గురువారం 24 సెప్టెంబర్ 2020
Health - Jul 12, 2020 , 20:33:14

ఈ ఆరు లక్షణాలుంటే మీరు అతిగా మద్యం తాగుతున్నట్లే!

ఈ ఆరు లక్షణాలుంటే మీరు అతిగా మద్యం తాగుతున్నట్లే!

హైదరాబాద్‌: మద్యపానం ఒక వ్యసనం. క్రమంతప్పకుండా తీసుకోవడాన్ని ఆల్కహాల్‌ యూస్‌  డిజార్డర్‌ (ఏయూడీ) అంటారు. ఇలాంటి వారు ఏదో వంకతో ఆల్కహాల్‌ సేవిస్తూనే ఉంటారు. శారీరకంగా, మానసికంగా తమపైతాము పట్టుకోల్పోతారు.  ఈ ఏయూడీ అనేది తీవ్రమైన దీర్ఘకాలిక వ్యాధులకు కారణమవుతుంది. అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. 2011లో ప్రచురితమైన ఆల్కహాల్ రీసెర్చ్ కరెంట్ రివ్యూస్‌లో ఒక అధ్యయనం ప్రకారం, క్యాన్సర్, అంటు వ్యాధులు, డయాబెటిస్, హృదయ సంబంధ వ్యాధులు, కాలేయ వ్యాధితో సహా 30కి వ్యాధులకు మద్యపానమే మూలకారణమని తేలింది. అయితే, ఎవరికి వారు తాము అతిగా మద్యం తాగుతున్నామని ఎలా తెలుసుకోవాలి? దీనిపైన అధ్యయనం చేసిన కొందరు నిపుణులు కొన్ని పారామీటర్స్‌ను తయారు చేశారు. ఈ ఆరు లక్షణాలు మీలో గనుక ఉంటే మీరు ఏయూడీతో బాధపడుతున్నట్లే.. అవేంటో చదవండి..

1. మీ ప్రణాళికల్లో చాలా వరకు మద్యపానం ఉంటుంది..

మీరు ఏం పనిచేసినా అది మద్యంతో ముడిపడి ఉంటుంది. స్నేహితులతో సమావేశాలు.. కుటుంబ సభ్యులు, బంధువులతో గ్యాదరింగ్‌లో తప్పనిసరిగా మందు ఉంటేనే మజా అని మీరు నమ్ముతుంటారు. ఏ చిన్న సందర్భం దొరికినా ఆల్కహాల్‌ సేవనానికే ప్రాధాన్యత ఇస్తారు. చేతిలో పెగ్‌ ఉంటేనే మీరు ప్రతి సందర్భాన్ని ఎంజాయ్‌ చేయగలుగుతారు. ఫన్‌గా ఫీలవుతుంటారు. 

2. మీరు ఒత్తిడికి గురైనప్పుడల్లా తాగుతారు..

ఒత్తిడి, ఆందోళన జీవితంలో సాధారణం. అయితే, చాలా మంది ప్రజలు మద్యం కాకుండా ఇతర మార్గాల ద్వారా రెండింటినీ ఎదుర్కోగలుగుతారు. మీరు ఒత్తిడికి గురైనప్పుడల్లా చేతిలో పెగ్‌ అందుకుంటే కచ్చితంగా ఆల్కహాల్‌కు బానిస అయినట్లే. సమస్య వచ్చినప్పుడల్లా మీరు బాటిల్‌ అందుకునేందుకు ప్రయత్నిస్తున్నారంటే మీరు ఏయూడీ బాధితులే. దీని నుంచి తప్పించుకోవాలంటే ఒత్తిడి, ఆందోళన ఎదురైనప్పుడల్లా ఇష్టమైన వ్యక్తి లేదా మానసిక ఆరోగ్య నిపుణులతో మాట్లాడితే బయటపడొచ్చు.

3. మీరు పరిమితులకు కట్టుబడి ఉండలేరు

మద్యం మీద ఆధారపడిన వారు స్పృహలో ఉన్నప్పుడు వారి ఆల్కహాల్ పరిమితులను నిర్ణయించడంలో ఇబ్బంది లేదు. కానీ రెండు లేదా అంతకంటే ఎక్కువ పెగ్గులు తాగిన తర్వాత చాలామంది కంట్రోల్‌ తప్పుతారు. ఆపై మరింత తాగుతారు. దీంతో ఏయూడీ బారినపడతారు. మద్యంపై కూర్చున్న ప్రతిసారి ఇది కంటిన్యూ అవుతుంది.  

4. మీ ప్రియమైనవారు మాటిమాటికీ హెచ్చరిస్తుంటారు..

మీరు అతిగా మద్యం తాగితే మత్తులో మీకు తెలువకపోవచ్చు. కానీ మీ కుటుంబ సభ్యులు, బంధువులు వెంటనే గుర్తిస్తారు. ప్రియమైనవారి నుంచి ఆల్కహాల్‌ విషయంలో పదేపదే హెచ్చరికలు వస్తున్నాయంటే మీరు అతిగా మద్యం తాగుతున్నట్లే లెక్క.  అలాగే, కంటిన్యూ అయితే సంబంధ బాంధవ్యాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. 

5. వైద్యులూ గుర్తించి, హెచ్చరిస్తారు..

ఆల్కహాల్‌ తాగేవారికి కచ్చితంగా ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఏదో సందర్భంలో వైద్యుడిని సంప్రదించాల్సిందే. ఆయన మన అలవాట్లను అడిగిన తర్వాతే చికిత్స ప్రారంభిస్తాడు. మీరు అతిగా మద్యం తాగితే ఆయనకు ఇట్టే తెలిసిపోతుంది. మీ ఆరోగ్య పరిస్థితి మీ ఆల్కహాల్‌ అడిక్షన్‌ను తెలియజేస్తుంది. వైద్యుడు గనుక కచ్చితంగా మద్యం మానేయాలని సూచిస్తే తప్పక పాటించాల్సిందే. లేకుంటే మీ లైఫ్‌ను మీరు రిస్క్‌లో పెట్టుకున్నట్లే.  

6. హ్యాంగోవర్‌ చెప్పేస్తుంది..

మందు తాగినప్పుడు హ్యాంగోవర్ సహజం. కానీ మీరు తరచుగా హ్యాంగోవర్‌కు గురవుతుంటే అనుమానించాల్సిందే. ఆల్కహాల్ ఉపసంహరణకు సంబంధించిన ఇతర లక్షణాలున్నా మీరు రిస్క్‌లో ఉన్నట్లే. నిద్ర పట్టకపోవడం, చేతులు వణకడం, వికారం, చెమటపట్టడం, హార్ట్‌బీట్‌ పెరిగిపోవడం, మూర్ఛలాంటివి ఆల్కహాల్‌ ఉపసంహరణ లక్షణాలు. ఇవి గనుక ఉంటే మీరు ఆల్కహాల్‌ యూస్‌ డిజార్డర్‌కు గురైనట్లే. వెంటనే మేల్కొని మద్యానికి మెల్లమెల్లగా దూరం జరుగడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo