పలు రకాల టీ లతో ఆరోగ్యం.. ఉత్సాహం

Sat,January 19, 2019 10:00 AM

కండరాలు మెలి తిరిగే చలి. బారెడు పొద్దెక్కినా బద్దకం వదలని వాతావరణం. ఉదయం లేవగానే అందరూ తీసుకునే పానీయం తేనీరు.. అదేనండి టీ. ఉదయపు బద్దకాన్ని వదిలించుకోవాలంటే కప్పు టీ కడుపున పడాల్సిందే. బయట చల్లని గాలులకు కడుపులోకి గరం గరం చాయ్‌ని పంపించమని మనసు బతిమాలుతుంది. ఒకప్పుడు టీ అంటే పాలు, టీ పొడి, చక్కెర అంతే... కానీ ఇప్పుడు టీ స్టాల్స్‌లో వివిధ రుచులతో పాల అవసరం లేకుండానే వివిధ రకాల తేనీరు లభ్యమవుతుంది. ఒకొక్క టీ లో ఒక్కో ప్రత్యేకత, ఆరోగ్య చిట్కా దాగుంది. ఇంకేం.. మీకు ఏ టీ కావాలో ఇంట్లోనే తయారు చేసుకోండి. మరి వాటిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం..!

దాల్చిన చెక్క- అల్లం టీ


చలికాలంలో వచ్చే రుగ్మతలకు చక్కని పరిష్కారం దాల్చిన చెక్క-అల్లం టీ. ఇది శారీరక బరువును తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యానికి మంచిది. దీనిని ప్రతి రోజూ తీసుకోవడం వల్ల శరీరంలో మలినాలను తొలిగిస్తుంది.
కావాల్సిన పదార్థాలు
దాల్చిన చెక్క- 2 అంగుళాలు, అల్లం-1/2 అంగుళం(తురమాలి). బ్లాక్ టీ ఆకులు- 1 స్ఫూన్, నిమ్మకాయ-1/4 ముక్క. పుదీనా ఆకులు-5

తయారీ విధానం

ముందుగా ఒక గిన్నెలో మూడు కప్పుల నీరు పోసి మరిగించాలి. దాల్చిన చెక్కను పొడిగా చేసి మరుగుతున్న నీటీలో వేసి మరి కాసేపు మరిగించాలి. తరువాత అల్లం పేస్టు వేసి రెండు నిమిషాలు మళ్లీ మరిగించాలి. టీ ఆకులు వేసి మంటను ఆపివేయాలి. రెండు నిమిషాల అనంతరం కప్పులో టీ పోసుకుని నిమ్మకాయ రసం, పూదీన ఆకులతో గార్నిష్ చేయాలి.

పుదీనా టీ


ఉదయాన్నే కప్పు పుదీనా టీ తాగితే మెదడు చురుగ్గా ఉంటుంది. మనసుకు ఉత్సాహమైన ఆలోచనలను ఇస్తుంది. గొంతులో గరగర, పొడిదగ్గు వంటి ఇబ్బందులు తలెత్తినప్పుడు కప్పు పూదీనా చాయ్ చక్కటి ఉపశమనం.
కావాల్సిన పదార్థాలు
పుదీనా ఆకులు -10, పాలు-1 కప్పు, యాలకలు-2, తేనె-తగినంత
తయారీ విధానం
పుదీనా ఆకులను శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. రెండు కప్పుల నీటీని స్టౌ మీద పెట్టి మరిగిన తరువాత పుదీనా ఆకులను వేసి మూత పెట్టాలి. కాసేపటీ తరువాత కప్పు పాలు, యాలుకలు వేసి రెండు నిమిషాల తరువాత దించేయాలి. చివరగా తేనె కలిపితే పుదీనా టీ సిద్ధం. పాలు ఇష్టం లేని వారు పాలు పోయకుండా కూడా తాగవచ్చు.

మసాలా టీ


ఈ టీలో మంచి ఘాటైన సువాసన వస్తుంది. రక్త ప్రసరణకు, అరుగదలకు ఇది చాలా మంచిది. అంటు వ్యాధులు రాకుండా కాపాడుతుంది.
కావాల్సిన పదార్థాలు
పాలు-1 కప్పు, టీ పొడి-1స్ఫూన్, అల్లం-అర అంగుళం, శొంటి - పావు అంగుళం, లవంగాలు-2, పంచదార-తగినంత
తయారీ విధానం
మెదటగా పాలు, నీరు కలిపి బాగా మరిగించాలి. అనంతరం పై దినుసుల పొడిని మరుగుతున్న నీటీలో వేసి మరింతగా మరిగించాలి. బాగా మరిగిన తరువాత వడ పోసుకోవాలి అంతే గరం..గరం.. మసాల టీ రెడీ.

