జలుబు వెంటనే తగ్గాలంటే..?


Sun,December 25, 2016 10:54 AM

వేరే ఏ కాలంలోనైనా జలుబు చేస్తే కాస్త త్వరగా తగ్గేందుకు అవకాశం ఉంటుంది, కానీ ఈ కాలంలో మాత్రం అలా కాదు. ఓ వైపు పొగమంచు, మరో వైపు చలి, దీంతోపాటు దుమ్ము, ధూళి విపరీతంగా వ్యాప్తి చెందడంతో జలుబు చేస్తే ఓ పట్టాన తగ్గదు. ఇందుకోసం చాలా మంది ఇంగ్లిష్ మెడిసిన్‌ను ఎక్కువగా ఆశ్రయిస్తారు. కానీ దాంతో పని లేకుండా మన ఇంట్లో ఉండే సహజ సిద్ధమైన పదార్థాలతోనే జలుబు నుంచి ఉపశమనం పొందవచ్చు. అదెలాగంటే...

1. కొద్దిగా అల్లం దంచి రసం తీసుకోవాలి. దానికి సమాన భాగంలో తేనెను కలిపి ఆ మిశ్రమాన్ని సేవించాలి. అయితే ఆ మిశ్రమం రుచి నచ్చని వారు దాన్ని వేడి పాలలో కలుపుకుని కూడా తీసుకోవచ్చు. దీంతో ముక్కు దిబ్బడ, జలుబు వెంటనే తగ్గిపోతాయి. గొంతు నొప్పి నయమవుతుంది.

2. ఒక పసుపు కొమ్మును తీసుకుని దాని చివర కొద్దిగా కాల్చాలి. అనంతరం ఆ కొమ్ము నుంచి వచ్చే పొగను పీలిస్తే వెంటనే జలుబు తగ్గిపోతుంది. అలా చేయలేని వారు కొద్దిగా పసుపును ఒక గ్లాస్ వేడి పాలలో కలుపుకుని తాగినా ఫలితం ఉంటుంది.

3. అవిసె గింజలు కొన్నింటిని తీసుకుని ఒక పాత్రలో నీటిని పోసి అందులో ఆ అవిసె గింజలను వేయాలి. అనంతరం ఆ నీటిని బాగా మరిగించాలి. దీంతో చిక్కని ద్రవం తయారవుతుంది. దాంట్లో కొద్దిగా నిమ్మరసం, తేనె కలిపి తాగాలి. ఇలా రోజూ ఉదయం, సాయంత్రం రెండు సార్లు ఆ మిశ్రమాన్ని తాగితే జలుబు వెంటనే మాయమవుతుంది.

4. ఒక పాత్రలో నీటిని తీసుకుని అందులో కొద్దిగా నల్ల మిరియాల పొడి వేయాలి. అనంతరం ఆ నీటిని మరిగించాలి. కొద్దిగా మరిగాక దాంట్లో కొంచెం జీలకర్ర వేసి మళ్లీ ఆ నీటిని మరిగించాలి. కొంత సేపటికి రెండు, మూడు చిన్న బెల్లం ముక్కలను ఆ నీటిలో వేసి బెల్లం పూర్తిగా కరిగే వరకు మళ్లీ ఆ నీటిని మరిగించాలి. అనంతరం వచ్చే మిశ్రమాన్ని వడబోసి వేడిగా ఉండగానే తాగేయాలి. దీంతో జలుబు, దగ్గు, గొంతు నొప్పి నుంచి వెంటనే ఉపశమనం కలుగుతుంది.

5. ఒక పాత్రలో నీటిని తీసుకుని అందులో కొద్దిగా టీ పొడి వేసి మరిగించాలి. అందులో లవంగాలు, దాల్చిన చెక్క, అల్లం, నల్ల మిరియాల పొడి వేసి మళ్లీ ఆ నీటిని మరిగించాలి. చివర్లో కొద్దిగా పాలు కలుపుకుని దాన్ని మసాలా చాయ్‌గా చేసి తాగితే చాలు. జలుబు నుంచి ఇట్టే ఉపశమనం కలుగుతుంది. గొంతు నొప్పి కూడా మాయమవుతుంది.

9931
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS