న్యూఢిల్లీ : స్పైసీ ఫుడ్‌ను ఇష్టపడే వారికి ఘాటు వార్తలా పచ్చి మిర్చితో ఆరోగ్యానికి పలు ప్రయోజనాలు చేకూరుతాయని నిపుణులు చెబుతున్నారు. పచ్చి మిర్చిలో కాప్సైసిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉండటంతో పాటు ఐరన్, విటమిన్ సీ, విటమిన్ ఏ, ఐరన్, పొటాషియం, పీచు పదార్ధం ఉంటుంది.
ఇక పచ్చి మిర్చి వాడకంతో జీవక్రియల రేటు యాభై శాతం వరకూ ఉత్తేజితమవుతుందని పరిశోధకులు పేర్కొంటున్నారు. గ్రీన్ చిల్లీని పరిమిత మోతాదులో వాడితే శరీర ఉష్ణోగ్రతతో పాటు జీవక్రియల వేగం పెరగడం, రక్త సరఫరా మెరుగుపడటంతో పాటు బరువు తగ్గే ప్రక్రియను సరళతరం చేస్తుంది. స్పైసీ ఫుడ్ తీసుకోవడంతో పొట్ట బరువుగా అనిపిస్తుండటంతో క్యాలరీలు తక్కువగా తీసుకుంటారు.
గ్రీన్ చిల్లీలో ఉండే జీవక్రియల వేగాన్ని పెంచే పదార్ధాలతో శరీరంలో గ్లూకోజ్ గ్రహించే శక్తి మెరుగుపడటం ద్వారా రక్తంలో షుగర్ లెవెల్స్ క్రమబద్ధీకరించబడతాయి. గ్రీన్ చిల్లీతో పలు ప్రయోజనాలున్నా వీటిని 12 గ్రాములకు మించి తీసుకుంటే ఇబ్బందులు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పరిమితి మించి పచ్చి మిర్చి వాడితే కడుపు నొప్పి, విరేచనాలు, స్కిన్ అలర్జీ వంటి సమస్యలకు దారితీస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.