మంగళవారం 02 మార్చి 2021
Health - Jan 26, 2021 , 01:01:01

తట్టుకొనేదెలా..ఫిస్టులా!

తట్టుకొనేదెలా..ఫిస్టులా!

చెప్పుకోలేని బాధ. భరించలేని నొప్పి.చూపించలేని చోట చీము. ఫిస్టులాతో బాధ పడేవారికి ఇవి సర్వసాధారణం. విసర్జనకు సంబంధించిన సమస్యలను బయటికి చెప్పడానికి ఇబ్బంది పడుతుంటారు చాలామంది. అలా అని, ఉపేక్షిస్తే మాత్రం సమస్య మరింత జటిలం అవుతుంది. మలబద్ధకం రాకుండా చూసుకోగలిగితే, చాలావరకు ఫిస్టులాను నివారించవచ్చని అంటున్నారు డాక్టర్లు. ప్రస్తుతం, అందుబాటులో ఉన్న ఆధునిక చికిత్సలు రోగి సులువుగా కోలుకోవడానికి తోడ్పడుతున్నాయి. 

ఎప్పటికప్పుడు పొట్ట శుభ్రం అవుతుంటేనే రోగాలు రాకుండా ఉంటాయి. లేదంటే, అనేక సమస్యలు చుట్టుముడతాయి. వాటిలో ఒకటి ఫిస్టులా. రకరకాల కారణాలవల్ల మలద్వారం దగ్గరున్న యానల్‌ గ్రంథుల్లో బ్యాక్టీరియా చేరినా, ఇతరత్రా ఇన్‌ఫెక్షన్లు వచ్చినా మలద్వారానికి చుట్టుపక్కల ఎక్కడో ఓ దగ్గర మరో చిన్న రంధ్రం ఏర్పడుతుంది. ఇది మలద్వారం కన్నా చాలా చిన్నగా ఉంటుంది. మలనాళం నుంచి మలద్వారం చుట్టుపక్కల ఉండే చర్మం వైపుకి ఒక అసాధారణ నాళం ఏర్పడటాన్నే ‘ఫిస్టులా’  అంటారు. ఈ నాళం శరీరం లోపలి వైపు, బయటివైపు.. రెండువైపులా తెరుచుకునే ఉంటుంది. పేగువైపు ఇంటర్నల్‌ ఓపెనింగ్‌, మలద్వారం దగ్గరి వైపు ఎక్స్‌టర్నల్‌ ఓపెనింగ్‌ ఉంటుంది. 

ఏమవుతుంది?

ఫిస్టులా నాళం (ట్రాక్ట్‌) ఏర్పడినప్పుడు పేగులోపల ఉండే బ్యాక్టీరియా బయటివైపు వచ్చి, ఎక్స్‌టర్నల్‌ ఓపెనింగ్‌ దగ్గర చీము గడ్డలా ఏర్పడుతుంది. తర్వాత ఇది పగిలి, ఈ రంధ్రంలో నుంచి చీము కారుతూ ఉంటుంది. కొందరికి గ్యాస్‌కూడా వస్తుంది. పేగునుంచి ఇంటర్నల్‌ ఓపెనింగ్‌ ద్వారా  బ్యాక్టీరియా నిరంతరం ఫిస్టులా ట్రాక్ట్‌లోకి రావడం వల్ల, చీము అదే పనిగా కారుతూ ఉంటుంది. నొప్పికూడా ఉంటుంది. 

కారణాలేమిటి?

ఫిస్టులా ఏర్పడటానికి 90 శాతం వరకు మలబద్ధకం, దానిద్వారా ఏర్పడే ఇన్‌ఫెక్షన్లే కారణం. దీనివల్ల ఏర్పడే ఫిస్టులాను ‘ప్రైమరీ ఫిస్టులా’ అంటారు. మలబద్ధకం ఉన్నప్పుడు విసర్జన కష్టమై మలద్వారం పైన ఒత్తిడి పెడతారు. తద్వారా అక్కడి బ్యాక్టీరియా యానల్‌ గ్రంథుల్లోకి తోసివేయబడుతుంది. (యానల్‌ గ్రంథుల్లోని స్రావాలు మలద్వారానికి లూబ్రికెంట్‌గా ఉపయోగపడుతాయి. తద్వారా మలవిసర్జన సాఫీగా జరుగుతుంది). ఈ ఇన్‌ఫెక్షన్‌ పెరిగి, ఫిస్టులా ట్రాక్‌ ఏర్పడుతుంది. ఇది ముందు చీము గడ్డలా మారుతుంది. అది పగలగానే, నిరంతరం చీము కారుతూ ఉంటుంది. ఇతర వ్యాధులు : పేగులో క్షయ, ఇన్‌ఫ్లమేటరీ బొవెల్‌ డిసీజ్‌, క్రౌన్స్‌ డిసీజ్‌ లాంటివి ఉండటం వల్ల 10 శాతం మందిలో ఫిస్టులా ఏర్పడుతుంది. దీన్ని ‘సెకండరీ ఫిస్టులా’ అంటారు. 

