సోమవారం 25 మే 2020
Health - Mar 31, 2020 , 22:44:57

మీకు మధుమేహం ఉంటే...

మీకు మధుమేహం ఉంటే...

ఇతరుల్లాగే మధుమేహం ఉన్నవారికి కూడా అన్ని రకాల ఆహార పదార్థాల అవసరం ఉంటుంది. కాకపోతే త్వరగా జీర్ణమయ్యే పదార్థాలు (కార్బోహైడ్రేట్లు) తీసుకోకూడదు. అలా తీసుకుంటే చక్కెర శాతం చాలా వేగంగా పెరుగుతుంది. అందుకే చక్కెర, స్వీట్లు, పండ్ల రసాలు, అరటిపళ్లు, మామిడి, ద్రాక్ష, శీతల పానీయాలు, చాక్లెట్లు, బియ్యం వంటి వాటిని అతి తక్కువ మోతాదులో మాత్రమే తీసుకోవాలి. పిండిగా కన్నా ధాన్యాలను ఉడికించి, లేదా మొలకెత్తిన ధాన్యాలను తినడం మంచిది.  ప్రొటీన్ల కోసం తృణధాన్యాలు, పప్పు ధాన్యాలు, చిక్కుడు ధాన్యాలను తీసుకోవాలి. వీటితో పాటు పాలు, పెరుగు, సోయా పదార్థాలు, తక్కువ కొవ్వు ఉండే పదార్థాలు తీసుకోవడం మంచిది. చేపలు, గుడ్డులోని తెల్ల భాగాన్ని కూడా తీసుకోవచ్చు. 

ఆకుకూరలు, సలాడ్‌...

నూనె పదార్థాలు, మేకమాంసం మానేయాలి. పచ్చళ్లు, కొబ్బరి, గసగసాల వంటివి పూర్తిగా మానేయాలి. ఆకుకూరలు, సలాడ్లు తరచుగా తీసుకోవాలి. ఆహారంలో పీచుపదార్థాలుంటే రక్తంలో కలిసే చక్కెర, కొవ్వు పదార్థాల శాతం తగ్గుతుంది. ఇది కొలెస్ట్రాల్‌ను కూడా అదుపులో ఉంచుతుంది. ఆకుకూరలు, జొన్న, సజ్జ, రాగుల్లో పీచుపదార్థాలు అధికంగా ఉంటాయి. పీచుపదార్థాలను ఎక్కువ మోతాదులో తీసుకున్నా కూడా చక్కెర నియంత్రణలోనే ఉంటుంది. మధుమేహులు దూరంగా ఉంచాల్సిన పదార్థం ప్రత్యేకంగా ఏమీ ఉండదు గానీ తక్కువగా తీసుకోవడం అవసరం. 

చేదు అవసరమా?

మెంతులు, వేప ఆకు, కాకరకాయ వంటివి చక్కెరను అదుపులో ఉంచుతున్నట్టు ఏ పరిశోధనల్లోనూ రుజువు కాలేదు. మధుమేహుల్లో ఇన్‌ఫెక్షన్ల అవకాశం ఎక్కువ. వాటిని నిరోధించేందుకు విటమిన్‌ సి కోసం నిమ్మరసం, సంత్రా వంటి పండ్లు తీసుకోవాలి. నల్ల ద్రాక్ష పండ్లలో యాంటి ఆక్సిడెంట్లు ఎక్కువ. రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి ఇవి అవసరం. 

ఎన్నిసార్లు తినాలి?

భోజనానికీ భోజనానికీ మధ్య ఎక్కువ వ్యవధి ఉండకూడదు. ఎకుఉ్కవ గంటలు గడిచే కొద్దీ రక్తంలో చక్కెర శాతం పూర్తిగా తగ్గిపోయి, భోజనం చేయగానే హఠాత్తుగా పెరిగిపోతుంది. అందుకే భోజనాన్ని ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఇలా మూడు వేళలకు విభజించడం అవసరం. వీటికి తోడు ఉదయం 11 గంటలకు, సాయంత్రం 5 గంటలకు అల్పాహారం తీసుకోవడం కూడా అవసరం. దీనివల్ల చక్కెర శాతంలో హెచ్చుతగ్గులు లేకుండా నియంత్రణలో ఉంటాయి. 

వ్యాయామం ముఖ్యం

ఆహార జాగ్రత్తలన్నీ తీసుకుంటున్నామని వ్యాయామాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఆహారం ద్వారా తీసుకున్న కేలరీలు ఖర్చు కావడానికి ప్రతిరోజూ అద్దగంట నుంచి గంట వరకు వాకింగ్‌ చేయడం అవసరం. logo