శనివారం 19 సెప్టెంబర్ 2020
Health - Apr 20, 2020 , 15:14:11

ధారావిలో ఆ మందును పరీక్షిస్తారట

ధారావిలో ఆ మందును పరీక్షిస్తారట

హైదరాబాద్: చెప్పరాని కష్టం వస్తే చెయ్యరాని పని చెయ్యాలే అని పెద్దలు అన్నారట. దేశవాణిజ్య రాజధాని ముంబైలో మహారాష్ట్ర సర్కారు అలాంటి పనినే చేపట్టబోతున్నది. దేశంలోని కరోనా కేసుల్లో పదిశాతం, మరణాల్లో పాతిక వంతు ముంబైలోనే  నమోదయ్యాయి. ముఖ్యంగా ధారావి మురికివాడలో కరోనా బుసలు కొడుతున్నది. ఆసియాలో కెల్లా అతిపెద్ద మురికివాడలోని ఇరుకు సందుల్లో వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడం అసాధ్యమవుతున్నది. మలేరియా మందు హైడ్రాక్సీ క్లోరోక్విన్ కరోనా నుంచి కాపాడుతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గట్టిగా నమ్ముతున్నారు. ఆ మందు తనకు సరఫరా చేయాల్సిందేనని మంకుపట్టు పట్టి.. బెదిరించి మరీ ఇండియా నుంచి తెప్పించుకున్నారు. మరోవైపు వైద్యరంగం, ఆమాటకు వస్తే ట్రంప్ అంటువ్యాధుల సలహాదారు ఆంటోనీ ఫాసీ ఆ మందు పని చేస్తుందని ఎలాంటి దాఖలాలు లేవని కుండబద్దలు కొడుతున్నారు. ఇప్పుడు అదే మందు మన ధారావిలో పెద్దఎత్తున పరీక్షించాలని బృహన్‌ముంబై మునిసిపల్ కార్పొరేషన్ సమాయత్తమవుతున్నది. అందుకు ఓ బృందాన్ని ఎంపిక చేస్తున్నట్టు అదనపు కమిషనర్ సురేశ్ కాకాని చెప్పారు. ఎంతకాలంపాటు, ఏ మోతాదులో ఆ మందు ఇవ్వాలనేది వైద్యనిపుణులతో సంప్రదిస్తున్నట్టు ఆయన వివరించారు. ఈ చర్య కరోనా కల్లోలం కలిగిస్తున్న నిస్పృహకు అద్దం పడుతున్నది. 'ఇది మనకు అందుబాటులో ఏకైక మార్గం. ప్రపంచాన్ని సతమతం చేస్తున్న మహమ్మారి నుంచి బైటపడేందుకు ఇది సమాధానాలు ఇస్తుందేమో చూడాలి' అని సురేశ్ కాకాని అన్నారు. అయితే దీనిని చికిత్స కోసం కాకుండా నిరోధకత పెంచే మందుగా వాడాలనేది కార్పొరేషన్ అధికారుల ఆలోచన. కాలేయ, గుండె జబ్బులు లేనివారికి, వారు ్ంతవరకు వాడుతున్న మందులను పరిశీలించిన మీదట దీనిని ఇవ్వాలని భావిస్తున్నారు. ధారావితో పాటు వర్లిలో కూడా ఈ మందును సామూహికంగా పరీక్షిస్తారు. అంగీకారం తెలిపినవారికి మాత్రమే ఈ మందు ఇస్తామని సురేశ్ కాకాని అన్నారు.


logo