శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Health - Jun 09, 2020 , 13:26:43

‘ఫేస్‌షీల్డ్‌ మాస్క్‌’.. కరోనాకు చెక్‌!

‘ఫేస్‌షీల్డ్‌ మాస్క్‌’.. కరోనాకు చెక్‌!


న్యూఢిల్లీ: ప్రపంచాన్ని కలవరపెడుతున్న కరోనా వైరస్‌ నుంచి తప్పించుకోవాలంటే ఫేస్‌షీల్డ్‌ మాస్కులు అత్యంత ఉత్తమమని క్లినికల్లీ నిరూపితమైంది. ఇండియన్‌ హెల్త్‌ లైన్‌ జాతీయ అధ్యక్షుడు, ప్రముఖ క్యాన్సర్‌ వైద్య నిపుణుడైన డాక్టర్‌ ప్రవీన్‌ తొగాడియా ఈ విషయాన్ని వెల్లడించారు. కరోనా పాజిటివ్‌ ఉన్న వ్యక్తి మనకు 1 మీటర్‌ దూరమున్నప్పుడు దగ్గినా, తుమ్మినా వైరస్‌ గాలి ద్వారా మన ముక్కు, నోటినుంచి గొంతులోకి వెళ్తుందని తొగాడియా పేర్కొన్నారు. ఒకవేళ మనం ఫేస్‌షీల్డ్‌ మాస్క్‌ గనుక వాడితే కరోనా వైరస్‌ను అడ్డుకోవచ్చని తెలిపారు. కరోనా వైరస్‌ మన శరీరంలోకి మన ముక్కు, నోరు, కళ్లు, కొంతవరకు చెవుల ద్వారా కూడా ప్రవేశిస్తుందని, ఈ మార్గాల ద్వారాగాక మరేవిధంగానూ చేరలేదన్నారు. ఒకసారి వైరస్‌ వీటిద్వారా లోనికి చేరితే మొదట గొంతులోకి వెళ్లి ఆ తర్వాత ఊపిరితిత్తుల్లోకి చేరుకుంటుందని వివరించారు. దీంతోపాటు కరోనా వైరస్‌ ఇతర వస్తువులపై నిక్షిప్తమై ఉన్నప్పుడు మనం చేతివేళ్లతో సదరు ప్రదేశాన్ని ముట్టి, అదేవేళ్లతో ముఖాన్ని తాకితే వైరస్‌ ఫేస్‌పై చేరి అక్కడినుంచి, మళ్లీ ముక్కు, నోరు,కళ్ల ద్వారా లోనికి ప్రవేశిస్తుందన్నారు. 


ఎవరైతే ఫేస్‌షీల్డ్‌ వాడి, ముఖాన్ని పదేపదే తాకకుండా ఉంటారో వారు ఏ మార్గం నుంచి కూడా కరోనా వైరస్‌ లోనికి ప్రవేశించకుండా తమకు తాము రక్షించుకోగలుగుతారని తొగాడియా వెల్లడించారు. అలాగే, కరోనా భయంకరంగా విజృంభిస్తున్న తరుణంలో ప్రపంచవ్యాప్తంగా దేశాలన్నీప్రతి ఒక్కరూ మాస్కు తప్పనిసరిగా ధరించాలని సూచిస్తున్నాయి. కానీ, సాధారణ మాస్కు కంటే ఫేస్‌ షీల్డ్‌ మాస్కులే ఉత్తమమని అమెరికాలోని ప్రఖ్యాత వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ఫేస్‌షీల్డ్‌ను ప్రతిరోజూ స్టెరిలైజ్‌ చేస్తూ అది పగిలిపోయే వరకు వాడుకోవచ్చని సూచిస్తున్నారు. పిల్లలు, ఆస్తమా రోగులు సాధారణ మాస్కులు ఎక్కువకాలం ధరిస్తే ప్రమాదకరమని, వారికి ఫేస్‌షీల్డ్‌ మాస్కులు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని తెలిపారు. వీటితో గాలి ద్వారా వైరస్‌ మనలోకి ప్రవేశించకుండా పకడ్బందీగా రక్షించుకోగలుగుతామని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.logo