బుధవారం 23 సెప్టెంబర్ 2020
Health - Apr 07, 2020 , 22:09:29

కూర్చునే ఉద్యోగాలా..? ఇలా చేయండి..!

కూర్చునే ఉద్యోగాలా..? ఇలా చేయండి..!

హైదరాబాద్ : ఇప్పుడు ఉద్యోగాలంటేనే కంప్యూటర్లకు అతుక్కుపోయి, కుర్చీలోంచి లేవకుండా చేసేవి. ఇలాంటి కొలువులు జీతం ఎంతిస్తాయన్నది పక్కన పెడితే అనారోగ్యాన్ని మాత్రం తీసుకొస్తాయి. మీరూ కూర్చొని పనిచేసే ఉద్యోగాల్లో ఉన్నారా? దాంతో వచ్చే ఆరోగ్యపరమైన అనర్థాలను అధిగమించడానికి నిపుణులు అందిస్తున్న సూచనలను అనుసరించండి.

నిత్యం కుర్చీలకు అంటిపెట్టుకుని పనిచేస్తున్నారా? దాంతో చాలా రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. వాటిల్లో మొదటిది స్థూలకాయం. నిజానికి దాన్ని సమస్య అనుకుంటారుగానీ అదీ ఓ వ్యాధే. అనేక ఇతర వ్యాధులకు దారితీసే ప్రాథమిక వ్యాధి అది. దాని కారణంగా అధిక రక్తపోటు, డయాబెటిస్, గుండెపోటు, పక్షవాతం, దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధుల వంటి అనేక సమస్యలు వచ్చే ముప్పు పొంచి ఉంది. అదేపనిగా కూర్చొవడం వల్ల నడుము నుంచి కాళ్ల వరకు వెళ్లే అతిపెద్ద నరం అయిన సయాటికా నొక్కుకుపోతూ నడుము నుంచి కాలి వరకు తీవ్రంగా బాధ కలిగించే సయాటికా వ్యాధికి దారితీయవచ్చు. మెడనొప్పులూ రావచ్చు.

మంచి ఆహారం.. ప్రధానం

మంచి పోషకాలతో కూడిన ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం అన్నింటి కన్నా ప్రధానమైంది. ఈ సమతులాహారంలో అన్ని రకాల పోషకాలతో పాటు విటమిన్లు, మినరల్స్‌సమపాళ్లలో ఉండేలా చూసుకోవాలి. ముదురు ఆకుపచ్చరంగులో ఉండే తాజా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు తమ ఆహారంలో ఎక్కువగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. జంక్‌ఫుడ్, వేపుళ్లు, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోకూడదు. ఇటీవల చక్కెర ఎక్కువగా ఉండే షుగరీ ఫుడ్స్‌వినియోగం పెరిగింది. అటు ఘనాహారంగానూ, ఇటు కూల్‌డ్రింక్స్, సాఫ్ట్‌డ్రింక్స్‌రూపంలో ఈ షుగరీ డ్రింక్స్‌యువత ఎక్కువగా తీసుకుంటున్నారు. వీటికి దూరంగా ఉండాలి

దురలవాట్లు వద్దు

ఆల్కహాల్‌నుంచి పూర్తిగా దూరంగా ఉండటమే మేలు. నిద్రపోవడానికి  రెండు గంటల ముందే రాత్రిభోజనం పూర్తి చేయాలి. నిద్రకు కనీసం మూడు గంటల ముందునుంచే కాఫీ, టీ, ఆల్కహాల్‌వంటి వాటికి దూరంగా ఉండాలి. నిద్రకు ఉపక్రమించడానికి గంట ముందు నుంచి కంప్యూటర్లు, ట్యాబ్స్, మొబైల్‌ఫోన్స్, టీవీ వంటి అన్ని ఎలక్ట్రానిక్‌ఉపకరణాల ఉపయోగం నుంచి దూరంగా ఉండాలి.

యోగా మేలు

రోజూ క్రమం తప్పకుండా ధ్యానం, యోగా వంటివి చేయడం వల్ల కూర్చుని చేసే ఉద్యోగాల వల్ల వచ్చే నడుము నొప్పి, మెడనొప్పి లాంటి వాటికి దూరంగా ఉండొచ్చు. ఇక ఆఫీస్‌లో కంప్యూటర్‌ముందు పనిచేసేవారు ప్రతి రెండు గంటలకొకసారి కనీసం పది నిమిషాలు బ్రేక్‌తీసుకొని అటు ఇటు నడవాలి.

ఆనందమార్గం

ఆరోగ్యంగా ఉండాలంటే సంతోషంగా ఉండడం ముఖ్యమైన అంశం. అందుకే అందరితోనూ కలుపుగోలుగా ఉండటం, మిత్రులతో అరమరికలు లేకుండా హాయిగా నవ్వుతూ మాట్లాడటం, సామాజిక వేడుకల్లో పాల్గొనడం అన్ని విధాలా మంచిది. అలాగే మంచి కుటుంబ బంధాలు, పటిష్టమైన వైవాహిక బంధం చాలా ఒత్తిళ్ల నుంచి దూరం చేసి ఆరోగ్యాన్ని పెంచుతుంది. సామాజిక సేవలో పాల్గొనడం వల్ల నలుగురికి మంచి చేయడం మానసిక ఆనందాన్ని ఇస్తుంది. అదేంతో మానసికతృప్తిని కలగజేస్తుంది. ఫలితంగా మనసు ఆనందంగా ఉండటం వల్ల మనిషి ఉల్లాసంగా ఉంటాడు. దాంతో ఆరోగ్యమూ చేకూరుతుంది.

వ్యాయామం మానొద్దు

ఇక అన్నిటికంటే ముఖ్యంగా క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. వ్యాయామాలన్నింటి కంటే వేగంగా నడక సాగించే బ్రిస్క్‌వాకింగ్‌మేలు. దీన్ని రోజుకు 30 నిమిషాల పాటు ఆగకుండా కొనసాగించాలి. ఈ అన్ని కార్యకలాపాల వల్ల శారీరక దారుఢ్యం, మానసిక స్థైర్యం కలిగి మనుషులు దృఢంగా మారుతారు. వ్యాధుల పట్ల నిరోధకత పెరుగుతుంది. ఈ సూచనలన్నీ పాటిస్తే ఉద్యోగం మానలేకపోయినా ఆరోగ్యం చెడిపోకుండా కాపాడుకోవచ్చు. 


logo