సోమవారం 06 ఏప్రిల్ 2020
Health - Mar 15, 2020 , 18:26:38

పిల్లల చెడు అలవాట్లకు తల్లిదండ్రులదే బాధ్యత

పిల్లల చెడు అలవాట్లకు తల్లిదండ్రులదే బాధ్యత

ఈ పాడు అలవాట్లు నీకెక్కడ నుంచి వచ్చాయంటూ మన పిల్లలను కేకలేస్తూ ఉంటాం. అయితే పిల్లలు ఇలాంటి చెడ్డ అలవాట్లు నేర్చుకోవడానికి ఎక్కువ శాతం తల్లిదండ్రులే బాధ్యత వహించాల్సి వస్తుందంటున్నారు పరిశోధకులు. ధూమపానం, మద్యం, డ్రగ్స్‌ వంటి దురలవాట్లు ఉన్నవారి పిల్లలు కూడా వాటిని అనుసరించే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఇటీవలి అధ్యయనాల్లో స్పష్టమైంది. ముఖ్యంగా పొగతాగే అలవాటు ఉన్నవారి ప్లిలలు చాలా సులభంగా ఈ దురలవాట్ల బారిన పడతారని వాషింగ్టన్‌ యూనివర్సిటీకి చెందిన శాస్త్రజ్ఞుల బృందం హెచ్చరిస్తున్నది.

తల్లిదండ్రులు తాగి పడేసిన సిగరెట్‌ పీకలు చిన్నారుల దృష్టిలో పడే అవకాశం ఎక్కువ. కాబట్టి పొగాకు అలవాటును వాళ్లు కూడా అనుసరించే అవకాశం రెండింతలు ఎక్కువంటున్నారు అధ్యయన సారధి డాక్టర్‌ కార్ల్‌హిల్‌. సీటిల్‌ స్కూల్‌కు చెందిన 808 మందిని అధ్యయనం చేసిన అనంతరం ఈ విషయాన్ని నిర్ధారించారు. ఈ దురలవాట్లే కాకుండా పిల్లల్లో కనిపించే చీటికీ మాటికీ పోట్లాడడం, దొంగతనం, ఏకాగ్రత లేకపోవడం, పెద్దవాళ్లను ఎదిరించడం వంటి దుర్గుణాలు కూడా వంశపారంపర్యంగా తల్లిదండ్రుల నుంచి వచ్చేవే. ఈ అధ్యయన ఫలితాలు అబ్‌నార్మల్‌ చైల్డ్‌ సైకాలజీ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.


logo