మంగళవారం 26 మే 2020
Health - May 19, 2020 , 15:46:25

రోగ నిరోధకశక్తి పెరుగాలంటే..?

రోగ నిరోధకశక్తి పెరుగాలంటే..?

రోగ‌నిరోధ‌క వ్య‌వ‌స్థ‌.. మ‌న శ‌రీరంలో ఉండి మ‌న‌కు వ్యాధులు రాకుండా కాపాడుతూ.. ఒక‌వేళ‌ వ‌చ్చినా వాటిని సమర్థంగా పోరాడి పారదోలే యంత్రాంగం ఇది. సాధారణంగా పురుషులతో పోలిస్తే మహిళల్లో ఈ రోగనిరోధకశక్తి ఎక్కువగా ఉంటుంది. అయితే నేటి జీవన విధానం, అలవాట్లు కొన్ని దాన్ని సన్నగిల్లేలా చేస్తున్నాయి. మన చుట్టూ నిరంతరం బోలెడన్ని హానికారక సూక్ష్మక్రిములు తిరుగుతుంటాయి. ఎప్పుడైనా వాటి బారినపడే ప్రమాదముంది. దీంతో రకరకాల ఇన్‌ఫెక్షన్లు, జబ్బులు దాడిచేస్తాయి. అయితే మనలో రోగనిరోధక శక్తి బలంగా ఉందనుకోండి. అవేమీ చేయలేవు. అందుక‌ని మంచి ఆహారం తీసుకోవ‌డంపై ఎక్కువ‌గా దృష్టిసారించాలి.

ఆరోగ్య‌క‌ర ఆహారం తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి స‌మ‌స్యలు రాకుండా చూసుకోవ‌చ్చు. ఇంట్లో త‌యారుచేసే ఆహారాల‌నే తీసుకుంటూ జంక్ పుడ్‌ను పూర్తిగా నిరోధించాలి. శ‌రీరానికి ప‌డ‌ని వ‌స్తువుల‌ను తిన‌కుండా చూసుకోవాలి. హై ప్రోటీన్, జింక్  క‌లిగివుండే లీన్ మ‌ట‌న్‌, చేప‌ల్ని డైట్‌లో చేర్చుకోవాలి. విటమిన్ ఈ, విటమిన్ ఏ, విటమిన్ డీ అధికంగా ఉండే ఆహారాలు, జింక్ కలిగిన పదార్ధాలు, సెలీనియం అధికంగా దొరికే పదార్ధాలను తీసుకుంటూ ఉండాలి. గుడ్డు, ఓట్స్‌, బార్లీ, అల్లం, వెల్లుల్లి, యాపిల్‌, బెర్రీలు, బ్ర‌కోలీ, ట‌మాట‌, ఆకుకూర‌ల‌ను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి. రోజు ఒక కప్పు పెరుగు తీసుకోవడం మంచి అలవాటు.

రోజూవారి ఆహారంలో పసుపు విరివిగా వాడేలా చూసుకోవాలి. ప్రతి వంటకంలో వెల్లుల్లి వాడాలి. దీనిలో ఉండే మినరల్స్‌.. బ్యాక్టీరియా, ఫంగస్‌ ఇన్‌ఫెక్షన్లతో పోరాడేలా చేస్తాయి. నిత్యం ఒక్కసారైనా అల్లంతో చేసిన పానీయాలను తీసుకోవడం అలవాటుచేసుకోవాలి. వంటల్లో కూడా వాడుకోవాలి. ఈ ఆయుర్వేద పదార్థాలను క్రమం తప్పకుండా మితిమీరకుండా శరీరానికి అందించడం వల్ల పోషకాహార లోపాన్ని తరిమికొట్టడంతో పాటు రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చు. 


logo