మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Health - Aug 25, 2020 , 15:23:27

తేమ ఎక్కువగా ఉంటే కరోనా వైరస్ దరిచేరదు..

తేమ ఎక్కువగా ఉంటే కరోనా వైరస్ దరిచేరదు..

న్యూఢిల్లీ : కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తోంది. ఇప్పటివరకు ఎలాంటి మందులు అందుబాటులో లేవు. అసలు కరోనా ఎలా వ్యాపిస్తుందో కూడా చెప్పలేని పరిస్థితి ఉన్నది. కరోనా ఏయే మార్గాల్లో వ్యాపిస్తుందో గుర్తించలేకపోతున్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి ప్రస్తుతానికి మన వద్ద ఉన్న ఆయుధాలు.. సామాజిక దూరం.. ఫేస్ మాస్క్.. ఈ రెండు ఆయుధాల ద్వారానే దాదాపు కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు కష్టపడుతున్నాం. 

అయితే, గాలిలో కూడా కరోనా వైరస్ వ్యాపిస్తుందని పలు అధ్యయనాలు వెల్లడించాయి. గాలిలో తేమ తక్కువగా ఉన్న ప్రదేశాల్లో కరోనా వ్యాప్తి అధికంగా ఉంటుందని కనుగొన్నారు. గాలిలో తేమను కంట్రోల్ చేసినప్పుడే కరోనా వ్యాప్తిని నియంత్రించగలమని భారత్‌, జర్మనీ సైంటిస్టులు సూచిస్తున్నారు. దవాఖానలు, కార్యాలయాలు, బస్సులు, రైళ్లు.. వంటి వ్యవస్థల్లో గాలిలోని తేమ శాతాన్ని 40 నుంచి 60 శాతానికి నియంత్రించడం ద్వారా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయగలమని వీరి అధ్యయనంలో తేలింది. సీఎస్ఐఆర్ కు చెందిన నేషనల్‌ ఫిజికల్‌ ల్యాబొరేటరీ, జర్మనీలోని లిబ్నిజ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ట్రోపోస్ఫియర్‌ రీసెర్చ్‌లు అధ్యయనాన్ని నిర్వహించాయి. గాలిలోని తేమశాతం 5 మైక్రోమీటర్ల కంటే తక్కువ సైజు ఉన్న నోటి తుంపర్లలోని సూక్ష్మజీవులపై ప్రభావం చూపుతుందని వీరు గుర్తించారు.

అంతేకాకుండా, ఉపరితలాలపై వైరస్‌ ఎక్కువ సమయం ఉంటుందని వీరి అధ్యయనంలో తేలింది. గాలిలోని తేమ 40 శాతం కంటే తక్కువ ఉంటే కరోనా సోకే అవకాశాలు ఎక్కువని పేర్కొన్నది. కొవిడ్‌ బారిన పడ్డ వారి నోటి తుంపర్లలోని కణాలు తక్కువ నీటి కణాలను ఆకర్షిస్తాయని, ఫలితంగా వైరస్ కణాలు తేలికగా ఉండి ఎక్కువ దూరం ప్రయాణిస్తాయని అంటున్నారు. ఇతరులకు సోకే అవకాశం కూడా ఎక్కువ అవుతుందని లిబ్నిజ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ట్రోపోస్ఫియర్‌ రీసెర్చ్‌ శాస్త్రవేత్త అజిత్‌ వివరించారు. గాలిలో తేమ తక్కువగా ఉంటే ముక్కు లోపలి పొరలు కూడా పొడిగా మారతాయని, ఫలితంగా వైరస్‌ ఎక్కువగా వ్యాపించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. గాలిలో తేమశాతం ఎక్కువగా ఉంటే నోటి తుంపర్లు వేగంగా బరువెక్కి నేలపై రాలిపోతాయని చెప్తున్నారు. సాధ్యమైనంతవరకు గాలిలో తేమ ఉండేలా చూడాలని, అప్పుడే కరోనా వ్యాప్తిని కట్టడి చేయడం సాధ్యపడుతుందని పరిశోధకులు సూచిస్తున్నారు.


logo