e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 15, 2021
Home ఆరోగ్యం ఐబీడీ వ్యాధిగ్రస్తులు జర పైలం!

ఐబీడీ వ్యాధిగ్రస్తులు జర పైలం!

ఐబీడీ వ్యాధిగ్రస్తులు జర పైలం!
  • ముప్పుగా మారనున్న ఇన్‌ఫ్లమేటరీ బవెల్‌ డిసీజ్‌ ..
  • డాక్టర్‌ కిరణ్‌ పెద్ది, సీనియర్‌ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌, యశోద హాస్పిటల్‌

అన్ని వయసుల వారిని అనారోగ్యంపాలు చేస్తున్న కరోనా పట్ల .. జీర్ణ వ్యవస్థకు సంబంధించి వచ్చే ఇన్‌ఫ్లమేటరీ బవెల్‌ డిసీజ్‌ (ఐబీడీ) వ్యాధిగ్రస్థులు మరింత అప్రమత్తంగా ఉండాలని యశోద హాస్పిటల్‌ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ డాక్టర్‌ కిరణ్‌ పెద్ది సూచిస్తున్నారు. ఐబీడీ ఉన్నవారు కరోనా బారిన పడితే ఎదురయ్యే సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నమస్తే తెలంగాణ ప్రత్యేక ఇంటర్వ్యూలో డాక్టర్‌ కిరణ్‌ పలు అంశాలను వివరించారు.

-హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ

ఐబీడీ వ్యాధి లక్షణాలేవి?.. దాన్ని ఎలా గుర్తిస్తారు?
మన శరీరంలోని ఏ భాగంలోనైనా కణాలు ఎర్రబడి బాగా మంట పుడుతూ.. విపరీతంగా వాచినట్టు కనబడటాన్ని ఇన్‌ఫ్లమేషన్‌ అంటారు. దీనివల్ల మన జీర్ణ వ్యవస్థలోని చిన్న పేగు, పెద్ద పేగు ఇన్‌ఫ్లమేషన్‌కు గురవుతుంది. నీళ్ల విరేచనాలతోపాటు రక్తం పడుతుండటం ఐబీడీ లక్షణాల్లో ప్రధానమైనది. క్రోన్స్‌ వ్యాధి ఉంటే పొట్టలో నొప్పి వస్తుంది. బరువు తగ్గడం, రక్తహీనత, చిన్నపిల్లల్లో పెరుగుదల ఉండదు. ఇలాంటివారు కరోనా బారినపడితే ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది.
కరోనా సోకితే.. ఐబీడీ ఉన్నవారికి ఎటువంటి సమస్యలుంటాయి?
ఐబీడీతో బాధపడే రోగులకు కొవిడ్‌ వస్తే విపరీతమైన నీళ్ల విరేచనాలు, కడుపునొప్పి వంటి సమస్యలు కనిపించవచ్చు. తీవ్రమైన అలసట, నిస్సత్తువ, కండరాల నొప్పులు, తలనొప్పి వంటివి వస్తాయి. ప్రస్తుత పరిస్థితిలో ఐబీడీపై తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఐబీడీ కోసం వాడే మందులైన 5 ఏఎస్‌ఏ వంటివి, యాంటి బయాటిక్స్‌, వ్యాధిని నయంచేయడానికి అనుసరించే ఆహార మార్పులు వ్యక్తుల్లో వ్యాధి నిరోధకశక్తిని తగ్గిస్తాయి. అంతేకాదు.. ఐబీడీ రోగుల కోసం వాడే స్టెరాయిడ్స్‌, అజత్రియోప్రిన్‌, ఇన్‌ఫ్లిక్సిమాబ్‌, అడాలిముమా, టోఫసిటివిబ్‌ వంటి మందులతోపాటు స్టెరాయిడ్స్‌ కూడా వ్యక్తుల రోగనిరోధక శక్తిని బాగా తగ్గిస్తాయి. ఈ వ్యాధిగ్రస్థుల్లో కరోనా వైరస్‌ జీర్ణవ్యవస్థలోకి చేరితే.. బాగా దెబ్బతిని పలచబారిపోయిన పేగుల గోడల్లోంచి తేలిగ్గా ఒంట్లోకి ప్రవేశిస్తుంది. ఐబీడీతో బాధపడే చిన్నపిల్లల్లో కొవిడ్‌ వస్తే.. వారికంటూ ప్రత్యేకమైన లక్షణాల డేటాపై ఇంకా పరిశోధనలు కొనసాగుతున్నాయి.
కరోనా వచ్చినవారు ఐబీడీ మందులు వాడొచ్చా..?
ఐబీడీకి వాడే మందులు రోగ నిరోధకశక్తిపై ప్రభావం చూపుతాయంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో.. వాటిని తాత్కాలికంగా నిలిపేయాలా అనే సందేహాలున్నాయి. ఆ మందుల్లో స్టెరాయిడ్‌ మోతాదు ఎక్కువగా ఉంటే వైద్యుని సలహా మేరకు వాటిని తగ్గించడం అవసరం. వ్యాధి లక్షణాల ఆధారంగా ఐబీడీ మందుల వాడకంపై నిర్ణయం తీసుకోవాలి. కొవిడ్‌ వచ్చిన తర్వాత కనీసం పదిరోజులైనా ఆగాలి. నెగెటివ్‌వచ్చిన తర్వాత వైద్య నిపుణుల సలహాల మేరకు నడుచుకోవాలి.
ఐబీడీ రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు?
వైద్యుని సలహా మేరకు పరీక్షలు చేసుకొని తగిన మందులు వాడటం ముఖ్యం. ఐరన్‌ ఇన్‌ఫ్యూజన్‌, ఇన్‌ఫ్లిక్సిమాబ్‌ ఇన్‌ఫ్యూజన్‌ తీసుకొనేవారు హాస్పిటల్‌కు వెళ్లినపుడు మరిన్ని జాగ్రత్తలు పాటించాలి. అత్యవసరమైతేనే శస్త్రచికిత్స చేయించుకోవాలి. మనకు అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లన్నీ సురక్షితమే కాబట్టి ఐబీడీ వ్యాధిగ్రస్థులందరూ కరోనా వ్యాక్సిన్‌ వేయించుకోవాలి. ఐబీడీ ఉన్న వారిలో మొదటి డోస్‌తో యాంటి బాడీస్‌ వృద్ధి చెందడం లేదని, రెండో డోస్‌ తర్వాత యాంటిబాడీస్‌ వృద్ధిచెందుతున్నాయని అధ్యయనాలు చెప్తున్నాయి. కాబట్టి నిర్ణీత సమయంలో కరోనా రెండు డోస్‌ల టీకాను వేయించుకోవాలి. దీంతోపాటు ఐబీడీ రోగులు ఫ్లూ, నీమోకోకల్‌ వ్యాక్సిన్లు కూడా తీసుకోవడం మేలు.
ఐబీడీ ఉన్న గర్భవతులకు కొవిడ్‌ సోకితే ఏం చేయాలి..?
ఐబీడీ ఉన్న గర్భిణులకు కరోనా సోకితే ఆమె కాళ్లలో, ఊపిరితిత్తుల్లోని రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే ముప్పు ఉంటుంది. ఇందుకు రక్తాన్ని పలచబరిచే మందులను ఇవ్వాల్సి ఉంటుంది. కొందరిలో 5 ఏఎస్‌ఏ కాంపౌండ్స్‌ మినహా మిగతా మందులన్నీ ఆపేయాలి. ఇలాంటి వారిని తప్పక హాస్పిటల్‌లో చేర్చి తీవ్రతను బట్టి వారికి కొవిడ్‌కూ.. ఐబీడీకి చికిత్స అందించాల్సిన ఆవశ్యకత ఉన్నది. సాధారణ గర్భవతులతో పోల్చితే ఐబీడీతో బాధపడే గర్భవతులకు కొవిడ్‌ సోకితే కొంత ప్రమాదం ఉంటుంది.. ఎంతమేరకు ముప్పు అనే అంశంపై పరిశోధనలు జరుగుతున్నాయి.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఐబీడీ వ్యాధిగ్రస్తులు జర పైలం!

ట్రెండింగ్‌

Advertisement