శుక్రవారం 22 జనవరి 2021
Health - Jan 11, 2021 , 17:26:40

రక్తంలో చక్కెరలు తగ్గిపోతున్నాయా? జాగ్రత్త!

రక్తంలో చక్కెరలు తగ్గిపోతున్నాయా? జాగ్రత్త!

రక్తంలో చక్కెరల పరిమాణం విపరీతంగా తగ్గిపోవడాన్ని హైపోగ్లైసీమియా అంటారు. లీటరు రక్తంలో 0.50 గ్రాముల కంటే తక్కువగా గ్లూకోజ్ ఉండటాన్ని హైపోగ్లైసీమియా లక్షణంగా వైద్యులు నిర్ధారిస్తారు. ఇది తీవ్రమైతే స్పృహ కోల్పోవడంతోపాటు గుండెపోటు ముప్పు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. డయాబెటిస్‌ చికిత్సలో వాడే కొన్ని రకాల మందులు కూడా హైపోగ్లైసీమియాకు దారితీయవచ్చు. భోజనం మానుకోవడం, ఉపవాసం చేయడం, తీవ్రమైన వ్యాయామంతోపాటు కిడ్నీ వైఫల్యం, వృద్ధాప్యం వంటివీ కూడా రక్తంలో గ్లూకోజు స్థాయిలు బాగా పడిపోవటానికి దారితీయవచ్ఛు.

రక్తంలో గ్లూకోజు స్థాయిలు పడిపోవటం మొదలు కాగానే.. శరీరం ముందుగా ఇతరత్రా పద్ధతుల్లో గ్లూకోజును పెంచుకోవటానికి యత్నిస్తుంది. ఈ క్రమంలో గ్లూకగాన్‌, ఎపినెఫ్రిన్‌, నార్‌ఎపినెఫ్రిన్‌, ఐజీఎఫ్‌ వంటి హార్మోన్లు విడుదలై.. శరీరంలో కొన్ని మార్పులు కనిపిస్తాయి. గ్లూకోజు ఇంకా ఎక్కువగా పడిపోతే మెదడుకు తగినంత శక్తి అందక తికమకకు గురవ్వడం, మగత, స్పృహ కోల్పోవటం వంటివి తలెత్తుతాయి. సరైన సమయంలో చికిత్స చేయకపోతే మెదడు దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. అయితే, గ్లూకోజు ఎంత వరకు నియంత్రించాలనేది ఆయా వ్యక్తులను బట్టి ఉంటుంది. 40 ఏండ్ల లోపు మధుమేహులకు హెచ్‌బీఏ1సీ (మూడు నెలల సగటు చక్కెర) 6.5 శాతం లోపే ఉండాలి. అదే 50 ఏండ్ల వారికైతే 7.5 శాతం వరకు సడలించుకోవచ్ఛు. 65 ఏండ్ల వయసు దాటినవారిలో, గుండె జబ్బులు, పక్షవాతం, కిడ్నీ జబ్బులు గలవారికి 8.5 శాతం వరకు ఉండవచ్ఛు. మరీ వృద్ధులకైతే మరింత సడలించుకోవచ్ఛు. 

ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

హైపోగ్లైసిమియాతో బాధపడుతున్నవారు పలు జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి అని గుర్తుంచుకోవాలి. భోజనం మానేయడం లేదా ఉపవాసం చేయడం మంచిది కాదు. తరచుగా గ్లూకోజు మోతాదులను పరీక్షించుకోవాలి. హైపో లక్షణాలు కనిపించగానే వెంటనే వైద్యుడ్ని సంప్రదించాలి. స్పృహలో ఉండి మింగగలిగే స్థితిలో ఉన్నవారికి గ్లూకోజు కలిపిన నీళ్లు, చక్కెర కలిపిన కాఫీ, టీ, కూల్‌డ్రింక్స్‌ వంటివి ఇవ్వాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఘనాహారం తీసుకోకూడదు. స్పృహ తప్పినవారికి.. నోరు తెరచి షుగర్‌ వేయటం, చాక్లెట్‌ పెట్టడం, కూల్‌డ్రింక్స్‌ పోయటం వంటి వాటి వల్ల ఉపశమనం లభిస్తుందని భావిస్తుంటారు. కానీ, ఇది చాలా ప్రమాదకరమని గుర్తించాలి. 

ఎలాంటి చికిత్స అందిస్తారు..

- మధుమేహాన్ని నియంత్రించడానికి శరీరాన్ని చురుకుగా ఉంచడం అవసరం.

- అలసట లేదా మైకము అనిపించినప్పుడు వెంటనే రక్తంలోని చక్కెరలను తనిఖీ చేయాలి. 'తక్కువ బ్లడ్ షుగర్' ఉంటే.. తీపి పదార్థాలు తినడం ద్వారా డయాబెటిస్‌ను నియంత్రించవచ్చు.

- రక్తంలో చక్కెర స్థాయి 70 ఎంజీ / డీఎల్ కన్నా తక్కువగా ఉంటే.. అప్పుడు 15-20 గ్రాముల గ్లూకోజ్ తీసుకోవాలి. మిఠాయిలు, స్వీట్లు లేదా పండ్ల రసాలను సిద్ధంగా పెట్టుకోవాలి. 

- హైపోగ్లైసీమియాను నివారించడానికి అల్పాహారం ఎక్కువగా తీసుకోవాలి. అల్పాహారంలో తీపి పదార్థాలు తినాలి.

- రక్తంలో చక్కెర స్థాయి చాలా తక్కువగా ఉంటే, మూర్ఛ సమస్యలు వస్తున్నందున గ్లూకోజ్ ఇంజెక్షన్ వెంట పెట్టుకోవాలి.

- ఈ సమస్యను నివారించడానికి తినడం ఆలస్యం చేయడం వంటి అలవాట్లను మానుకోవాలి.

- క్రమం తప్పకుండా రక్తంలో చక్కెర స్థాయిలను పరీక్షించుకుంటూ ఉండాలి.

ఇవి కూడా చదవండి..

కరోనాతో బర్డ్ ఫ్లూ ఇన్ఫెక్షన్‌ మరింత ప్రమాదకరం

కొవిడ్‌ సెస్‌ విధించేందుకు రంగం సిద్ధం!

చైనాలో క్షీణిస్తున్న పరిస్థితులు .. మళ్లీ లాక్‌డౌన్‌ అమలు

బైడెన్‌ ప్రభుత్వంలో మరో ఎన్నారైకి కీలక పదవి

జై జవాన్‌, జై కిసాన్‌ నినాదం ఆయన ఊపిరి

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo