మాచా టీ తెలుసా..? దాంతో ఏమేం లాభాలు కలుగుతాయంటే..?


Tue,November 6, 2018 04:50 PM

టీలలో మనకు అనేక రకాల టీలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో మాచా టీ కూడా ఒకటి. కెమెలియా సినెన్సిస్ అనే మొక్క ఆకుల నుంచి ఈ టీ పొడిని తయారు చేస్తారు. గ్రీన్ టీ రూపంలో ఈ టీ మనకు దర్శనమిస్తుంది. మనకు ఈ టీ కొత్తదే కానీ, చైనా, జపాన్‌లలో కొన్ని వందల ఏళ్ల కిందటి నుంచే ఈ టీని తాగుతున్నారు. కెమెలియా మొక్క ఆకుల నుంచి తయారు చేసే పొడిని మాచా టీగా విక్రయిస్తున్నారు. ఈ టీ సాధారణంగా మనం తరచూ తాగే టీ కన్నా స్ట్రాంగ్‌గా ఉంటుంది.

మాచా టీ తాగడం వల్ల కలిగే లాభాలివే...

1. మాచా టీలో సహజ సిద్ధమైన యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరంలో ఫ్రీ ర్యాడికల్స్ వల్ల కణాలకు కలిగే నష్టాన్ని నివారిస్తాయి. హానికారక ఫ్రీ ర్యాడికల్స్‌ను తొలగిస్తాయి.

2. మాచా టీ తాగడం వల్ల గుండె జబ్బుల బారిన పడకుండా ఉండవచ్చు. మాచా టీ తాగితే రక్తంలో ఉన్న ఎల్‌డీఎల్ (చెడు) కొలెస్ట్రాల్ పోతుంది. మంచి (హెచ్‌డీఎల్) కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీని వల్ల గుండె ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. అలాగే బరువు కూడా తగ్గుతారు.

3. లివర్‌లో పేరుకుపోయే వ్యర్థాలను బయటకు పంపడంలోనూ మాచా టీ బాగానే పనికొస్తుంది. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్‌ను తగ్గించడంలో మాచా టీ ఉపయోగపడుతుంది. లివర్ చెడిపోయేందుకు కారణమయ్యే పలు ఎంజైమ్‌లు నశిస్తాయి. మాచా టీ తాగడం వల్ల కిడ్నీలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి.

4. మాచా టీలో ఈజీసీజీ అనే పాలిఫినాల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ కణాలకు విరుగుడుగా పనిచేస్తాయి. క్యాన్సర్‌ను తగ్గించడంలో సహాయం చేస్తాయి. ప్రోస్టేట్, స్కిన్, లివర్ క్యాన్సర్ కణాలను నాశనం చేస్తాయి.

5. మాచా టీని 2 నెలల పాటు వరుసగా రోజూ తాగుతుంటే మెదడు పనితీరు మెరుగుపడుతుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా పెద్దల్లో వయస్సు మీద పడుతున్న కొద్దీ వచ్చే అల్జీమర్స్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయని సైంటిస్టులు చెబుతున్నారు. అలాగే మాచా టీ తాగడం వల్ల మెదడు యాక్టివ్‌గా ఉంటుందని, చురుగ్గా పనిచేస్తారని సైంటిస్టులు చెబుతున్నారు.

6. మాచా టీలో యాంటీ బాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి నోట్లో పెరిగే బాక్టీరియాను నిర్మూలిస్తాయి. దీని వల్ల దంతాలు, చిగుళ్ల సమస్యలు రాకుండా ఉంటాయి. అవి దృఢంగా మారుతాయి.

3500

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles