మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Health - May 17, 2020 , 15:11:52

ఇటు రక్తపోటు.. అటు కరోనా.. భయటపడేదెలా?

ఇటు రక్తపోటు.. అటు కరోనా.. భయటపడేదెలా?

హైదరాబాద్‌: ఒకప్పుడు వృద్ధుల్లో మాత్రమే కనిపనించే రక్తపోటు ప్రస్తుతం ప్రతి ఒక్కరిలో సర్వసాధారణం అయిపోయింది. మారుతున్న జీవనశైలి, ఉరుకుల పరుగుల ఉద్యోగ జీవితం కారణంగా మన ఆహారం, వ్యాయామం లయ తప్పుతోంది. ఫలితంగా ఆరోగ్యపరంగా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచదేశాలను వణికిస్తున్న కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా ముఖ్యంగా పెద్ద వయసు వారు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. మన ఇండ్లల్లో ఉండే వృద్ధులు త్వరగా కొవిడ్‌-19 బారిన పడకుండా ఉండేందుకు వారిని ఓ కంట గమనిస్తూ వారి ఆరోగ్యసమస్యలను సీరియస్‌గా తీసుకోవాలి.

కరోనా వైరస్‌ ఎవరిలోనైనా వ్యాప్తించవచ్చు. అయితే చక్కెర వ్యాధి, అధిక రక్తపోటు ఉన్నవారికి కరోనా వైరస్‌తో ప్రమాదం ఎక్కువ అని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటివరకు మన దేశంలో కరోనా వైరస్‌ కారణంగా చనిపోయినవారిలో ఎక్కువ శాతం మంది వృద్ధులే ఉండటం గమనార్హం. ఒకసారి ఇన్‌ఫెక్షన్‌కు గురైతే మిగతా రోగుల కంటే రక్తపోటు, డయాబెటిస్‌ ఉన్నవారిలో తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అధిక రక్తపోటు ఉన్నవారిలో సూక్ష్మ రక్తనాళాల్లో పూడికలు ఏర్పడి రక్తసరఫరా మందగిస్తుంది. ఇదే సమయంలో కరోనా వైరస్‌ మనలో వ్యాధినిరోధకతను తగ్గించడం వలన రక్తపోటును అదుపులో ఉంచుకోవడం కష్టంగా మారుతుంది. కరోనా వైరస్‌కు గురైన రక్తపోటు కలిగినవారి మరణాల రేటు 3 నుంచి 11 శాతం మధ్య ఉండటం భయపెట్టిస్తున్నది. 

కరోనా వైరస్‌కు గురైన రక్తపోటు వ్యాధిగ్రస్థులు సిగరెట్‌, మద్యం తాగడం వెంటనే మానుకోవాలి. బీపీని, రక్తంలో చక్కెరల స్థాయిని అదుపులో ఉంచుకోవాలి. నిత్యం కొంత శారీరక శ్రమ కలిగివుండటం మంచిది. ఉప్పు పరిమితిగా తీసుకోవాలి. ఆహారంలో ఫైబర్‌, ప్రొటీన్‌ కంటెంట్‌ ఎక్కువగా ఉండేట్లు చూసుకోవాలి. ఎక్కువగా కూరగాయలు, పండ్లతో రోగనిరోధక శక్తిని మెరుగుపరుచుకోవడం ద్వారా కరోనా వైరస్‌ బారిన పడకుండా నియంత్రించుకోవచ్చు.


logo