శనివారం 11 జూలై 2020
Health - May 28, 2020 , 16:18:41

ఆరోగ్య ప్రదాయిని.. తిప్పతీగ..!

ఆరోగ్య ప్రదాయిని.. తిప్పతీగ..!

మన చుట్టూ ఉన్న ప్రకృతిలో మనకు ఆరోగ్యాన్ని అందించే ఎన్నో రకాల ఔషధ మొక్కలు ఉన్నాయి. కానీ చాలా వరకు మొక్కల గురించి మనకు తెలియదు. అలాంటి మొక్కల్లో తిప్పతీగ కూడా ఒకటి. ఇది మన ఇంటి పరిసరాల్లో, చుట్టు పక్కలా పెరుగుతుంది. కానీ దీని గురించి చాలా మందికి అవగాహన లేదు. తిప్పతీగను ఎక్కువగా ఆయుర్వేద ఔషధాల తయారీలో వాడుతారు. దీన్ని ఇంగ్లిష్‌లో గిలోయ్ అని, సంస్కృతంలో అమృత అని పిలుస్తారు. ఈ క్రమంలోనే తిప్పతీగ వల్ల మనం ఎలాంటి అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందామా..!

1. తిప్పతీగ ఆకుల చూర్ణాన్ని నిత్యం తీసుకుంటే శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ముఖ్యంగా ఈ సీజన్‌లో వచ్చే జ్వరాలు, వ్యాధులు, ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది. తిప్పతీగలో ఉండే యాంటీ బయోటిక్, యాంటీ వైరల్, యాంటీ ఫంగస్ గుణాలు మన శరీరంలో చేరే సూక్ష్మ క్రిములను నాశనం చేస్తాయి.

2. తిప్పతీగ ఆకుల పొడిని బెల్లంలో కలుపుకుని నిత్యం తింటే అజీర్తి తగ్గుతుంది. దీంతోపాటు జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది.

3. డయాబెటిస్ ఉన్నవారు తిప్పతీగ చూర్ణాన్ని నిత్యం ఉదయం, సాయంత్రం తీసుకుంటే ఫలితం ఉంటుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించుకోవచ్చు.

4. నిత్యం ఒత్తిడి, మానసిక ఆందోళనలతో సతమతం అయ్యేవారు తిప్పతీగ చూర్ణాన్ని రోజూ తీసుకుంటే ఫలితం ఉంటుంది. జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది.

5. దగ్గు, జలుబు, టాన్సిల్స్ తదితర శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు తిప్పతీగ చూర్ణాన్ని వాడితే ఫలితం ఉంటుంది.

6. ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో కొద్దిగా తిప్పతీగ చూర్ణం, అల్లం రసం కలిపి నిత్యం రెండు పూటలా తాగుతుంటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి.


logo