e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 16, 2021
Home ఆరోగ్యం కరోనా తగ్గినా.. నెల తర్వాతే శృంగారం!

కరోనా తగ్గినా.. నెల తర్వాతే శృంగారం!

కరోనా తగ్గినా.. నెల తర్వాతే శృంగారం!
  • ప్రెగ్నెన్సీ మూడు నెలలు వాయిదా వేసుకోవాలి
  • రుతుక్రమంలో ఆలస్యం.. ఎక్కువగా బ్లీడింగ్‌
  • గర్భిణులు చాలా జాగ్రత్తగా ఉండాలి
  • నమస్తే తెలంగాణ ఇంటర్వ్యూలో గైనకాలజిస్ట్‌ డాక్టర్‌ ప్రణతీరెడ్డి వెల్లడి

కరోనా తగ్గిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చాలామందిలో అనేక సందేహాలున్నాయి. ముఖ్యంగా వైవాహిక జీవితం, శృంగారం, గర్భధారణ, కాన్పులు తదితర అనేక అంశాలపై ఎన్నెన్నో అనుమానాలున్నాయి. కరోనా తగ్గిన తర్వాత శృంగారంలో పాల్గొనవచ్చా..? ప్రెగ్నెన్సీ ప్లానింగ్‌ చేసుకోవచ్చా..? గర్భిణులకు వైరస్‌ సోకితే ఎలాంటి ప్రమాదం ఉంటుంది? ఏయే జాగ్రత్తలు తీసుకోవాలి? తదితర సందేహాలకు మల్లారెడ్డి నారాయణ దవాఖాన గైనకాలజీ విభాగం హెడ్‌, ప్రముఖ గైనకాలజిస్ట్‌ డాక్టర్‌ ప్రణతీరెడ్డి ‘నమస్తే తెలంగాణ’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.

  • హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ

కరోనా తగ్గిన తర్వాత శృంగారంలో పాల్గొనవచ్చా? ఎంతకాలం దూరంగా ఉండాలి?
భార్యాభర్తల్లో ఏ ఒక్కరికి కరోనా సోకినా, తగ్గిన తర్వాత నెల పాటు శృంగారానికి దూరంగా ఉండటం మంచిది. కనీసం మూడు వారాలైనా నిగ్రహం పాటించాలి. దంపతులిద్దరికీ కరోనా వస్తే నెల కంటే ఎక్కువ కాలం దూరంగా ఉండాలి. లేదంటే ఒకరి ప్రభావం మరొకరిపై పడే ప్రమాదం ఉంటుంది. ఈ సమస్యపై జన్యుపరంగా ఎలాంటి పరిశోధనలు జరగలేదు. కానీ పలు సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కరోనా తగ్గిన తర్వాత కూడా కొంతమందికి లక్షణాలు ఉంటున్నాయి. దీనికితోడు శరీరం నీరసించి ఉంటుంది. శృంగారం అనేది ఒత్తిడితో కూడుకున్నది. కరోనా వచ్చిన పురుషుల వీర్యంలో పలు మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉంటే మంచిది. వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత శృంగారంలో పాల్గొన్నా ఇబ్బందేమీ ఉండదు. వ్యాక్సిన్‌ వల్ల సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉంటే అవి తగ్గేంత వరకు దూరంగా ఉండటం మంచిది.
కరోనా వచ్చినవారు ప్రెగ్నెన్సీ ప్లానింగ్‌ చేసుకోవచ్చా?
భార్యాభర్తల్లో ఎవరికైనా కరోనా వస్తే కనీసం నెల పాటు శృంగారానికి దూరంగా ఉండాలని చెప్తున్నాం. తొందరపడి ప్రెగ్నెన్సీ ప్లానింగ్‌ చేసుకోవద్దు. కనీసం మూడు నెలలపాటు వేచి ఉండటం మంచిది. అనుకోకుండా ప్రెగ్నెన్సీ నిర్ధారణ అయితే ఏమీ చేయలేం. కరోనా వల్ల అబార్షన్‌ అవుతుందని భావించలేం. అబార్షన్‌ చేసుకోవాల్సిన అవసరమూ లేదు.
కరోనా సోకిన గర్భిణుల్లో ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి?
మధ్యస్థాయి లక్షణాలు ఉన్నాయని ఇంట్లోనే సొంత వైద్యం చేసుకుంటున్నారు. ఐదారు రోజులు ఇంట్లోనే ఉండి మందులు వేసుకుంటున్నారు. దీంతో వారి పరిస్థితి సీరియస్‌ అవుతున్నది. ఆక్సిజన్‌ లెవల్స్‌ పడిపోతున్నాయి. ఇతరులతో పోల్చితే గర్భిణుల్లో ఊపిరితిత్తులపై వైరస్‌ ప్రభావం చాలా తొందరగా పడుతున్నది. కాబట్టి తొందరగా డాక్టర్‌ను సంప్రదిస్తే ప్రమాదం నుంచి బయటపడొచ్చు. గుండె సంబంధిత ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయి. ఇప్పుడు నా వద్ద తొమ్మిది మంది పేషెంట్లు ఉన్నారు. అందులో ముగ్గురు ఐసీయూలో ఉన్నారు. వీరిలో ఇద్దరు నిండు గర్భిణులు.
పిండానికి ఏమైనా ఇబ్బంది ఉంటుందా?
తల్లికి కరోనా సోకినా పిండానికి రాదని ఇప్పటివరకు జరిగిన అధ్యయనాలు చెప్తున్నాయి. కానీ మా వద్ద పుట్టిన ఒక బేబీకి ఒకరోజు తర్వాత పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తల్లి పాజిటివ్‌తో చికిత్స పొందుతూనే డెలివరి అయింది. గర్భంలోనే ఆ బేబీకి కరోనా సోకిందా? బయటకు వచ్చిన తర్వాత సోకిందా అనేది అర్థం కావడంలేదు. అయితే దీనిపై సొంతంగా ఒక స్టడీ చేయాలని నిర్ణయించి, ఉమ్మనీరుపై పరీక్ష చేస్తున్నాం. ఆ ఫలితాలు రావాల్సి ఉంది. కాబట్టి గర్భిణులు జాగ్రత్తగా ఉండటం మంచిది.
గర్భిణులకు సీటీ స్కాన్‌ చేయొచ్చా?
అత్యవసరమైతే తప్ప గర్భిణులకు సీటీ స్కాన్‌ చేయొద్దు. ఊపిరితిత్తులపై వైరస్‌ ప్రభావం తెలుసుకోవడానికి సీటీ స్కాన్‌ చేయాల్సిందే. అది కూడా అతికొద్ది మందికి మాత్రమే అవసరం అవుతుంది. చాలా జాగ్రత్తలు తీసుకొని స్కాన్‌ చేయాలి.
కరోనా సోకిన యువతులు, మహిళల్లో ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి?
కరోనా బాధిత యువతుల్లో పలు రకాల ఇబ్బందులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పీరియడ్స్‌ సమయంలో బ్లీడింగ్‌ ఎక్కువ అవుతుంది. రుతుక్రమం సైకిల్‌లో మార్పులు వస్తున్నాయి. కొంతమందిలో రెండుమూడు నెలల వరకు పీరియడ్స్‌ కావడం లేదు. దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మంచి ప్రొటీన్‌ ఫుడ్‌ తీసుకోవడం ద్వారా ఈ సమస్యలను అధిగమించవచ్చు.
గర్భిణులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
కరోనా మొదటి దశ కన్నా రెండో దశలో గర్భిణులపై ఎక్కువ ప్రభావం చూపుతున్నది. ఏ మాత్రం లక్షణాలున్నా.. ఇంట్లో ఎవరికి కొవిడ్‌ సోకినా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. సొంత వైద్యం ఎట్టి పరిస్థితుల్లోనూ చేసుకోవద్దు. కొంతమంది గర్భిణులు లక్షణాలు కనిపించగానే.. ఇతరులు వాడినట్టే ట్యాబ్లెట్లు వాడేస్తున్నారు. స్టెరాయిడ్స్‌ కూడా వాడుతున్నారు. ఇది ఎంతమాత్రం మంచిది కాదు. పరిస్థితి మరింత చేజారుతుంది. గర్భిణులు.. వారితోపాటు గర్భంలోని పిండం ఆరోగ్యాన్ని కూడా చూసుకోవాలి. కాబట్టి వారికి ప్రత్యేక చికిత్స అవసరం. ఇలాంటి సమయంలో మత్తుమందు ఇచ్చి డెలివరీ చేయలేం. లక్షణాలు కనిపించిన వెంటనే డాక్టర్‌ను సంప్రదించకుండా.. పరిస్థితి విషమించిన తర్వాత వస్తే ఏమీ చేయలేరు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కరోనా తగ్గినా.. నెల తర్వాతే శృంగారం!

ట్రెండింగ్‌

Advertisement