సోమవారం 06 ఏప్రిల్ 2020
Health - Mar 12, 2020 , 21:24:09

ఈ సమయంలో తింటే ఆరోగ్యం మీదే...

ఈ సమయంలో తింటే ఆరోగ్యం మీదే...

పొద్దున లేచిన దగ్గర్నుంచీ పడుకునే సమయం వరకూ ఉరుకులూ, పరుగులే మన జీవన విధానమైపోయింది. మనసు నిండుగా తినడానికీ, కంటి నిండా నిద్రపోవడానికీ కూడా మన దగ్గర టైం లేదనుకుంటాం. చాలాసార్లు సమయం లేక తినడమే మానేస్తాం. కాని సరైన సమయంలో, సరైన ఆహారం తీసుకుంటే చాలా రకాల వ్యాధులకు దూరంగా ఉండొచ్చు. అందుకే ఏ సమయంలో ఎటువంటి ఆహారం తీసుకోవాలో సూచిస్తున్నారు నిపుణులు. 

అల్పాహారం

ఆరోగ్యంగా ఉండాలంటే ఉదయం తీసుకునే అల్పాహారాన్ని అస్సలు మానొద్దంటారు వైద్య నిపుణులు. ప్రతిరోజూ తీసుకోవాల్సిన ఆహారంలో కీలకమైంది అల్పాహారం. రోజంతా తాజాగా ఉండడానికి, పనిచేయడానికి కావాల్సిన శక్తి అల్పాహారంతోనే వస్తుంది. మెదడు, శరీరం చురుగ్గా పనిచేయడానికి ఇది తోడ్పడుతుంది. అల్పాహారాన్ని ఉదయం 7 నుంచి 8 లోపు చేయాలి. 10 గంటల తరువాత చేయకూడదు. 

మధ్యాహ్న భోజనం

అల్పాహారం చేసిన నాలుగు గంటల తరువాతే భోజనం చేయాలి. లేకుంటే శరీరంలో గ్లూకోజ్‌ విలువల్లో తేడాలు వస్తాయి. గ్లూకోజ్‌ను స్థిరంగా ఉంచడానికి, ఆకలి నార్మల్‌గా ఉండడానికి ఇది తప్పనిసరి. మధ్యాహ్నం పూట 12 నుంచి 2 గంటల మధ్య భోజనం చేయడం మంచిది. 3 గంటలు దాటకుండా చూసుకోవాలి. 

రాత్రి భోజనం

రాత్రి బాగా పొద్దుపోయిన తరువాత 11-12 గంటలకు తినడం ఇప్పటి ఆధునిక జీవనశైలిలో భాగమైపోయింది. కాని ఇది ఎంతమాత్రమూ మంచిది కాదు. నిద్రపోవడానికి కనీసం రెండు గంటల ముందు రాత్రి భోజనం పూర్తి చేయాలి. లేకుంటే తీసుకున్న కేలరీలు సరిగా వినియోగం చెందవు. బరువు కూడా పెరుగుతారు. నిద్రలో సమస్యలు వస్తాయి. సాయంకాలం 6 నుంచి రాత్రి 8 లోపు భోజనం చేసేయాలి. రాత్రి 9 గంటలు దాటకుండా జాగ్రత్తపడాలి. 


logo