ఆహారమే ఆరోగ్యం. పిల్లలకు ఆరోగ్యవంతమైన ఆహారాన్ని పరిచయం చేయండి. ముద్దు ముద్దు మాటల వయసులోనే.. ఒక్కో కాయగూరనూ చూపిస్తూ.. అందులోని విశేషాలు చెప్పండి. వయసు పెరిగేకొద్దీ వారిలో జిహ్వ జ్ఞానం పెరుగుతుంది. కొత్తకొత్త రుచులు కోరుకుంటారు. ఇంట్లో లభించకపోతే .. బయటి ఆహారం వైపు మొగ్గు చూపుతారు. కాబట్టి ఎన్ని పోషక విలువలున్నా, ఎంత రుచిగా వండగలిగినా.. ఏ వంటకాన్నీ వారానికి ఒక రోజుకు మించి వండొద్దు. పిల్లలు పొద్దున్నే బడికెళ్లే తొందరలో ఉంటారు.
కాబట్టి, వీలైనంత వేగంగా తినగలిగే బ్రేక్‌ఫాస్ట్‌నే ఎంచుకోండి. అవసరమైతే నిలబడో, కారులో కూర్చునో ఆరగించేలా ఉండాలి. దాంతోపాటు పోషకాలూ ఉండాలి. ఆహార క్రమశిక్షణ చాలా అవసరం. ఎన్ని హోమ్‌వర్క్‌లు ఉన్నా.. సకాలంలో రాత్రిభోజనం పూర్తయ్యేలా చూడండి. లంచ్‌బాక్స్‌లో పెట్టింది ఎంత తింటున్నారు అనేదీ గమనించండి. తోటి పిల్లలు తెచ్చుకున్న ఆహారం గురించి చెప్పినప్పుడు.. ఆసక్తిగా వినండి. వీలైతే ఆ రుచుల్ని మీరూ వండిపెట్టండి.