బ్లాక్ టీ


పాలు కలుపకుండా టీ పొడితో తయారు చేసేదే బ్లాక్ టీ. ఈ టీ రక్త ప్రసరణకు ఉపయోగపడుతుంది. పక్షవాతాన్ని నియంత్రిస్తుంది.
కావాల్సిన పదార్థాలు
టీ పొడి-1 స్ఫూన్, పంచదార/తేనే-తగినంత.
తయారీ విధానం
కప్పు నీళ్లను మరిగించి టీ పొడి వేసి మరి కొద్ది సేపు మరిగించాలి. చివరిలో పంచదార లేదా తేనె కలుపుకోవాలి. వగరుగా ఉందనుకుంటే నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు.

గ్రీన్ టీ


ఈ టీ ఆరోగ్యానికి చాలా మంచిది. రోజూ తీసుకుంటే శరీరంలో ఉండే చెడు కొలస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. బరువును నియంత్రిస్తుంది. చర్మరక్షణకు బాగా ఉపయోగపడుతుంది.
కావాల్సిన పదార్థాలు
గ్రీన్ టీ ఆకులు-1 స్ఫూన్, తేనే-2 టేబుల్ స్పూన్లు.
తయారీ విధానం
స్టౌ మీద నీటిని మరుగబెట్టాలి. తరువాత గ్రీన్ టీ ఆకులను అందులో వేసి మూత పెట్టి మరో రెండు నిమిషాల పాటు మరిగించాలి. అనంతరం వడ పోసుకుని తేనె కలుపుకుంటే గ్రీన్ టీ రెడీ. ఇష్టం ఉన్న వారు అల్లం ముక్క కూడా వేసుకోవచ్చు.

చామంతి టీ


ఈ టీ ఆరోగ్యంతో పాటు అందాన్ని ఇస్తుంది.
కావాల్సిన పదార్థాలు
టీ పొడి-1 స్ఫూన్, చామంతి పూరేకులు - 2 స్ఫూన్లు, నిమ్మరసం, తేనె - తగినంత
తయారీ విధానం
టీ పొడి నీటిలో వేసి బాగా మరిగించాలి. తరువాత తాజా చామంతి రేకులను వేసి మరికాసేపు మరిగించాలి. అనంతరం వడ కట్టి కొద్దిగా నిమ్మరసం, తేనెతో కలిపితే సరి. మంచి సువాసనతో కూడిన చామంతి టీ రెడీ.

బాదం టీ


కావాల్సిన పదార్థాలు
టీ పొడి - 2 స్ఫూన్లు, పాలు-1 కప్పు, బాదం పప్పులు -5 (సన్నగా తరగాలి) నిమ్మరసం, పంచదార-తగినంత
తయారీ విధానం
ముందుగా నీటీని వేడి చేసుకోవాలి. నీటీలో సన్నగా తరిగిన బాదం పప్పులు వేసి మరింతగా మరిగించాలి. తరువాత టీ పొడి, పాలు పోసి మరో పది నిమిషాలు మరిగించాలి. తరువాత దానిలో పంచదార లేదా తేనె కలుపుకోవాలి. ఇష్టం ఉన్న వారు నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు.

లెమన్ టీ


తలనొప్పి, జ్వరంతో బాధపడుతున్న వారికి ఈ టీ ఆరోగ్యదాయకం, బరువును నియంత్రిస్తుంది.
కావాల్సిన పదార్థాలు
టీ పొడి-1 స్ఫూన్, పంచదార/తేనె, నిమ్మరసం - తగినంత.
తయారీ విధానం
టీ పొడి వేసి నీళ్లు బాగా మరిగించాలి. తరువాత దింపి మూత పెట్టాలి. చిక్కని డికాషన్‌లా తయారు అయ్యాక వడపోసి నిమ్మరసం కలుపుకోవాలి. తగినంత చక్కెర లేదా తేనె కలుపుకుంటే సరి.

అల్లం టీ


ఈ టీ వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. కీళ్లనొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. తల తిరుగుడుని తగ్గిస్తుంది.
కావాల్సిన పదార్థాలు
టీ పొడి-1 స్పూన్, అల్లం-1/2 అంగుళం, పంచదార/ తేనె-తగినంత.
తయారీ విధానం
టీ పొడి వేసిన నీటీని బాగా మరిగించాలి. తరువాత అల్లంను చిన్న ముక్కలుగా కట్ చేసి మరుగుతున్న తేనీరులో వేయాలి. పదినిమిషాల అనంతరం దించి పంచదార లేదా తేనె కలుపుకుని తాగవచ్చు.

కోకో టీ


చాక్లెట్ రుచి కావాలనుకునేవారు టీ మరిగేటప్పుడు కోకో పౌడర్‌ను కలిపితే సరి. ప్రత్యేకమైన రుచితో కోకో టీ సిద్ధం.

3836
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles