బుధవారం 23 సెప్టెంబర్ 2020
Health - Sep 16, 2020 , 19:18:11

లెమన్‌గ్రాస్ తో బోలెడు ప్రయోజనాలు

లెమన్‌గ్రాస్ తో బోలెడు ప్రయోజనాలు

ఈ రోజుల్లో లెమన్‌గ్రాస్ వినియోగం బాగా ప్రాచుర్యం పొందింది. దాని యొక్క అనేక ప్రయోజనాల కారణంగా ప్రజలు దీనిని తమ ఇండ్లలో నాటడం మొదలెట్టారు. ఇది చాలా సంవత్సరాలుగా ఔషధంగా ఉపయోగిస్తున్న మొక్క. చాలా ఇళ్లలో దీనిని టీ, సూప్ మొదలైన వాటిలో ఉపయోగిస్తారు. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉండి ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులలో ప్రభావవంతంగా పని చేయడమే కాకుండా శరీరంలో రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.

గడ్డి కంటే పొడవుగా ఉండే సరళమైన గడ్డి లెమన్‌గ్రాస్. ఇది చాలా ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ఇది సాధారణ గడ్డి మాదిరిగా కనిపిస్తుంది. కానీ, శరీరానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వీటిలో ఇనుము, విటమిన్ ఏ, విటమిన్ సీ, ఫోలేట్ ఆమ్లం, భాస్వరం మొదలైనవి కలిగి ఉంటాయి. ఇండ్ల నుంచి దోమలను తరిమివేయడానికి కూడా లెమన్‌గ్రాస్ ఉపయోగపడుతుంది.

బరువు తగ్గించడంలో ప్రయోజనకారి

శరీర బరువును వేగంగా తగ్గించాలనుకుంటే లెమన్‌గ్రాస్ తినడం ప్రారంభించడం వలన త్వరగా ప్రయోజనాలు పొందుతారు. ఇది జీవక్రియలను పెంచుతుంది. తద్వారా త్వరగా బరువు తగ్గడానికి కారణమవుతుంది. మన శరీరం నుంచి అనవసరమైన కొవ్వును తగ్గిస్తుంది. అలాగే రోగనిరోధక శక్తిని కూడా బలపరుస్తుంది. ఈ గడ్డి నుంచి తయారైన టీని డిటాక్స్ టీగా తీసుకుంటారు.

కడుపుకు లాభదాయకం

యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉన్నందున జీర్ణక్రియను మెరుగుపరచడంలో లెమన్‌గ్రాస్ ప్రభావవంతంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు భావిస్తున్నారు. కడుపు తిమ్మిరి, అజీర్ణం, విరేచనాలు, మలబద్ధకం, వాంతులు వంటి కడుపు సంబంధ సమస్యలన్నీ దీని వాడకం ద్వారా తొలగిపోతాయి. అలాగే జీర్ణవ్యవస్థ కూడా బలంగా తయారవుతుంది.

క్యాన్సర్ వ్యాధి నివారణలో ప్రయోజనకరం

లెమన్‌గ్రాస్ లో యాంటిక్యాన్సర్ లక్షణాలు చాలా ఉన్నాయి. ఇవి క్యాన్సర్ కణాలను తొలగించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఈ గడ్డిలో సిట్రల్ అనే ప్రత్యేక మూలకం ప్రారంభ దశలో క్యాన్సర్ కణాలను నివారించడంలో సహాయపడుతుంది. రోజూ టీలో లెమన్‌గ్రాస్ గడ్డిని తీసుకుంటే క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది

లెమన్‌గ్రాస్ లో క్యాన్సర్‌ సహా అనేక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించే లక్షణాలు ఉన్నాయి. దీనిని తీసుకోవడం గుండెకు కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఎల్‌డీఎల్ అని పిలువబడే చెడు కొలెస్ట్రాల్ తీసుకోవడం తగ్గుతుంది. శరీరంలో ఎల్‌డీఎల్ స్థాయిలు పెరుగడం గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది.

జలుబు దగ్గు, ఫ్లూ కు మంచి మందు

లెమన్‌గ్రాస్ లో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు జలుబు దగ్గు, కఫం, జ్వరాలను తగ్గించడంలో ప్రయోజనకారిగా ఉంటాయి. జలుబు-దగ్గు, ఫ్లూతో బాధపడుతున్న వారు లెమన్‌గ్రాస్ టీ తాగాలి. 

లెమన్‌గ్రాస్‌ను ఎప్పుడు తినకూడదు?

- గర్భిణిలు, పాలిచ్చే స్త్రీలు లెమన్‌గ్రాస్ ఉపయోగించకూడదు. రుతుస్రావం దీని వినియోగంతో మొదలవుతుందని, గర్భస్రావం జరిగే ప్రమాదం ఉంటుదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

- అధిక రక్తపోటు ఉన్నవారు లెమన్‌గ్రాస్ ఉపయోగించే ముందు వైద్యుడిని సంప్రదించాలి. కొంతమందికి అలెర్జీలు, దురద, గొంతు వాపు మొదలైనవి కూడా రావచ్చు.

- లెమన్‌గ్రాస్ పరిమాణాన్ని అధికంగా ఉపయోగించడం వల్ల అధిక మూత్రవిసర్జన, అలసట మొదలైన వాటికి దారితీస్తుందని గుర్తుంచుకోవాలి.


logo