ఎలా కనిపెట్టాలి?

సాధారణంగా ఫిస్టులా ఏర్పడేముందు ఎలాంటి లక్షణాలూ, సంకేతాలూ ఉండవు. ఏర్పడిన తరువాత  మాత్రం చాలా నొప్పి ఉంటుంది. చీముగడ్డ ఏర్పడి, అది పగిలినప్పుడు చీము బయటికి రావడం మొదలవుతుంది. సాధారణంగా చర్మంపైనా, ఇతర భాగాల్లో ఏర్పడే చీము గడ్డల్లాగానే (బాయిల్స్‌) వీటినీ భావిస్తాం. అదే తగ్గుతుందిలే అని పట్టించుకోం. ఈలోగా సమస్య ఎక్కువైపోతుంది. అందుకే మలద్వారం చుట్టుపక్కల చీము గడ్డల్లాగా కనిపిస్తే అశ్రద్ధ చేయకూడదు. వెంటనే డాక్టర్‌ను కలవాలి. ఫిషర్స్‌ ఉన్నవాళ్లలో రక్తస్రావం కావచ్చు. కానీ ఫిస్టులా వల్ల సాధారణంగా రక్తస్రావం ఉండదు. ఫిస్టులా ఏర్పడిన తరువాత మలవిసర్జన బాధాకరంగా ఉంటుంది. 

ఏ పేషెంటుకు అయినా ఒకే టెక్నిక్‌ సరిపోదు. రెండు మూడు రకాల పద్ధతులను కలిపి సర్జరీ చేస్తారు. ఫిస్టులా రకాన్నిబట్టి, అది ఉన్న తీరునుబట్టి చికిత్స పద్ధతులను ఎంచుకుంటారు. ఉదాహరణకు.. ఫిస్టులాకు  మరిన్ని చిన్న చిన్న నాళాలు (బ్రాంచెస్‌) ఉన్నప్పుడు వాటికి లేజర్‌ చేస్తే మళ్లీ వచ్చే ప్రమాదం ఎక్కువ. పెద్ద ట్రాక్‌కి మాత్రం లేజర్‌ చేయాలి. ఇలాంటప్పుడు చిన్నవాటిని ఫిస్టులెక్టమీ ద్వారా తీసేసి, తరువాత పెద్ద దానికి లేజర్‌ చేస్తారు. ఇలా ఒక్కో పేషెంటుకు ఒక్కో రకమైన టెక్నిక్‌ అవసరం అవుతుంది.  

ఆపరేషన్‌ తర్వాత

  • మలవిసర్జన సాఫీగా జరిగేలా, మలబద్ధకం ఏర్పడకుండా చూసుకోవాలి. 
  • చిన్నపాటి గాయం ఉంటుంది. కాబట్టి దాన్ని గమనంలో పెట్టుకోవాలి. గాయం మానడానికి రెండుమూడు వారాలు పడుతుంది. మళ్లీ వచ్చే ప్రమాదం ఉందా లేదా అన్నది.. క్లినికల్‌గా పరీక్షిస్తుంటేనే తెలుస్తుంది. మూడు నాలుగు రోజులకు ఒకసారి డాక్టర్‌ని కలవాల్సి ఉంటుంది. 
  • మంచి ఆహారం తీసుకోవాలి. సమయానికి భోజనం చేయాలి.
  • ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. ప్రశాంతమైన జీవితం గడపాలి. 
  • నివారించాలంటే
  • ఫిస్టులా ఏర్పడకుండా ఉండాలంటే, ముందుగా మలబద్ధకం రాకుండా చూసుకోవాలి. ఇందుకోసం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. ఫైబర్‌ ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు తినాలి. కలుషిత ఆహారం తినవద్దు. బయటి తిండికి దూరంగా ఉండాలి. అప్పుడే, ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. వ్యాధి
  •  లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా డాక్టర్‌ను కలవాలి. 

చికిత్సలు

ఫిషర్స్‌ లాంటివి ఉన్నప్పుడు ముందు మందులు ఇచ్చి, తగ్గకపోతే సర్జరీని ఎంచుకుంటారు. కానీ ఫిస్టులాకు మందులేమీ ఉండవు. సర్జరీ తప్పనిసరి. సెకండరీ ఫిస్టులా ఉన్నప్పుడు, అంతకుముందు ఉన్న వ్యాధికి చికిత్స పూర్తయిన తరువాతే సర్జరీ చేస్తారు. ఇంతకు ముందులాగా, ఫిస్టులా సర్జరీ తర్వాత మలవిసర్జనపై నియంత్రణ పోతుందన్న భయం లేదిప్పుడు. ఫిస్టులా ట్రాక్‌ని ఓపెన్‌ చేయడమే ఫిస్టులోటమీ. లోపలివైపు తెరుచుకున్న ద్వారానికి, బయటివైపు రంధ్రానికి మధ్యలో.. అంటే ఫిస్టులా నాళంలోకి ఒక ప్రోబ్‌ను పంపించి, లోపలున్న కణజాలాన్ని తీసేస్తారు. ఈ పద్ధతి ఒకప్పుడు ఎక్కువగా చేసేవాళ్లు. కానీ ఇప్పుడు తగ్గింది. ఇలా చేసినప్పుడు లోపల ఏర్పడిన చీము తొందరగా బయటికి వచ్చేస్తుంది కాబట్టి, నెమ్మదిగా గాయం మానుతుంది. అయితే చాలా చిన్న ఫిస్టులాలకు మాత్రమే ఇది ఉపయోగపడుతుంది. పెద్దగా ఉన్నవాటికైతే, కండరం దెబ్బ తినే ఆస్కారం ఉంటుంది. 

 ఫిస్టులెక్టమీ

ఫిస్టులా నాళాన్ని మొత్తం తీసేయడమే ఫిస్టులెక్టమీ. పేగునుంచి బయటికి తెరుచుకుని ఉన్న నాళాన్ని కత్తిరించి తీసేస్తారు. కండరాలు ఏమైనా దెబ్బతిని ఉంటే మరమ్మతు చేస్తారు. 

ఫిలాక్‌ (FILAC)- ఫిస్టులా లేజర్‌ కోయాగ్యులేషన్‌

ఫిలాక్‌ పద్ధతిలో ఫిస్టులా నాళంలోకి లేజర్‌ ఫైబర్‌ను పంపిస్తారు. ముందుగా లోపలి నుంచి ఇంటర్నల్‌ ఓపెనింగ్‌ మూసేస్తారు. తరువాత ట్రాక్‌ అలాగే ఉంటే, మానడానికి టైం పడుతుంది. కాబట్టి, లేజర్‌ ఫైబర్‌తో ఆ ట్రాక్‌ని కాల్చుకుంటూ వస్తారు. ట్రాక్‌ని లేజర్‌ కాల్చేసి సీల్‌ చేసేస్తుంది. 

లిఫ్ట్‌  (LIFT)- లైగేషన్‌ ఆఫ్‌ ఇంటర్‌స్పింక్టెరిక్‌ ఫిస్టులా ట్రాక్ట్‌

ఫిస్టులా నాళం మధ్యలో బ్లాక్‌ చేస్తారు. తద్వారా బ్యాక్టీరియా రాకుండా ఉంటాయి. కొందరిలో ఈ నాళాలు చాలా పెద్దగా ఉంటాయి. ఫిస్టులెక్టమీ ద్వారా మొత్తం తీసేయాలంటే గాయం చాలా పెద్దదవుతుంది. కండరం ఎక్కువగా ప్రభావితమై, ఆ గాయం మానడానికి చాలా రోజులు పడుతుంది. ఇలాంటప్పుడు నాళం లోపలి వైపు (పేగు వైపు) తెరుచుకుని ఉన్నచోట మూసేస్తారు. దాంతో నాళం అలాగే ఉంటుంది కానీ, పేగు నుంచి నాళంలోకి బ్యాక్టీరియా ప్రవేశించలేదు. క్రమంగా నాళం మొత్తం మానిపోతుంది. ఫిస్టులా నాళం చిన్నది అయితే, దాన్ని కట్‌చేసి తీసేయడం సులభం. కానీ ఇది కొందరిలో పిరుదుల వరకూ ఉంటుంది. ఇలా పొడుగ్గా ఉన్నప్పుడు కత్తిరించి తీసేస్తే కండరాలు ప్రభావితం అవుతాయి. మానడానికీ చాలా సమయం పడుతుంది. కాబట్టి, లోపలి ఓపెనింగ్‌ని మూసివేస్తారు. 

ఎండోరెక్టల్‌ మ్యూకోజల్‌ 

అడ్వాన్స్‌మెంట్‌ ఫ్లాప్‌ కొందరిలో ఇంటర్నల్‌ ఓపెనింగ్‌ చాలా పెద్దగా ఉంటుంది. ఇలాంటప్పుడు కొంచెం పేగులోని మ్యూకోసా పొరను అమర్చి మూసేస్తారు. 

డాక్టర్‌ యం. పవన్‌ కుమార్‌

సీనియర్‌ సర్జికల్‌ 

గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌

యశోద హాస్పిటల్స్‌

హైదరాబాద్‌

VIDEOS

logo