ఎండాకాలంలో కళ్ల సంరక్షణ ఇలా..!


Mon,April 9, 2018 02:40 PM

వేసవిలో కేవలం మన శరీరం మాత్రమే కాదు అందులో ఒక భాగమైన కళ్లు కూడా తీవ్రమైన ఒత్తిడికి లోనవుతుంటాయి. అధిక ఉష్ణోగ్రతలకు గురవుతుంటాయి. దీంతో కళ్లపై ఒత్తిడి పెరిగి అవి ఎరుపెక్కడం, వాపులకు లోనవడం, కళ్ల కింద నల్లని వలయాలు రావడం వంటి సమస్యలు వస్తుంటాయి. కొందరికి వేసవిలో ఎప్పుడూ కళ్లు దురద పెడుతూ ఉంటాయి. అయితే కింద సూచించన పలు టిప్స్ పాటిస్తే వేసవిలో కళ్లను సురక్షితంగా ఉంచుకోవచ్చు. ఆ టిప్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. చల్లని నీరు


ఎండలో తిరిగి ఇంటికి వచ్చాక చల్లని నీటితో ముఖాన్ని, కళ్లను బాగా కడగాలి. అనంతరం చల్లని నీటిలో ముంచిన కాటన్ ప్యాడ్స్‌ను కళ్లపై 10 నిమిషాల పాటు పెట్టుకోవాలి. దీంతో కళ్ల రక్తనాళాలు రిలాక్స్ అవుతాయి. ఒత్తిడి తగ్గుతుంది. కళ్లు ఫ్రెష్‌గా మారుతాయి.

2. అలోవెరా


అలోవెరా జ్యూస్‌ను ఫ్రిజ్‌లో ఐస్ క్యూబ్స్ ట్రేలో పోసి గడ్డ‌ కట్టించాలి. అనంతరం ఆ క్యూబ్స్‌ను కళ్లపై మర్దనా చేసినట్టు రాయాలి. ఇలా 5 నుంచి 10 నిమిషాల పాటు కళ్లపై ఒత్తిడి పోయే వరకు చేయాలి. దీంతో కళ్లు తాజాగా మారుతాయి. కంటి సమస్యలు పోతాయి.

3. కీరదోస


వేసవిలో కళ్లపై పడే ఒత్తిడిని తగ్గించేందుకు కీరదోస బాగా పనిచేస్తుంది. కీరదోసను రెండు చక్రాల్లా కోసి కళ్లపై పెట్టుకుని 10 నిమిషాల పాటు అలాగే ఉండాలి. దీంతో కళ్లలో ఉండే రక్తనాళాలు రిలాక్స్ అవుతాయి. కళ్లపై పడే ఒత్తిడి తగ్గుతుంది. రోజూ ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

4. ఆలుగడ్డలు


కీరదోసలాగే ఆలుగడ్డలను కూడా రెండు చక్రాల్లా కోసి కళ్లపై 10 నిమిషాల పాటు పెట్టుకోవచ్చు. ఇలా చేయడం వల్ల కళ్ల వాపులు, కళ్ల కింద ఏర్పడే నల్లని వలయాలు, మచ్చలు తగ్గుతాయి.

5. రోజ్ వాటర్


రోజ్ వాటార్‌లో కాటన్ బాల్స్‌ను ముంచి వాటిని కళ్లపై మర్దనా చేసినట్టు రాయాలి. దీంతో కళ్లు కూల్‌గా మారి రిలాక్స్ అవుతాయి. ఒత్తిడి తగ్గుతుంది.

6. స్ట్రాబెర్రీ


స్ట్రాబెర్రీ పండ్లను ముక్కలుగా కోసి కళ్లపై పెట్టుకోవాలి. అలా 10 నిమిషాల పాటు ఉంటే కళ్లకు కలిగిన ఒత్తిడి తగ్గుతుంది. కళ్లు కూల్‌గా మారి ఫ్రెష్ అవుతాయి.

వేసవిలో కళ్ల సంరక్షణకు మరిన్ని టిప్స్...


* ఏసీల్లో పనిచేసే వారు ఏసీ నుంచి వచ్చే గాలి నేరుగా కళ్లపై పడకుండా చూసుకోవాలి. లేదంటే కళ్లు పొడిగా మారి ఎరుపెక్కి దురదలు వస్తాయి.
* వేసవిలో బయట తిరిగినప్పుడు సహజంగానే సూర్యుని వచ్చే అతినీలలోహిత కిరణాలు మన శరీరంపై పడి ప్రభావం చూపుతాయి. కళ్లు బాగా సెన్సిటివ్ కనుక ఆ కిరణాల బారిన పడకుండా ఉండాలంటే యూవీ ప్రొటెక్షన్ ఉన్న సన్ గ్లాసెస్ ధరించాలి.
* వేసవిలో మన శరీరం సహజంగానే డీహైడ్రేషన్ బారిన పడుతూ ఉంటుంది. దీంతో కళ్లు కూడా పొడిబారుతుంటాయి. వాటిల్లో ఉండే ద్రవాలు ఆరిపోతుంటాయి. కనుక ఈ సీజన్‌లో కచ్చితంగా రోజుకు 2 లీటర్ల నీటిని తాగాలి. దీంతో కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి.
* మహిళలు అయితే నిద్రించడానికి ముందు మేకప్ తీసేసి నిద్రించాలి. లేదంటే కాస్మొటిక్స్‌లో ఉండే కెమికల్స్ కంటి ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి.
* విటమిన్ ఎ ఎక్కువగా ఉండే క్యారెట్, యాపిల్ వంటి ఆహారాలను రోజూ తీసుకుంటే కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.

2801

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles