శనివారం 26 సెప్టెంబర్ 2020
Health - May 30, 2020 , 16:16:50

ప‌చ్చి బ‌ఠానీల‌తో మ‌ల‌బ‌ద్ద‌కానికి చెక్..!

ప‌చ్చి బ‌ఠానీల‌తో మ‌ల‌బ‌ద్ద‌కానికి చెక్..!

ప‌చ్చి బ‌ఠానీల‌ను మ‌నం అనేక ర‌కాల కూర‌ల్లో వేస్తుంటాం. ప్ర‌ధానంగా కూర్మా, ఉప్మా, బిర్యానీ త‌దిత‌ర వంట‌కాల్లో ప‌చ్చి బ‌ఠానీల‌ను బాగా వేస్తారు. దీంతో ఆయా వంట‌కాల‌కు చ‌క్క‌ని రుచి వ‌స్తుంది. అయితే ఇవి కేవ‌లం రుచిని మాత్ర‌మే కాదు ఎన్నో పోష‌కాల‌ను కూడా క‌లిగి ఉంటాయి. వీటిని మ‌నం త‌ర‌చూ ఆహారంలో భాగం చేసుకుంటే దాంతో శ‌రీరానికి చ‌క్క‌ని పోష‌ణ అందుతుంది. ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌లు కూడా దూర‌మ‌వుతాయి. ఈ క్ర‌మంలోనే ప‌చ్చి బ‌ఠానీల‌ను త‌ర‌చూ తీసుకుంటే వాటితో మ‌న‌కు ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

1. మలబద్దకంతో బాధపడేవారు పచ్చి బఠానీలను ఆకుకూరలు, కూరగాయలతో కలిపి కూర‌గా చేసుకుని తింటే విరేచనం సాఫీగా జరుగుతుంది.

2. వంద గ్రాముల పచ్చి బఠానీలు అరగడానికి సుమారు 3 గంటల సమయం పడుతుంది. బరువు తగ్గాలనుకునే వారు వీటిని ఇతర కూరగాయలతో కలిపి తీసుకుంటే ఆకలి త్వరగా వేయదు. బరువు కూడా పెరగకుండా ఉంటారు.

3. పచ్చి బఠానీల్లో విటమిన్ ఎ, బి1, బి2, సిలతోపాటు ఐరన్, కాల్షియం, పాస్ఫరస్‌లు సమృద్ధిగా లభిస్తాయి. కాబట్టి బఠానీలను ఉడికించి ముద్దలా చేసి ఎదుగుతున్న పిల్లలకు, బలహీనంగా ఉన్న వారికి ఇస్తే బలవర్దక ఆహారాన్ని అందించిన వారమవుతాం.

4. వీటిలో క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడే ఔషధ గుణాలు ఉన్నాయి. రోజుకు ఒక కప్పు మోతాదులో తీసుకుంటే క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని పరిశోధనల్లో తెలిసింది.

5. యాంటీ ఆక్సిడెంట్లు వీటిలో పుష్కలంగా ఉంటాయి. దీని వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అల్జీమర్స్, ఆర్థరైటిస్, బ్రాంకైటిస్, ఆస్టియోపోరోసిస్, క్యాండిడా వంటి రోగాలకు ఇవి బాగా పనిచేస్తాయి. వీటిలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు సమృద్ధిగా ఉన్నాయి.

6. డయాబెటిస్‌తో బాధపడుతున్న వారికి పచ్చి బఠాణీలు చక్కని ఆహారం. వీటిలో ఫైబర్ అధికంగా ఉండడంతో రక్తంలో గ్లూకోజ్ త్వరగా చేరదు. టైప్ 2 డయాబెటిస్ ఉన్న వారికి ఇవి బాగా పనిచేస్తాయి.

7. గుండె జబ్బులు రాకుండా చూస్తాయి. రక్తనాళాలను సంరక్షిస్తాయి. విటమిన్ కె వీటిలో కావల్సినంత దొరుకుతుంది. రోజుకు 1 కప్పు పచ్చి బఠానీలను తింటే శరీరానికి నిత్యం కావల్సిన విటమిన్ కెలో దాదాపు 44 శాతం వరకు అందుతుంది.

8. శరీరంలోని చెడు కొలెస్టరాల్‌ను నాశనం చేస్తాయి. ఇదే సమయంలో మంచి కొలెస్టరాల్ స్థాయిలను పెంచుతాయి. దీంతో అధిక బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. గుండె స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి.


logo