మంగళవారం 26 మే 2020
Health - May 22, 2020 , 17:18:38

వేగంగా ఆహారం తింటే కలిగే దుష్పరిణామాలు ఇవే..!

వేగంగా ఆహారం తింటే కలిగే దుష్పరిణామాలు ఇవే..!

మనలో అధిక శాతం మంది చాలా వేగంగా భోజనం చేస్తుంటారు. అదేమిటని అడిగితే.. పని ఉందనో, ఎక్కడికైనా వెళ్లాలనో.. లేదా తాము అలాగే తింటామనో.. మరే ఇతర కారణమో చెబుతుంటారు. కానీ నిజానికి ఎవరైనా సరే.. భోజనం వేగంగా చేయకూడదు. చాలా నెమ్మదిగా తినాలి. అయితే వేగంగా భోజనం చేయడం వల్ల ఎలాంటి దుష్పరిణామాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

* వేగంగా భోజనం చేయడం వల్ల ఆహారం ఎక్కువగా తింటారని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. దీంతో అధికంగా బరువు కూడా పెరుగుతారట. అందుకని నెమ్మదిగా భోజనం చేయాలని పరిశోధకులు చెబుతున్నారు.

* వేగంగా భోజనం చేయడం వల్ల తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. ఆహారం జీర్ణమయ్యేందుకు ఎక్కువ సమయం పడుతుంది. దీంతో క్రమంగా జీర్ణ వ్యవస్థ పనితీరు దెబ్బతింటుంది. ఫలితంగా అజీర్ణ సమస్య వస్తుంది.

* వేగంగా భోజనం చేస్తే ఇన్సులిన్ నిరోధకత పెరిగి టైప్ 2 డయాబెటిస్ వస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.

* చాలా త్వరగా ఆహారం తినడం ముగించేస్తే గ్యాస్, అసిడిటీ సమస్యలు కూడా వస్తాయి. కనుక ఆహారాన్ని నెమ్మదిగా నమిలి మింగాలని వైద్యులు చెబుతున్నారు.


logo