ఒక హాస్పిటలైజేషన్కే మీ ఆరోగ్యబీమా పాలసీ ద్వారా పొందిన మొత్తం ఖర్చయిపోయిందా? లేక అధికభాగం తరిగిపోయిందా? మళ్లీ ఈ ఏడాదిలో మీకు లేక మీ కుటుంబసభ్యులకు ఆరోగ్య సమస్య తలెత్తితే ఎలా అని ఆందోళన చెందుతున్నారా? ఇలాంటి ఆందోళనలకు చెక్పెట్టేదే ‘రిస్టోరేషన్ బెనిఫిట్’. మీరు పాలసీ తీసుకునేటప్పుడే దీనిని ఎంచుకోవాలి.
ఇది అమలయ్యే విధానం…
పాలసీ పరిమితికాలంలోగా బీమా చేసిన మొత్తం లేదా పాక్షికంగా ఖర్చయిపోతే, అలా అయిపోయిన మొత్తాన్ని పాలసీలో పూరిస్తారు. ఉదాహరణకు నలుగురు ఉండే మీ కుటుంబానికి రూ.4 లక్షల ఆరోగ్య బీమా రక్షణకు తీసుకున్నారనుకుందాం. ఒకరికి సర్జరీ జరిగి, బీమా చేసిన మొత్తమంతా దానికే అయిపోయిందనుకొండి. ఆతర్వాత మీ కుటుంబ సభ్యుల్లో మరొకరికి రూ.2 లక్షల వైద్య ఖర్చులు అవసరమైతే ఈ రిస్టోరేషన్ బెనిఫిట్ ఆటోమేటిక్‌గా అందుబాటులోకి వస్తుంది. లేదా సర్జరీకి బీమా మొత్తంలో కొంత ఖర్చయితే, ఆ మొత్తమే పాలసీలో మళ్లీ చేరి అక్కరకు వస్తుంది. రిస్టోరేషన్కు రెండు ఆప్షన్లు ఉంటాయి. బీమా మొత్తం ఖర్చయిన తర్వాత భర్తీచేసే ఆప్షన్ ఒకటికాగా, పాక్షికంగా ఖర్చయినా భర్తీ చేసే ఆప్షన్ మరొకటి. పాలసీ తీసుకునేటప్పుడు రిస్టోరేషన్ ప్రయోజనాన్ని, రిస్టోరేషన్ ఆప్షన్లలో ఏదీకావాలో దానిని ఎంచుకోవాల్సివుంటుంది.
ప్రీమియం ఇలా…
రిస్టోరేషన్ బెనిఫిట్‌తో పాలసీ ఎంచుకుంటే ప్రీమియం కాస్త అధికం. ఉదాహరణకు రూ.4 లక్షల ఆరోగ్యబీమా పాలసీకి ప్రీమియం రూ.5,000కు కాస్త పైన ఉంటే…ఈ ప్రయోజనం లభించే పాలసీ ప్రీమియం రూ.6,000 వరకూ ఉండవొచ్చు.