మంగళవారం 31 మార్చి 2020
Health - Mar 19, 2020 , 20:58:47

జుట్టు రాలడం - అపోహలు

జుట్టు రాలడం - అపోహలు

చుండ్రు ఉంటే జుట్టు రాలిపోతుందా? పిల్లల్లో హెయిర్ ఫాల్ ఉండదా..? కొన్ని రకాల ఆయిల్స్ వల్ల జుట్టు రాలడాన్ని ఆపొచ్చా..? ఇలాంటి అనేక అనుమానాలు, నమ్మకాలు మనలో ఉంటాయి. వాటిలో నిజానిజాలెంత.. ఇప్పుడు చూద్దాం.

నూనెలు, షాంపూలతో జుట్టు పెరుగుతుందా?

మా కొబ్బరి నూనె వాడండి.. అందమైన శిరోజాలు మీ సొంతం అంటూ గుప్పు గుప్పున యాడ్స్ వస్తుంటాయి. వాటిలో ఏది వాడితే బెటరో మనకు అర్థం కాదు. అయితే ఇలా ఆయిల్స్ వాడటం వల్ల జుట్టు పెరగడంలో మాత్రం నిజం లేదంటున్నారు నిపుణులు. సాధారణంగా షాంపూ వల్ల స్కాల్ప్ పైన ఉండే క్యుటికిల్ లేయర్ డ్యామేజ్ అవుతుంది. ఆయిల్ రాయడం వల్ల షాంపూ ప్రభావం డైరెక్ట్ గా స్కాల్ప్ పై ఉండదు కాబట్టి క్యుటికిల్ డ్యామేజ్ కాకుండా ఉంటుంది. అందుకే ఏ నూనె అయినా కండిషనర్ గా మాత్రమే పనిచేస్తుంది. చుండ్రు ఉన్నవాళ్లు మాత్రం తలస్నానానికి అరగంట ముందు మాత్రమే ఆయిల్ రాసుకోవాలి. ఎక్కువ వాడకూడదు.

 చుండ్రు ఉంటే జుట్టు రాలుతుందా?

డాండ్రఫ్ వల్ల అది చాలా తీవ్రంగా ఉంటే తప్ప సాధారణంగా హెయిర్ ఫాల్ ఉండదు. మైగ్రేన్ వల్ల కూడా జుట్టు రాలిపోదు. కాకపోతే రిపీటెడ్ తలనొప్పి వల్ల స్ట్రెస్ అయి హెయిర్ ఫాల్ ఉండొచ్చు. నీళ్లు మారడం వల్ల జుట్టు రాలిపోతుందనుకుంటారు కాని ఇది వంద శాతం కరెక్ట్ కాదని అధ్యయనాలు చెప్తున్నాయి. హెల్మెట్ పెట్టుకుంటే చెమట ఎక్కువై జుట్టు రాలుతుందనుకోవడం కూడా కరెక్ట్ కాదు. నిజం చెప్పాలంటే జుట్టు కాలుష్యానికి ఎక్స్ పోజ్ కాకుండా ఇది కాపాడుతుంది. హెల్మెట్ పెట్టుకున్నప్పుడు ఎక్కువసార్లు తలస్నానం చేస్తే సరిపోతుంది.

 వేడి చేస్తే జుట్టు రాలుతుందా?

చలికాలం లేకపోతే ఎండాకాలం వేడి వల్ల హెయిర్ ఫాల్ అనుకుంటారు. కాని సీజనల్ మార్పుల వల్ల జుట్టు రాలడం తక్కువ. కాకపోతే కొన్ని వెంట్రుకలు ఎక్కువ పోవచ్చు. శరీరంలో వేడి వల్ల జుట్టు రాలుతుందంటారు కొందరు. అయితే మనం తీసుకున్న ఆహారం బ్రేక్ డౌన్ అయి శక్తి విడుదల అయినప్పుడు కొంత వేడి ఉత్పత్తి అవుతుంది. దీన్ని బేసల్ మెటబాలిక్ రేటు అంటారు. ఇది ఒక్కోక్కరిలో ఒక్కోలా ఉంటుంది. ఎక్కువ బిఎంఆర్ ఉన్నవాళ్లకి బహుశా వాళ్లది ఎక్కువ వేడి శరీరం అనుకోవచ్చు. కాని దీనివల్ల కూడా హెయిర్ ఫాల్ జరగదు. 


logo
>>>>>>