దుంపకూరలను తినడానికి చాలామందిఇష్టపడరు. ముఖ్యంగా చేమలాంటి జిగురు ఉండే దుంపలను తినడానికి అస్సలు ఆసక్తిచూపించరు. కానీ ఈ దుంపల వలన ఎలాంటి ఆరోగ్యఫలితాలు ఉంటాయో తెలుసా ? ఏ కూరనైనా ఫ్రై చేసుకొని తినడం కన్నా ఉడికించుకొని తినడం మంచిది. చేమదుంపల్ని కూడా ఉడకబెట్టి కాస్తంత నూనెలో తాలింపు వేసుకొని తింటే ఎంత బాగుంటుందో మాటల్లో చెప్పలేం. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకే ఆ రుచి తెలుస్తుంది. చాలామంది మాంసానికి బదులు వీటిని తింటారు తెలుసా. చేమదుంపలు తింటే బరువు తగ్గుతారు. అలాగే పిండి పదార్థం ఎక్కువగా ఉంటుంది కాబట్టి గుండెకు చాలా మేలు చేస్తాయి. వీటిల్లో ఉండే పీచు, యాంటీ ఆక్సిడెంట్ల కాంబినేషన్ ధమనులలో కొవ్వు నిల్వ ఉండకుండా చేస్తుంది. అంతేకాదు వీటిలో ఉండే డియోస్కోరిన్ అనే ప్రోటీన్ గుండె జబ్బులూ, హార్ట్ ఎటాక్ రాకుండా కాపాడుతుంది. అరుదుగా లభించే విటమిన్ బి-6 , ‘ఇ’ విటమిన్ లను ఈ దుంపలు అందిస్తాయి. బీపీని సెట్ చేసే పొటాషియం వీటిలో పుష్కలంగా ఉంటుంది. చేమ దుంపలు జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి. వీటిలోని డైటరీ ఫైబర్ మలబద్ధకాన్ని తగ్గించి, విష పదార్థాలు పేరుకుపోకుండా కాపాడుతుంది. కొలన్ క్యాన్సర్, ఇర్రిటబుల్ బవెల్ సిండ్రోమ్ ల నుంచి చాలా వరకు ఉపశమనం లభిస్తుంది. చామ దుంపల వల్ల మహిళల ఎండోక్రైన్ వ్యవస్థ చక్కగా పనిచేస్తుంది. మెనోపాజ్ తర్వాత ఈ దుంపలు మంచి ప్రభావం చూపిస్తాయి. రాత్రివేళ చెమట, గొంతు తడి ఆరటం, హాట్ ప్లషెస్ వంటి లక్షణాలు చేమదుంపల వల్ల తగ్గుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. హార్మోన్ రిప్లేస్ మెంట్ థెరపీకి ఇవి ప్రత్యామ్నాయం. ఋతుసంబంధిత క్రాంప్స్, ఆర్థరైటిస్ నొప్పులు, కండరాల అలసట తగ్గించడానికి సహకరిస్తాయి. గర్భిణీలకు నీరు పట్టడం, వికారంగా ఉండే లక్షణాలను చామదుంపలు తగ్గిస్తాయి. ఇన్ని ఆరోగ్యప్రయోజనాలు ఉండబట్టే చేమదుంపలను వీలైనంత ఆహారంలో ఉండేలా చూసుకోమని డైటీషియన్లు చెబుతున్నారు.