బుధవారం 28 అక్టోబర్ 2020
Health - Sep 29, 2020 , 21:05:42

ఇప్పుడు ఇంకో ఐదు కిలోల బరువు ఎక్కువున్నా ఫర్వాలేదు..!

ఇప్పుడు ఇంకో ఐదు కిలోల బరువు ఎక్కువున్నా ఫర్వాలేదు..!

హైదరాబాద్‌: బరువు ఎక్కువుంటే ఫర్వాలేదు అంటున్నామని ఆశ్చర్యపోతున్నారా? అవును మనం ఉండాల్సిన ఐడియల్‌ వెయిట్‌(ఎత్తుకు తగ్గ బరువు)ను హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ న్యూట్రిషన్ సవరించింది. ఇంతకు ముందున్న దానికి మరో ఐదు కిలోలను పెంచింది. అలాగే, ఎత్తును కూడా సవరించింది. కొత్త మార్గద్శకాల ప్రకారం.. పురుషుల ఐడియల్‌ వెయిట్‌ 65 కిలోలు కాగా, మహిళల ఆదర్శ సగటు బరువు 55 కిలోలకు పెంచింది. 

సగటు ఎత్తు పెరిగింది..

ఎన్‌ఐఎన్‌ తాజాగా పురుషులు, స్త్రీల సగట్టు ఎత్తును కూడా సవరించింది. దశాబ్దం క్రితం పురుషుల సగటు ఎత్తు 5 అడుగుల 6 అంగుళాలని పేర్కొనగా, ఇప్పుడు దానిని 5 అడుగుల 8 అంగుళాలకు పెంచింది. అలాగే, భారతీయ మహిళల ఎత్తు 2010 లో 5 అడుగులని నిర్ణయించగా, ఇప్పుడు దానిని 5 అడుగుల 3 అంగుళాలకు పెంచింది. ఎత్తు, బరువు ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే రెండు ప్రాథమిక పారామితులు. ఇవి సహ-సంబంధం కలిగి ఉంటాయి.

ఎన్‌ఐఎన్ శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం, ప్రజలు పెద్దమొత్తంలో పోషకాహారం తీసుకోవడం వల్ల భారతీయ ప్రజల బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) మార్చబడింది. ఈసారి నిపుణులు పదేళ్ల క్రితంలా కాకుండా గ్రామీణ ప్రాంతాల డేటాను పరిగణనలోకి తీసుకున్నారు. ఇంతకుముందు కేవలం పట్టణ ప్రాంతాల డేటా ఆధారంగానే సగటు ఎత్తు, బరువును నిర్ణయించారు. అలాగే, ఆహారభత్యం కోసం అంచనా వేసిన ఈఏఆర్‌ (ఎస్టిమేటెడ్‌ యావరేజ్‌ రిక్వైర్‌మెంట్‌)ను సవరించింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం దేశంలోని వయోజన పురుషుడు, స్త్రీ అంటే 19-39 ఏళ్లలోపువారు. ఇంతకుముందు ఈ వయస్సు 20-39 మధ్య ఉండేది. 

ఫైబర్‌ ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి..

నిపుణుల ప్యానెల్ మొదటిసారి, ఫైబర్-ఆధారిత శక్తి ఆహారాలను తీసుకోవాలని సిఫారసు చేసింది. ఇది పేగుల కదలికను సాధారణీకరించడం, బరువు తగ్గడం, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడం లాంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలతో ముడిపడి ఉన్న ఒక ముఖ్యమైన పోషకం. ఇతర ఆరోగ్యకరమైన జీవనశైలి మార్పులతో పాటు వివిధ పోషక-దట్టమైన ఆహారాలను కలిగి ఉన్న ఆరోగ్యకరమైన ఆహారం బరువు, బెల్లీ ఫ్యాట్‌ను నివారించడంలో సహాయపడుతుంది. 

ఫిట్‌గా ఉండేందుకు చిట్కాలు..

1.ఆహారంలో తాజా పండ్లు, కూరగాయలు పుష్కలంగా ఉండేలా చూసుకోవాలి. అందులో కేలరీలు, కొవ్వులు తక్కువగా ఉంటాయి. ఫైబర్‌ అధికంగా ఉంటుంది. ఇతర ప్రయోజనకర పోషకాలుంటాయి. 

2.ప్రొటీన్‌ ఫుడ్‌ను ఎక్కువగా తీసుకోవాలి. ఇది ఆకలి హార్మోన్‌ను తగ్గించడానికి, అనేక సంతృప్తికరమైన హార్మోన్లను పెంచడానికి సహాయపడుతుంది. తద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

3.తప్పనిసరిగా అల్పాహారం చేయాలి. ఇది రోజులోనే అతిముఖ్యమైన భోజనం. ఆరోగ్యకరంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. 

4.రోజంతా పుష్కలంగా నీటిని తాగాలి. ఇది శరీరంలోని విషపదార్థాలను తొలగిస్తుంది. భోజనానికి ముందు నీరు తాగడం వల్ల ఆకలి తగ్గి కేలరీలు తీసుకోవడం తగ్గుతుందని, తద్వారా బరువు తగ్గవచ్చని నిపుణులు సూచించారు. 

5.శారీరక శ్రమను పెంచాలి. నడక, జాగింగ్‌లాంటివి క్రమంతప్పకుండా చేయాలి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo