువ్యాధి నిర్మూలన రోజుగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా జనవరి 30, దానికి ముందు వచ్చే ఆదివారం కుష్టువ్యాధి గురించి అవగాహన పెంచే ప్రయత్నం చేస్తున్నారు. లాధా మహారాజు కుష్టువ్యాధిగ్రస్తులు అయనప్పటికీ రామాయణ పఠనం ద్వారా బిల్వ పత్రాల లేపనం ఉపయోగించి, ఆ వ్యాధి నుంచి విముక్తి పొందడం తన చిన్నతనంలోనే గమనించారు గాంధీజీ. అందుకే ఈ వ్యాధి గురించిన అపోహలు భయాలు తొలిగించి ప్రజల్లో నాటి నుంచే చైతన్యం తీసుకొచ్చారు మహాత్మ. కుష్టువ్యాధిగ్రస్తుడైన పరుచూరి శాస్త్రి గారికి.. గాంధీ సేవ చేస్తున్నప్పుడు తీసిన ఫొటో ఆనాటి నుంచే బహుళప్రాచుర్యం పొందింది. కుష్టువ్యాధి గురించి పురాణాల్లో కూడా ఉంది. 


శ్రీకృష్ణుడి కొడుకు సాంబుడు కుష్టువ్యాధిగ్రస్తుడై సూర్యారాధన చేసి రోగ విముక్తి పొందినట్లు, వ్యాధిగ్రస్తుడైన తన పతిని సతీ సుమతి నెత్తిన పెట్టుకొని సేవ చేసిన సందర్భాలు లున్నాయి. ‘బెన్హర్‌' సినిమాలో లెప్రసీ వ్యాధిగ్రస్తులను సంఘం నుంచి వెలివేసి ఆజన్మాంతం గుహలో బంధించిన వైనం చూడవచ్చు. ‘లెపర్‌' అనే పదాన్ని నిషేధించి లెప్రసీ వ్యాధిగ్రస్తులను ఇతర వ్యాధిగ్రస్తులతో సమానంగా చూడాలని 1948లో హవానాలో లెప్రసీ కాంగ్రెస్‌లో నిర్ణయించారు.


కుష్టువ్యాధికి ‘దేవుని శాపం ప్రధాన కారణం’ అని పలువురు అభిప్రాయపడేవారు. శాస్త్ర పరిశోధన ద్వారా ఈ వ్యాధి ‘మైకో బ్యాక్టీరియా లెప్రే’ అనే సూక్ష్మక్రిమి ద్వారా సంక్రమిస్తుందని హాన్సన్‌(Hansen) అనే శాస్త్రవేత్త సహేతుకంగా ధ్రువీకరించారు. వ్యాధి నిరోధక శక్తి దీనికి దిశానిర్దేశం చేస్తుందని అనుభవపూర్వకంగా నేర్పిన పాఠం. ఈ సూక్ష్మక్రిమి నరాలలోని ‘ష్వాస్‌ కణం’లోకి ప్రవేశించి ‘పరిధీయ నాడీ మండలం’లో (Peripheral Nerve) వ్యాపించి చర్మం, మిగతా అవయవాలకు విస్తరిస్తుంది. అయితే వ్యాధి నిరోధక శక్తి ఈ సూక్ష్మజీవి విస్తరించకుండా నిరోధిస్తుంది. దీని ద్వారా ఈ వ్యాధిని ముఖ్యంగా చర్మం, నరాలకు పరిమితం చేయడానికి ప్రయత్నిస్తుంది. ఈ వ్యాధి లక్షణాలు స్పర్శలేమీ, తెలుపు, ఎరుపు మచ్చలుగా సాధారణంగా కనిపిస్తుంటాయి. 


తిమ్మిరి పట్టడం, స్పర్శ తక్కువగా ఉండడం, స్పర్శ అసలే లేకపోవడం నరాలకు సంబంధించిన వ్యాధి లక్షణాలుగా గుర్తించారు. కొన్నిసార్లు ఇది అంగవైకల్యానికి కూడా దారితీస్తుంది. కుష్టువ్యాధి సర్వే, అవగాహన, చికిత్స 1952 సంవత్సరంలో ‘సేవా’ గ్రామంలో మొదలైంది. డాప్సన్‌(Dapsone) అనే మందు చికిత్సా విధానంలో ప్రప్రథమంగా వినియోగించబడింది. ఈ వ్యాధిని నిర్మూలించడం, వ్యాధి లక్షణాలను అరికట్టడానికి చికిత్స విధానంలో అనేక మార్పులూ జరిగాయి.  బిల్వ పత్ర లేపనాలు, వేపనూనె, చాల్‌ మోగ్రా నూనె వంటి వాటి నుంచి డాప్సన్‌ వాడడం జరిగింది. 1982లో రూపుదిద్దుకున్న బహుళ ఔషధ విధానం (Dapsone, Rifampicin, Clofazimine) వాడకం వరకు ఈ చికిత్సా విధానంలో సమర్థవంతమైన ఔషధ మార్పులు చోటు చేసుకున్నాయి. 


1995లో వ్యాధి నిరోధక పథకాన్ని జాతీయ స్థాయిలో ప్రభుత్వం గుర్తించడం, వెంటనే చికిత్స అందించడం వంటి విధానాలు ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశాల ప్రకారం ‘జాతీయ లెప్రసీ నిర్మూలన పథకం’ ద్వారా అమలు చేయబడ్డాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ కార్యక్రమాన్ని ప్రపంచ వ్యాప్తంగా అమలు చేసింది. ‘లెప్రసీ వ్యాధి నిరోధక సంస్థలు’ నెలకొల్పారు. పలు ఎన్జీఓలు ఈ వ్యాధి వ్యాపించకుండా తగు చర్యలు తీసుకున్నాయి. ఈ వ్యాధి లక్షణాలు గుర్తించి అవగాహన కల్పించి, అవసరమైన చికిత్స అందించడం వైద్యుల కర్తవ్యం. తమ సహాయ సహకారాలు అందించి కుష్టును అరికట్టే ప్రయత్నంలో వైద్యులు ముందుండాలి.


1980లో ప్రతి పది వేల మందిలో 58 మంది కుష్టు వ్యాధిగ్రస్తులు ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. 2005లో ప్రతి పదివేల మందిలో ఒక వ్యాధిగ్రస్తుడున్నట్లు గణాంకాలు వివరించాయి. ప్రస్తుత గణాంకాల ప్రకారం 0.86/10000 గా ఉంది. కాబట్టి ఈ వ్యాధి పూర్తిగా నిర్మూలన జరగలేదని తెలుస్తున్నది. ప్రజల్లో వ్యాధి గురించి అవగాహన పెంపొందించి ‘కుష్టు వ్యాధి రహిత సమాజం’ సాధించాలి. 


logo